Showing posts with label పాట. Show all posts
Showing posts with label పాట. Show all posts

Saturday, September 3, 2011

అమ్మ మనసున సంతసం


సంతసం అహఁ   హఁ  సంతసం
నా హృదయముప్పొంగుచున్నది
నీ వొసంగిన మేలులకై

ఆశీర్వాదపు జల్లులతో తడిపి
అనురాగపు పరిమళములతో నింపి
నీ బహుమానముల నొసగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

విజ్ఞానపు వినువీధులలో
మా జ్ఞానపు లోతులకతీతమై
నా గర్భమున ఫలము నొసంగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

ధాత్రిలో ప్రతి ప్రసవం వేదన చేసి
ధృతినిచ్చి రోదన బాధలు దీర్చి
ప్రతినిత్యం కృపలతో నింపుచున్నందున
సంతసం అహఁ   హఁ  సంతసం

నీవిచ్చిన స్వాస్థ్యములభిమానముతో
నీ దయలో పెద్దల దీవెనలతో పెంచే
బుద్ది కుశలతకై ప్రార్థించ గలిగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం
 ----------------------------------------------------
ప్రతి తల్లి మనసులో పొంగే భావానికి చిన్న ప్రయత్నం

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 
అగష్టస్ -  లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి

గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె  షైనీ లిడియా

అభినందనలతో

Sunday, August 28, 2011

మదిలో మెదిలే అపురూప రూపం


నీ రూపం అది అపురూపం
లీలగా మందార మాలగా
మకరంద ధారగా
నాలో నిలచి, నాలో నింపి
నిన్నే వలపింప చేస్తుంది
నన్నే మరిపింప చేస్తుంది

ఒంటరివేళ తుంటరిగా దరిచేరి
మురిపించి మైమరపించి
ఎదగిల్లి మదినల్లి
కవ్వింతల కలవరింతలతో
కళ్ళలో మెదిలేను

కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి
గిలిగింతల పలవరింతలతో
తలపుల్లో తడిమేను

కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
నా జీవితపు వేదమై కదిలేను

Friday, August 26, 2011

రంగు రంగుల పరిమళం


కొమ్మల నడిగా
రెమ్మల నడిగా
నీలో సొగసు ఎక్కడిదని
పూవులనడిగా
రేకలనడిగా
నీలో పరిమళం ఎక్కడిదని

నీ అపురూపవడిలో
నీ ప్రేమజడిలో
మొలచి తడిసి
వడివడిగా నడయాడగా
నీవిచ్చినదే ఈ సొగసు
నీవిచ్చినదే ఈ పరిమళం

చిలుకలనడిగా
సీతాకోక చిలుకలనడిగా
నీ మేనిలోని వర్ణమెక్కడిదని
నీ సహచర్యంలో
నా దినచర్యలలో
కలిపి పులిమి
నీ చెలిమి నా బలిమి కలిమిగా
నీ విచ్చినదే ఆ వర్ణం
వర్ణానికే పేరిచ్చిన చందం
--------------------------------------------
తొలి సంకలనం హృదయాంజలి (మార్చి 2004) లోనిది

Thursday, August 25, 2011

నీ కోసం నా మది


హద్దులు చెరిపేస్తా నీ కోసం
సరిహద్దులు మార్చేస్తా నీ కోసం
కొండలు దాటి కోనలుదాటి
ఎల్లలులేని కల్లలులేని
నవలోకం నిర్మిస్తా నీ కోసం

వినీలాకాశంలో రంగుల హరివిల్లు తేలేను నీ కోసం
తెరచివుంచిన రంగులమదినే పరిచేస్తా నీ కోసం

గగనంలో మెరిసే తారను తెంపలేను నీ కోసం
రెక్కలువిప్పిన సౌధాలకై ప్రక్కనుండగలనునీ కోసం

విరిసిన వెన్నెల చల్లదనం పట్టలేను నీ కోసం
గుండెలనిండిన అనురాగాన్ని ఆరబోయగలను నీ కోసం

లలిత పదజాలంతో కవితలల్లలేను నీ కోసం
మమతనెరిగిన ఓ మాట పలుకగలను నీ కోసం  

Wednesday, August 24, 2011

ఊగిసలాడే మనసు ఊసులు



చిగురాకుల మాటున దాగిన
ఆకుల కొమ్మల మాటున రెమ్మలదాగిన
కొత్తచిగురల వగరులతో
ఒదిగి ఎదగాలని
ఊగిసలాడుతోంది మనసు

సొగసులొలుకు పూరేకులతో
పూరెమ్మల పరిమళాలలో
చిరుగాలి అలలతోచేరి
కొమ్మకొమ్మను రెమ్మ రెమ్మను తాకాలని
ఊగిసలాడుతోంది మనసు

కూనిరాగాల తుమ్మెదల చేరి
పువ్వు పువ్వున మకరందాన్ని గ్రోలి
తనువంతా మధురంచేసే
ఓ కొత్త రాగమాలపించాలని
ఊగిసలాడుతోంది మనసు

కిలకిలరావల పక్షులతోచేరి
కొమ్మరెమ్మల ఊయలూగి
భాషకందని భావాలతేలి
కోకిలగానాల వగరు పొగరుతో
ఉత్సాహపు చిటారుకొమ్మలు తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
--------------------------------------------

తొలినాళ్ళ మనసు ఊగిసలాట 

Friday, August 19, 2011

నీవు నిండిన మనసు


నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో

కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..

ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..

పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..

ఊయలలూగే మనసు


మనసా ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ

మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల

పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల

గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఎదురుచూపుల దూరాలు
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
మరి మరి తలచి ఊగవే ఉయ్యాల

Wednesday, August 17, 2011

గానం ప్రవాహం కాదా!!


పలకాలి గా రాగం
పాడాలి లే గానం
హృదినిండిన వేళ
మది పొంగి రాదా!
గానం ప్రవాహం కాదా!!

మీటినదెవరో
పలికినదేదో!
చినుకు చినుకుల పలుకులు
పదములల్లిన జల్లులు
తడిసినా వెల్లువ
గానం ప్రవాహం కాదా!!

దాచిన రాగాలు
పలికిన భావాలు
సరిగమల సరాగాలు
గమకాల జావళులు
సవ్వడిచేసే వేళలో
గానం ప్రవాహం కాదా!! 

పులకింతల పున్నమి
నడయాడే చెలిమి
ఆశలే ఊసులై
పూలదారులై పరచి
గుండె రేపే గుబులుతో
గానం ప్రవాహం కాదా!! 


Saturday, August 13, 2011

ఎదురుచూసా ప్రతిక్షణం

ఎదురుచూసా ప్రతిక్షణం
ఊహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం ఇస్తావని

విడివడిపొయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగా...

ముంగురులనే సవరించగ
మోముపై కదలాడిన  వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా ప్రతిక్షణం

సతమతమయ్యే పనులు
మదికలచే గిరులు
కలచి నిలచి కుతకుతలాడగా
కదులుతుంటే
ఊతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులు
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా ప్రతిక్షణం   .

భద్రంగా


ఓ  చెలీ!
అనుభూతులు మాలలుగా
జ్ఞాపకాల పొరలమాటున
దాచాను భావాలే!
రాసాను కావ్యాలే!

తొలిచూపు నవ్వులనే
వాడిపోని రేకులలో
ఏరుకున్న పువ్వులుగా
మనసు పొరల కితాబులో
మలచివుంచాను భద్రంగా

నిదుర రాని కళ్ళలో
నిలుపుకొన్న బొమ్మగా
చెదరిపోని రంగులతో
అల్లుకున్న రుమాలుగా
దాచివుంచాను భద్రంగా


పరాకులో చిరాకులో
ఆదమరచి నేనుండగా
చిరుగాలివై అలరించిన
జారినకురులలో కుసుమంగా
తలచివుంచాను భద్రంగా
---------------------
ఇది రాయటంలో ప్రోత్సాహపు స్పూర్తినిచ్చిన జగతి కి ధన్యవాదములతో

Friday, August 12, 2011

నీలిమేఘం


మేఘం నీలిమేఘం
రంగుల హరివిల్లుకై
చినుకులిచ్చిన మేఘం

వింజామరలా చిరుగాలి స్పర్శతో
యదలో దాచిన వూసులకు
వూతమిచ్చి రేకులు తొడిగి
తునీగలై తారాడగా
తుంపరలనిచ్చిన మేఘం

చినుకు చినుకులారాలి
మనసులో ముడుచుకున్న
భావాలు రాగాలుగా చేసి
కమ్మని గీతాలు నే పాడగా
తనువునే తడిపిన మేఘం

కానరాని చెలియ చూపులు
తరిమి తరిమి వెదకుతుంటే
రెప్పలమాటునున్న కలలు
పురివిప్పి నాట్యమాడగ
పులకరింపచేసిన మేఘం

Thursday, August 11, 2011

పల్లకిలో ఊరేగింపు


పల్లకిలో ఊరేగింపు
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధస్సు
మేనిలో క్రొత్తసొగసు
ఒహోం ఒహోం హోయ్

ఫ్రీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు
గుబాళింపుల పరిమళాలై
ముందునడుస్తూ మున్ముందుకు నడుస్తూ

కలలే ఓ చిగురాకు
పండిన గోరింటాకు
నున్నని బుగ్గలపై చేరి
మెరిసి మురిపిస్తూ మైమరపిస్తూ

గుసగుసలాడే ఆశల ఊసులు
బుస బుస పొంగే కోరికల తూపులు
రాగాలై సరాగాల మేళాలై
వీధుల్లో వినువీధుల్లో ఆలపిస్తూ



Saturday, February 9, 2008

నా పాట నా బొమ్మ


ఓ చెలీ!
దాచాను భావాలే
రాసాను కావ్యాలే

తొలిచూపు నవ్వులనే
వాడిపోని రేకులుగా
మనసు పొరలకితాబులో
మడచివుంచాను బద్రంగా

నిదుర రాని కళ్ళలో
నిలుపుకొన్న బొమ్మగా
చెదరిపోని రంగులతో
అల్లుకున్న రుమాలుగా
దాచివుంచాను బద్రంగా

పారాకులో చిరాకులో
ఆదమరచి నేనుండగా
చిరుగాలివై అలరించిన
జారిన కురులలో కుసుమంగా
తలచి వుంచాను బద్రంగా

Saturday, January 19, 2008

మేఘం నీలి మేఘం - పాట


మేఘం నీలి మేఘం
రంగుల హరివిల్లుకై
చినుకులిచ్చిన మేఘం

వింజామరలా చిరుగాలి స్పర్శతో
యెదలోదాచిన వూసులకు
వూతమిచ్చి రేకులు తొడిగి
తూనిగలై తారాడగా
తుంపరలనిచ్చిన మేఘం

చినుకు చినుకులా రాలి
మనసులో ముడుచుకున్న
భావాలు రాగాలుగా చేసి
కమ్మనిగీతాలై నే పాడగా
తనువునే తడిపిన మేఘం

కానరాని చెలియ చూపులు
తరిమి తరిమి వెదకుతుంటే
రెప్పల మాటునున్న కలలు
పురివిప్పి నాట్యమాడగా
పుకరింపచేసిన మేఘం

Wednesday, January 16, 2008

బ్లాగ్విషయం - పాట

నేను రాసిన పాటలు - 2

పల్లకిలో ఊరేగింపు
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధనస్సు
మేనిలో కొత్త సొగసు
ఒహోం ఒహోం హోయ్

ఫీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు
గులాబీల పరిమళాలై
ముందునడుస్తూ మున్ముందుకు నడుస్తూ
ఒహోం ఒహోం హోయ్

కలలే ఓ చిగురాకు
పండిన గోరింటాకు
నున్నని బుగ్గలపై చేరి
మెరిసి మురిపిస్తూ మైమరిపిస్తూ
ఒహోం ఒహోం హోయ్

గుసగుసలాడే ఆశల ఊసులు
బుస బుస పొంగే కొరికల తూపులు
రాగాలై సరాగాల మేళాలై
వీధుల్లో వినువీధుల్లో ఆలపిస్తూ
ఒహోం ఒహోం హోయ్
(నా చిన్నతనంలో పెళ్ళివూరేగింపు అనగానే పల్లకి, పల్లకీ అలంకరణ, బోయీల లయ, మరచిపోలేని జ్ఞాపకాలు. జ్ఞాపకాలనుంచి నాలుగు పదాలు)

Wednesday, January 9, 2008

ఎదురుచూపుల తలపులు


ఎదురుచూసా ప్రతిక్షణం
వూహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం యిస్తావని

విడివడిపోయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగ

ముంగురులనే సవరించ
మోముపై కదలాడిన వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా

సతమతమయ్యే పనులు
మది కలచే గిరులు
నిలచి కలచి కుతకుతలాడగ
కదులుతుంటే

వూతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులై
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా