Showing posts with label అభిప్రాయాలు. Show all posts
Showing posts with label అభిప్రాయాలు. Show all posts

Sunday, May 15, 2011

అనేక : ఆవలితీరం ( వ్యాసం-1 )


2000-2009 కాలంలో నేను ఎక్కడ, ఎటు, ఎలా… ఇలా నన్ను నేను బేరీజు వేసుకున్నప్పుడు, ఇదే కాలంలో నేను-సాహిత్యపు సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకోవడానికి ఓ మహత్తర అవకాశం చిక్కింది. 1999 సంవత్సరం నాటికి నాకున్న మద్యపానానికి పూర్తి బానిసత్వం నా వ్యక్తిగతం. కంప్యూటరు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉద్యోగావసరం. వొక్కడి సంపాదనతో ఇద్దరిపిల్లలతో నగరంలో అద్దె ఇంట్లో గుట్టుగా మధ్యతరగతి సంసారం చేసుకుంటున్న కుటుంబంలో నా భార్యకూడా పనిచేయాల్సిన అవసరం రావటం , వాటి పరిస్థితుల మధ్య నలిగిపోవటం కుటుంబ జీవితం. నా కుటుంబ పరిస్థితులు ఒడిదుడుకులలో సాగడానికి గల కారణాలను అన్వేషించలేదు కాని, బయట పడటానికి ఓ ఆలంబన కవిత్వం. ఏమి చదివానో ఏమి రాసానో గుర్తులేదు కానీ పదేళ్ళుపైన గడచిపోయాయి. మద్యపాన వ్యసనాన్నుండి నన్ను సంస్కరించిందీ కవిత్వం.

ఇక నా అస్థిత్వ-ఆర్థిక- సామాజిక స్థితిగతులను గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేని స్థితిలోనే వున్నాను.వీటన్నిటి మధ్య “అనేక” పదేళ్ళకవిత్వంలో నాకూ ఓ చోటు దొరకటం లేదా ఆ చోటులోకి నేను చేరుకోవడం గొప్ప విశేషంగా భావిస్తాను నేను.

ఈ కాలంలో మొదలయ్యిన కవితా వార్షిక సంకలనాలు, వివిధ పత్రికల్లో వస్తున్న, అంతర్జాలంలో వస్తున్న వాటిని పరిశీలిస్తూనే వున్నందువల్ల ఇందులోని చాలా కవితలు చదువుతున్నప్పుడు ఇదివరకే ఈ కవిత చదివాను కదా అనే భావన కలిగింది. ఎనిమిది భాగాలున్న ఈ సంకలనంలో 182 కవితలతో 13 పేజీల సంపాదకుల పలుకులు, 373 పేజీల కవిత్వంతో వున్న పుస్తకం. ఎగిరే సీతాకోకచిలుకలు వాలిన అట్ట లోపలవున్న కవిత్వానికి సూచికగా మన కళ్ళముందు ఎగురుతుంటాయి. ఎవరికివారు లోపలికి పయనించాల్సిందే. కానీ నాకు పుస్తకాన్ని వెనుకనుంచి చదవటం అలవాటు. అదే పద్దతిలో చివరనుంచి రెండు భా గాలను చదివాను.

సృజనలోకం, వరంగల్ ప్రచురించిన “కవితా వార్షిక -2006” ను 18 మార్చి 2007 తేదిన, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, హనుమకొండ ఆవిష్కరణ సభలో కొండేపూడి నిర్మల మాట్లాడుతూ వ్యక్త పరచిన అనుమానం నిజం కాదని ఈ సంకలనం నిరూపిస్తుంది. ఎందుకంటే ఈ భాగంలో వున్న (కవులు, కవియత్రులు) ఎక్కువమంది కొత్తవారు మరియు యువకులు ఉండటం విశేషం. ‘మనిషి వస్తువుకింద పడి చచ్చాడు’ ఓ కవి అన్నవాక్యాలను గుర్తుచేస్తూ వస్తువుకున్న ప్రాముఖ్యత సంకలనం ద్వారా యువతరానికి చేరుతుందాయని ప్రశ్నించారు. యువతకోసం చేతులు కాల్చుకోవల్సివుంటుందని చమత్కరించారు. ప్రపంచీకరణమీద ఎలా దాడి చెయ్యాలి అనేది, వక్తీకరణశక్తి మీద ఆధారపడివుంటుంది. నిజమైన కవిత్వానికి, కవికి వేదికలు తక్కువయ్యాయని చెబుతూ ‘చివరి చిరునామా’ తో ముగించారు

అయితే అనేకలోని కొత్త కవులను, అందులోనూ యువతను చూస్తుంటే కొండేపూడి నిర్మల గారి ప్రశ్నకు జవాబు దొరికి నట్టే అనిపిస్తుంది నాకు.

ఆవలితీరం : ఇందులో 17 కవితలు వున్నాయి. ప్రవాసానికి, వలస సాహిత్యానికి ప్రతీకగా ఈ భాగం వుంది. అది వలసపోవటమా లేక ప్రవాసమా ఏదైనప్పటికి ఆ వదిలివెళ్ళిన నేలను, వదిలివెళ్ళిన మనుషులను, జ్ఞాపకాలలోకి లాక్కెళుతుంది. సంగినేని రవీంద్ర కవిత “బొంబాయి బస్సు” మనల్ని కరీంనగర్ బస్సుస్టాండుకు తీసుకువెళుతుంది. వలసపోవల్సిన అవసరాన్ని గుర్తించి వీడ్కోలు చెబుతున్న దృశ్యం లోని భావాలని వొలికిస్తాడు.

నా తల్లి చేతిబువ్వ మల్లెప్పుడో
నా పల్లె మట్టి గంధం మరకెప్పుడో…
అని పలవరిస్తూ, రోదిస్తో కదిలిపోతున్న గుండె బరువు మన హృదయాలలోకి ఇంకడం మొదలౌతుంది. కదిలిపోతున్న బస్సులోంచి..

అయ్యాడ్రైవర్ సార్!
జర ఆరంసే గాడీ చలావో
బస్సులోవున్నది జనం కాదు
అస్తవ్యస్త జీవితాల వ్యధాభరిత కన్నీళ్ళు
ఒలికిపోతాయి సుమా..
జర జాగ్రత్త మరి!!

వదిలివెళ్ళిన ఊరి అందాలను అనుభూతులను నెమరువేసుకుంటూ హేమంతపు వుదయాన్ని మనకళ్ళముందు అక్షరాలతో చిత్రీకరించారు రాధిక రిమ్మలపూడి. వేకువ ఝాములో గుడిలో మేఅకొలుపు గీతాలు, దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు … ఇలా ధనుర్మాసపు అనుభూతులున్న ప్రతివారినీ వారివారి జ్ఞాపకాల్లోకి నడిపిస్తుంది. వలసపోవటంవల్ల ఖాళీ అయిన వూరు, కోల్పోతున్న వునికికై నారాయణస్వామి “యాడికి పోయిన్రు?” కవితలో హృదయ వేదనపడుతూ మనల్నీ అందులోకి నడిపిస్తాడు, మాండలికాన్ని ఆస్వాదించేలా చేస్తాడు.

వూర్లల్ల పిలుద్దామన్నా
ఒక్క వయస్సు పొల్లగాడు
కనబడలేదు…

వూర్లకు వూర్లే
ఎందుకు చిన్నబోయినయోనని
మెండకబోయిన కొమ్మలు
యెక్కలు బట్టి యేడుస్తున్నాయి.

జ్ఞాపకాలను పదిలపర్చుకుంటూ మరువం ఉష “ఈ జాడలు” కవితలో మారుతున్న కాలం జాడల మధ్య వెదకుతున్న జాడలే కనిపిస్తాయి.

తరం మారి ఆ చేతికర్ర
నాన్న చేతికొచ్చినా
అడుగడుగునా తాతయ్య జాడలే
అవసరంలేదని ఆ కవ్వం
అటక మీదకు చేర్చినా
అమ్మమ్మ చిలికిన వెన్న వాసన వీడలేదే
. …
అన్నిటా ఆజాడలే గాఢమైన నీడలే
ఏ జాడ నేను మరువగలను? లేదని ఏజాడకై నేను అన్వేషించను?
నను వీడక నా వెంబడే నడిచే ఈ జాడల్లు, నా గుండె వేసిన వూడలు

నగలపెట్టె ను మనముందు విప్పుతూ నిషిగంధ కనిపిస్తుంది.

నగలు పెట్టె
ఎన్నేళ్ళ అపురూప సేకరణో
పెట్టె నిండిపోయింది
అన్నీ ధరించి
ఆకస్మిల వైభవాన్ని
నీకు పరిచయంచేస్తే
ఏదీ నాకావల్సిన ఆమోదం?
అస్తిత్వానికి ప్రతీకగా
ఇంకా నా ముక్కున మెరుస్తున్న ముక్కుపుడక “

నగలలో కన్పించే పుడక ముక్కుకే వుండాలని నిర్ధారించినట్లు స్త్రీని వస్తువుచేసి ఇదే తన స్థానం అనిచెప్పే వస్తుతనం గురించి చెప్పకనే చెబుతుంది.

ధ్యానంలో కె.వి.ఎస్. రామారావు కుంచెలరంగుల్తో ఇంద్రజాలికుడ్ని దర్శించమంటాడు.

వర్షానంతరంలో – డా. వైదేహి శశిధర్, గుర్తుందా గోదావరీలో వినీల్ కుమార్ ప్రోదిచేసుకునే అనుభవాల జ్ఞాపకాలు, రవికిరణ్ తిమ్మిరెడ్డి బైపోలార్ భూతం, పద్మలత “అన్నీ చెప్పగల భాష” ఇలా కొన్ని అనుభవాలు, అనుభూతులతో ఆవలితీరం సుసపన్నమైదనే చెప్పాలి.

శ్రీ శివారెడ్డి అనేకకు రాసిన ప్రశంస :

అనేక ఒక గొప్ప ప్రయత్నం. నేననుకున్నదీ, చేద్దామనుకున్నదీ, బహుశా కలకన్నదీ అఫ్సరూ, వంశీకృష్ణా చేసి చూపించారు. కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులయిన కవులు, గొప్ప ఊహాశక్తి కలిగిన కవులు, వస్తువులోకి ప్రవేశించి కళానిర్మాణం చేసే కొత్త తరం కవుల కవిత్వంతో ఈ పుస్తకం తేవడం నన్ను ముగ్దుణ్ణి చేసింది. నేనెప్పుడూ నా తరం కవులకీ , నా ముందు తరం కవులకీ చెబుతూ వుంటాను, ఈ కొత్త తరం కవుల్నించి మనం నేర్చుకోవసింది చాలావున్నది అని! ముఖ్యంగా తాజాతనం, వస్తువును ప్రదర్శించే తీరూ, దాన్ని కళారూపంగా మలిచే అభివ్యక్తి లాంటివి. బహుశా ఈ నాటి కవి పైపైకి మట్లాడం మానేసి, ఒకదాని ప్రభావం కలిగించిన అంతర్లోక సంక్షోభాలనించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక కొత్త సందర్భంలో పుట్టడమే వాళ్ళకొక గొప్పవరం. ప్రాగ్మెంటేషన్ అవుతున్న సందర్భంలో జీవితాన్ని అన్ని కోణాలనుంచి అన్ని పార్శాల నుంచి పట్టుకుంటానికి ఈ కొత్త తరం కవులు ప్రయత్నించారని అనేక చూపించింది. అఫ్సర్, వంశీకృష్ణల ముందు మాట ఇదివరకి మనం చూడని లోతుల్ని పార్శ్వాలని స్పృశించే ప్రయత్నంచేసింది.

ఈ భాగంలో అంతర్జాలంనుండి వెలువడిన కవితలను చేర్చడంద్వారా అంతర్జాలంలోని కవిత్వంవైపు అందరి దృష్టి ఆకర్షించగలది ఆశిస్తున్నాను.

అనంతరం

సాహిత్యంలో సూచికలాంటివారు కొందరు ఈ దశాబ్ద కాలంలో తుదిశ్వాసల గవినిలోనికి అడుగు పెట్టారు. అలాంటివారిని జ్ఞాపకం చేసుకోవటం అవసరమే కదా! ఈ భాగం మాత్రం మొక్కుబడిగా చేసినట్లనిపించింది. మరచిన వారిలో కొందరు

మద్దూరి నాగేశ్ బాబు
ఇస్మాయిల్
స్మైల్
గుంటూరు శేషేంద్ర శర్మ
భార్గవీ రావు……..

మిగతా భాగాలగురించి ఇంకోసారి రాస్తాను

**************************  
 పుటలు: 404, వెల : రూ. 199.
    డాలర్లలో : $ 9.99
    సంపాదకులు: అఫ్సర్, వంశీ కృష్ణ
    సారంగ సంపాదకులు: రాజ్ కారంచేడు
    సారంగ బుక్స్ మిగిలిన వివరాలకు: www.saarangabooks.com

    ఇండియాలో ప్రతులకు:
    Palapitta Books
    Flat No: 3, MIG -II
    Block-6, A.P.H.B.
    Baghlingampally,
    Hyderabad-500 044 AP India
    Direct: 040-27678430
    Mobile Phone: 984 878 7284
    Email: palapittabooks@gmail.com
------------------------------------------

Courtesy : Pustakam.net

Wednesday, January 13, 2010

రాధిక ఊరునుంచి మా ఊరికి ప్రయాణం



ఊరు ఒక కమ్మని జ్ఞాపకం. ఆజ్ఞాపకాన్ని నెమరువేస్తున్నప్పుడు కలిగే భావలపరంపర ఎవరి అనుభవాలకు అణుగుణంగా వుంటాయి. నా బాల్యంలో వూరును జ్ఞాపకానికి తెచ్చుకొన్నప్పుడు గోదావరి రేవులు, చింతతోపులు, సీమసింతకాయలు, కుంకుడుచెట్టుపై దెయ్యాలుంటాయనే పుకార్లు, అప్పుడప్పుడూ నేనున్నానని పలుకరించే కాలువ, వీదులలో వీరన్న వెలిగించిన కిరసనాయిలు దీపం, వెన్నెల్లో ఆడే అనేక రకాల ఆటలు, వరికోతలకు వలసవచ్చే కూలీలు, వారి వెంట వచ్చే జానపద ప్రదర్శనాకారులు, రాత్రంతా సాగిన పద్యాలు, పాటలు, నృత్యాలు. సుబ్రహ్మణ్య సశ్టి వుత్సవాలు, హనుమ జయంతి వుత్సవాలు, శరన్నవరాత్రి వుత్సవాలు.
సంవత్సారనికోసారి జరిగే కోడి పందాలకు మేపుతున్న కోడిపుంజులు.
ఉదయ సాయంత్రాలలొ దేవాలయాలనుంచి వినిపించే నాద స్వరం.
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ అంటూ రాత్రి వేళలలో, క్రీస్తునేడు లేచెను అంటూ ఉషోదయంలో కొవ్వొత్తులవెలుగులతో వీదులలో పాడిన పాటలు 
ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వున్నాయి.

అందుకే ఈ కవిత చదిన తర్వాత నన్ను వెంటాడుతూనే వుంది. అందుకే ఈ నాలుగు మాటలు.


నా ఊరు
నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది
తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది
గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి
జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది
తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు
--0--
ఈ కవిత చదివాక నన్ను వెంటాడం మొదలు పెట్టింది. బహుశ నా బాల్యానికి ఊరుతో అనుబంధం వుండటం, నేను కవిత్వం రాయటం మొదలు పెట్టినప్పుడు "మా వూరు" అని కవిత రాయటం కారణం కావచ్చు.
 ఊరు ఒక అనుబంధం, ఊరు ఒక జీవితం, ఊరు ఒక జీవనం, ఊరు ఒక సంస్కృతి.
సమయ సమయాలలో కవులు, రచయతలు, రచయిత్రులు "ఊరు"ను అక్షరాలలొ చిత్రించారు. ఊరితో తమకున్న అనుబంధాన్ని సాహిత్యానికి ముడివేసారు.
వారినందరిని గుర్తుచేయడం నా ఉద్దేశం కాదు కానీ, అలాంటి కోవలోకి చేర్చదగ్గ ఒక కవిత అని చెప్పడం అతిసయోక్తి కాదు.
ఊహ తెలిసినప్పటినుంచి జీవన పరిణామాల్లో మార్పుతో ఊరును వదిలి పట్టణానికో, ప్రవాసానికో వలస వెళ్ళినప్పటి వరకూ ఏర్పడిన అనుబంధం, కొంతకాలం గడిచితర్వాత తిరిగి ఊరిలో అడుగుపెట్టినప్పుడు మనసులో ముసిరిన ఆలోచనలు, రేకెత్తిన అనుబందపు దారాలు, ఒక్కుమ్మడిగా చుట్టు ముట్టినప్పుడు పడిన ఓ సంక్లిష్ట సమయానుభూతి ఈ కవిత.
కవితలో చిన్ని చిన్ని పదాలు, చిన్నిచిన్ని ప్రతీకలు. ఆ ప్రతీకలను తన జీవనశైలితొనో, సాంస్కృతిక నేపథ్యంతోనో కలిగివున్న జీవన వైచిత్రిని గుర్తుచేస్తుంటాయి.  ఆ అనుబందాన్ని కలిగిన వారికి జ్ఞాపకాలు కళ్ళముందు  కదలాడుతున్నట్టే వుంటాయి.

కవిత ఎత్తుగడలో
"నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది"
సహజంగా ఆకు తన దశలు మార్చుకొని పండిన తర్వాత రాలిపోతుంది. అయితే ఇక్కడ రావిచెట్టు తను వెళ్ళిందనే బాధతో ఆకురాల్చేసింది.  పచ్చని ఆకు రాలటం జీవప్రమాణానికి వ్యతిరేకం. అది తన అనుబందాన్నో, స్నేహాన్నో పోగొట్టుకొన్న లేదా విడిపోయిన బాంధవ్యం తాలూకూ బాధ పచ్చదనాన్ని హరింపచేస్తుందనే ధ్వని గాఢతను కలుగజేస్తుంది.

"శిథిల సాక్షం" వెనుక తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాలు, తనకోసం ఎదురుచూపు, తనకు తెలియకుండానే కనుమరుగైన ఆత్మీయతలను గురించిన సమాచారం ఏమీ  తన దగ్గర దాచుకొలేని, మిగిల్చుకోలేని తనాన్ని అనిచెప్పడం బాగుంది. బహుశ ఇది రాధిక కవిత్వ పరణతికి నిదర్శనం అనొచ్చు.

ముగిస్తూ ముగిస్తూ తిరిగి వెళ్ళలేకపోతేనే తన వూరు జ్ఞాపకాలలో పదిలంగా, సజీవంగా ఉండేదనటంలో తను పొందిన అంతఃర్మధనం కనపడుతుంది.

"ఇది నా సొంతవూరు" అని చెప్పుకొలేనివారు, సొంతవూరికి తిరిగి వెళ్ళలేనివారూ వలసలుపోతున్న జీవితాలు పడే బాధ అంతఃర్గతంగా కనిపిస్తుంది.

ఊరికి ఏది సొంతం, ఏది శాశ్వతం అనే ప్రశ్న వుదయిస్తుంది.

యాదృశ్చికంగాను, తన అనుభూతిపరంగానో రాసినవి ప్రతీకలుగా బలాన్ని సంతరించుకున్నాయి.

ఊరి మద్య రావి చెట్టు, రచ్చబండ, గుడిమెట్టు, చెరువుగట్టు, జామచెట్టుకు కట్టిన ఊయల, కాలం తీరి వెళ్లిపోయిన వారు, చరిత్ర ... ఇలా వాడిన పదాలు కేవలం తన మనసులోని అవేదనానుభూతి చెప్పడానికే అయినా వాటి తాలుకు జ్ఞాపకాలు, గుర్తులు, అనుబందాలు ఊరితో అనుబంధంవున్న ప్రతివొక్కరికి కలిగివుంటాయి. అవి పాఠకులను తమజ్ఞాపకాల అంతఃపొరలలోకి లాక్కుపోతాయి.

"చెట్టు జ్ఞానానికి ప్రతీక" అని ఓ ప్రసిద్ద కవి శ్రీ ఇస్మాయిల్  అంటాడు. రావిచెట్టు చాలాకాలం జీవించడం అనేది దాని జీవలక్షణం. జీవించివున్నప్పుడు ఆకులతో పచ్చగావుండాలి కదా! అప్పుడే నలుగురికి నీడని ఇవ్వగలుగుతుంది, పక్షులకు ఆవాసమౌతుంది. అలాంటి జీవ లక్షణాలు కోల్పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తుంది.

రచ్చబండ : నలుగురు ఒక్కచోటచేరి కష్టసుఖాలను, వివాదాలను కలబోసుకున్న ఓ చెట్టునీడ.
రచ్చబండ పెత్తందారీ తనానికి ప్రతీక. రచ్చబండ దగ్గర జరిగే చర్యలు, నిర్ణయాలు ఎక్కువగా  అణిచివేతలే, అధికార దురంహంకారమే.
(రచ్చబండను గురించిన చర్చవైపు వెళ్ళడం నావుద్దేశం కాదు) ఈ కోణంలో చూసినప్పుడు ఆ వ్యవస్థీకృతమైన పెత్తందారీ పద్దతి కి బీటలు వారటం శుభసంకేతమే.
గుడి మెట్లపై కొద్దిసేపు కూర్చోవడంలో అవ్యక్తానుభూతమైన భక్తి ప్రవృత్తి కనిపిస్తుంది.
"పల్లె కన్నీరు పెడుతుందో"అవి గోరిటి వెంకన్న రాసిన పాట  ఊరిలో తరిగిపోతున్న వాటి వైనాలిని గుర్తుచేస్తాయి.
ఇక బాల్యం దాని గుర్తులు ఎవరికి వరికే వూరుతో ముడివేసుకునే అనుబంధం.
 వీటన్నిటిని కలగలిపి ఒక్కచోట చేర్చి స్మృతి పథంలో మెదలడానికి తన ప్రమేయం లేకుండనే జరిగిన ప్రక్రియ ఈ కవిత అక్షర రూపం.
ఈ సందర్భంలో నేను గతంలో రాసిన "మావూరు"ను   ఇక్కడ వుంచుతున్నాను

మా వూరు
ఒకప్పటి మా వూరు
గలగల పారే సెలయేరు
కనుచూపుమేర పచ్చనైన పైరు
గోధూళి వేళ సందడిచేసే కుర్రకారు
కల్మషంలేని మనుషులతీరు
రామాలయంలో రాగాలజోరు
గుంపులుగా సాగే కొంగలబారు
గిత్తలమెడలో గంటలహోరు
లేదూడల గంతుల హుషారు
జాతి కోడిపుంజుల పోరు
వర్తకానికి వారం వారం బజారు
వాకిట్లో రంగవల్లిలల్లినతీరు
పెరట్లో ముద్దబంతి విరిసిన తీరు

నేడు...
తలచినంతనే మావూరు
మదిలో తెలియని బేజారు
ఎక్కడికక్కడ ఓ మాయా బజారు
...........

చివరిగా :
రాధిక కవిత్వం ఇప్పటివరకూ ఏదోరకమైన ప్రేమ భావనలు, అనుభూతి, ఆహ్లాదం కంపిస్తుండేవి
వాటినన్నిటిని ఊరు ఒక దిశనుంచి మరో దిశవైపు మార్చివేసాయి.
ఇలాంటివి మరిన్ని రాయాలని మనసారా కోరుకుంటున్నను.

అభినందనలతో
జాన్ హైడ్ కనుమూరి     

Monday, January 19, 2009

అలలపై కలలతీగలపై మీటిన రాగం

మంచి వ్యాసాన్ని రాసిన తాడేపల్లి వారికి, అరుణ పప్పు గారికి

చదివి స్పందిచి ఫోనులు చేసినవారికి, ఎస్.ఎం.ఎస్. చేసినవారికి

వేగులు పంపినవారికి
గుంపులో పలుకరించినవారికి

అందరికి ధన్యవాదములు
చిన్న సూచన : నేను మద్యపానాన్ని మానే ప్రయత్నం 1999 - 2003 మద్య చేసాను, మానివేసాను అప్పటినుండి దానిజొలికి నేను వెళ్ళలేదు.
అలా సాహిత్యం, బైబిలుసాహిత్యం నన్ను కట్టడిచేసాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.




http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jan/18navya6

Monday, November 26, 2007

చూడండి ... చదవండి

"స్నేహమా" బ్లాగుకు సాహితీలేఖ (http://poddu.net)

విద్యాసాగర్ అంగళకుర్తి గారి వ్యాఖ్య: 24 నవంబరు, 2007 4:45 సాయంకాలం
మీ కవితా పరిశ్రమ అభినందనీయం. మీరు విష్లేషన చెసిన కవితల్లొ అభివ్యక్తి బాగుంది. ఎవరి అనుభవానికి వచ్చిన వాటిని వాళ్ళు రాయడంతో మొదలు పెట్టదం మంచిది. ఐతే ఆ భావాల వెనకున్న సమజాన్ని గమనిస్తూ స్పందిస్తే ఇంక మంచి కవిత్వం వస్తుంది. ప్రయత్నించ మని అందరికీ మీ బ్లాగ్ ద్వారా చెప్పండి. శుభాకాంక్షలతో….

వెంకట్ గారి వ్యాఖ్య:నవంబరు 26, 2007
ఈ కవిత్వాన్ని ఎన్నిసార్లు చదువుతున్నా చిత్రమైన అనుభూతి కలుగుతుంది. అది చాలాసార్లు నదిలోనో, సముద్రానికో స్నానం కోసం వెళ్ళినప్పుడు చిరుకెరటాల మధ్య మోపే మొదటి అడుగు పొందే నీటి స్పర్శలాంటిది. లోపలికెళ్ళేకొద్దీ ఆ స్పర్శ, అనుభూతి మారిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మొదటిపాదం పెట్టాల్సి వచ్చినప్పుడు అదే అనుభూతి, అదే స్పర్శ..”
ఈ ఒక్క వాక్యం తో చెప్పాలనుకున్నదంతా చెప్పేసారు కనుమూరి గారు.
రాధిక గారికీ, జాన్ హైడ్ గారికీ , ఇద్దరికీ అభినందనలు.
వెంకట్

Monday, August 6, 2007

ఈ మద్య నేను చదివిన కవిత " కొయ్యకాలు "



ఏ వో పుస్తకాలు సదురుతుంటే "మువ్వలచేతికర్ర" చేతికొచ్చింది. అటూ ఇటూ తిరగేస్తుంటే "కొయ్యకాలు" కళ్ళముందు నిలిచింది. ఒక్కసారి చదివాను అంతే, కొయ్యకాలును బిగించిన అక్షరాల మద్య నా మనసు బిగుసుకుపోయింది. చదివిన ప్రతీసారీ ఎదో కొత్తరూపంతోనో, ఆలోచనతోనో కనిపించింది. 1987 జూలైలో వచ్చిన సంకలనం 2007 జూలై 30వతేదీన చదవటం యాదృశ్చికమే. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కొత్త పరిమళం, కొత్త చూపు దానిలో నన్ను తాకాయి. కొయ్యకాలు కలిగిన వ్యక్తిలోకి కవి పరకాయ ప్రవేశంచేసి కెమేరా కళ్ళతో తీసిన వర్ణ చిత్రమిది.
నేను అర్థంచేసుకున్న కొయ్యకాలు :

రోజూ అవే అంకెలమీద
తిరిగిన అంకెలమీదే
తిరుగుతున్న గడియారం ముల్లులా..
ఇలా ప్రారంభమైన వాక్యాలు నేటి ప్రస్తుత జీవితాన్ని ప్రతిబింభిస్తున్నాయి. జనరద్దీలో యాత్రికంగా మారిపోయిన జీవితాలు టక్.. టక్.. మని నడిచే కొయ్యకాలుగానే మారిపోతున్నాయి.
ఈ కొయ్య దేనికి ప్రతీక? జీవం కలిగిన చెట్టునుండి వేరు చేయబడిన, చేవ సత్తువ కలిగిన పదార్థం, నాలుగు కాలాలు వుంటుంది. కాని ఏ స్థిలో వుంచితే అదే స్థితిలో. దాని చివరి పర్యవసానం శిథిలమే. గడియారం ముల్లులమద్య తిరుగుతూ శిథిలమౌతున్న మానవీయ విలువలవల్ల జీవనం కొయ్యగా చలించే జీవంలేని పదర్థంగా మారిపోతుంది.
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.


మనిషి వ్యాపారంలో వస్తువుగా మార్చబడకమునుపే, అనుబండాలను, మానవీయ విలువలను పోగొట్టుకున్నాడు. చెట్టు జీవంపోగొట్టుకొని పచ్చదనం కోల్పోయినప్పుడే కొయ్యగా రూపాతరానికి దారితీస్తుంది. ఈ కొయ్యకాలులో ఏ దైనా జవజీవాలు మిగులుంటే తేమ తగిలినప్పుడు చిగురించడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి ప్రయత్నమేదైనా జరిగితే
నన్ను నేను
తలకిందులుగా
పాతుకుంటాను .... అంటాడు
యాంత్రికత మద్య కొయ్యమారుతున్న మనిషినే కొయ్యకాలుగా చూపిస్తున్నాడా అనిపిస్తుంది.
పత్రికల్లో
అందమైన కవిత్వం మద్య
తెల్లమచ్చల గురించి
నల్లవెంట్రుకల గురించి
నరాల బలహీనతలగురించి
అసహ్యమైన ప్రకటనల్లా

ఇక్కడ అప్పటి పత్రికల పరిస్థితి చూపుతున్నాడు, అంటే కకుండా అందమైన ప్రకటనల మద్య అసహ్యమైన ప్రకటనలు కూడా వుంటాయి, అవి కూడా ఏదో బలహీనతలపై దాడి చేసి మనిషిని లొగదీసుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాయని చెపుతున్నాడు.
ఒక్కోసారి మనతో సహజీవనం చేస్తున్నవాళ్ళకంటే మనంనిర్మించుకున్న ఆలోచనల కొయ్యకాలులే బాగుంటయనిపిస్తుంది.

కొయ్య తుపాకులకుగా మారడనికి దోహదంచేస్తున్న, ఖర్చయిపోతున్న దేశ చిత్రపటాన్ని మనముందు పెడ్తాడు। బహుశ జీవన స్రవంతిలో నడిచే కాళ్ళు పోగొట్టుకున్నవాళ్ళు కనీసం
కొయ్య కాలైనాలేనివాళ్ళ కోసం కొయ్యను ఉత్పత్తి చెయ్యమని
నా కొయ్యకాలును ప్రార్థిస్తాను।

కొయ్య కొత్త చిగురులుతొడిగి చెట్టుగా మారి

మళ్ళీ పచ్చదనంల్తో కొత్త కొమ్మలకోసం ఆశను వెలిగిస్తున్నాడు.

.... రుణం తీర్చుకుంటుంది

రుణం తీర్చుకోవడమనేది ఒక పరమార్థ పరాకాష్ట. రుణపడి వుండటంలో అనేకమైన అనుబంధ బాదవ్యాలు కలిగివుంటయి. అనేక అంశాలను స్పృసిస్తున్న ఈ కొయ్యకాలును ఈ నాటి కాల పరిణామాలను ముందుగానే దర్శించి రాసాడా ఈ కవి అనిపిస్తుంది.
కానీ కొన్ని నిర్వచనాత్మకమైన వాక్యాల అవసరం వుందేమో అనిపించింది
ఈ సందర్బం లో కొయ్య గుర్రం జ్ఞాపకమొచ్చింది
... కొయ్యగుర్రం కావ్యమైనప్పుడు కొయ్యకాలును అనకూడదా అనే సందేహం
.... కొయ్యగుర్రం, కొయ్యకాలులో "కొయ్య" రెండిటిలోనూవున్న పదమేనా? ప్రతీక కూడానా ?
... కొయ్యగుర్రం రాజకీయాంశం

కొయ్యకాలు మానవీయాంశం

.... కొయ్య హృదయాన్ని కలిగిన పాలకులను తట్టిలేపే యత్నం కొయ్యగుర్రానిదైతే
కొయ్యగా మారుతున్న ప్రతి హృదయాలను చిగురించాలనే ఆశ కొయ్యకాలుది.
రెండిటిలోనూ వున్నది వేదనేగా !

Friday, July 13, 2007

ఈ మద్య నేను చదివిన ఖాజా కవిత

సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం

కవిత బాగుంది అని సులువుగా చెప్పడం కంటే చాలా చర్చకు పెట్టాల్సిన అంశాలు వున్నాయనిపిస్తుంది.
ఎటు వైపు అనే ప్రశ్న అన్నివిషయాలలోనూ కనిపిస్తుంది.
ఇంగ్లీషును ప్రేమిస్తూ ప్రేమిస్తూ కొత్తరకపు బ్రాహ్మణ్యాన్ని ఆశ్రయిస్తూ, విదేశ సిద్దాంతాలలోకి పారిపోతున్న స్తితి....
పోరాటాలనుంచి ఏదో
పరిష్కారమో విముక్తో దొరుకుతుందనుకుంటే అది ఏ తీరంలోవుందో అనే స్థితిలో.........
అవసరంగానో, హఠాత్తుగాను లాకొచ్చిన దళిత పోరాటం రెండుగా చీలిపోవటం వెనుకవున్న శక్తుల వునికినికి ఎలా అర్థంచేసుకొవాలో అంతుచిక్కని పరిస్తితుల్లో..........
ఆదునికత ఇచ్చే కొత్తకొత్త వసతుల మద్య ఊరును తోసిపుచ్చే, మరిపించే కొత్త రింగు టోన్ల మార్కెట్ మయాజాలపు స్తితిలో.......
ఎవరు పనిచేసారో
ఎవరు పాత్ర ఎంతో ప్రశ్నించలేని స్తితిలో......
మనతొనేవుంటూ మనమెవరమొ తెలియదనే పేతురులు.....
మనమద్య కొత్తదనాన్ని మోసుకు వస్తున్నామని చెప్తూ ఇంకా బానిసలుగా మర్చే సంగదాసులూ ...
మనతోనే వుంటున్న స్తితిలో ....
కవిత బాగుందని కాకుండా
అంశాలను మాట్లాడవలసిన సమయం
అంశాలను చర్చించాల్సిన సమయం
ఈ సమయాల్ని సరిగ్గా గుర్తుచేస్తున్న ఖాజా కు అభినందనలు

డియర్ జాన్
అభిప్రాయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. నిజంగా ప్రస్తుత గ్లోబల్ సందర్భంలో పూర్తిగా రైట్, లేదా పూర్తిగా లెఫ్ట్ భావాలుగానీ సరిపోతాయా, వివిధ వుద్యమాలు, సిధ్ధాంతాలు వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నాయి. మీరన్నట్టు వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాల్సివుంది
..... ఖాజా
July 13, 2007 8:35 PM

ఖాజా బ్లాగు చూడండి

http://khajapoet.blogspot.com/

Sunday, July 8, 2007

అలలపై కవిత్వపు కలలు

అలలపై కవిత్వపు కలలు


కవిత్వంపై ప్రేమను పెంచుకొని, ఒక నిబద్దతతో సాగిపోతున్న కవి జాన్ హైడ్. 'హృదయాంజలి ' తో నడకను సాగించి సంవేదనల, భావముద్రల సమ్మేళనంతో భావనా శక్తిని పెంచుకుంటూ తనదైన స్వరాన్ని బలంగా వినిపించే ప్రయత్నం 'అలలపై కలలతీగ 'ను సవరిస్తున్నాడు. 71 కవితల్లో స్పందింపచేసే ప్రతి సందర్భాన్ని అక్షరీకరిస్తూ బయటి వాతావరణాన్ని హృదయంలోకి ఆహ్వానించడం కనిపిస్తోంది.
"బరువెక్కిన వక్షం
క్షీరమై పొంగేవరకు
కవితై ప్రభవించే వరకు" అని అంటున్న కవి సంవేదనలనేకాదు కవితాక్షరాలను కూడా మోయక తప్పదు. తక్కువ కాలంలోనే కవిత్వపు నుడికారాన్ని అందిపుచ్చుకున్న జాన్ హైడ్ అభినందనీయులు. .....డా. రూప్ కుమార్ డబ్బీకార్

అలలపై కలలతీగపేజీలు 112, వెల : 50/-ప్రతులకు : జాన్ హైడ్ కనుమూరి13-45, శ్రినివాస్ నగర్ కాలనీ,రామచంద్రాపురం, హైదరాబాదు-502 032.ఆంద్ర ప్రదేశ్, ఇండియా
వార్త_ఆదివారం_8.4.2007