Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Saturday, April 21, 2012

ఎగిరిపోతాను


ఎగిరిపోతాను

అప్పుడప్పుడూ
కన్పించని  గాలిపాటకోసం
చెవులురిక్కించి వెతుకుతుంటాను
వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది నీకు

మూసలోకి దిగిపోయిన ఆలోచనలన్నీ
బయటకువచ్చే
బిరడా మూతనెవరైనా తెరుస్తారని చూస్తుంటాను

ఎవరికివారు
మూసల్లోకి దిగిపోయారనే సంగతే గుర్తుకు రాదు!
నాకు నేనే
మూసను బద్దలుకొట్టుకొని
ఏ తీరంలోనో మూర్చబోతాను

గాలిచేసే వింతసవ్వడులమధ్య
ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు!

Thursday, September 29, 2011

ప్రవాహమెటు?


ఇక్కడ
నదులన్నీ
గొట్టపు బావులుగా మారి
గోట్టాల్లో ప్రవహిస్తున్నాయి

నీవు చెప్పే లెక్కలేవీ తప్పుకావు

ప్రవాహ కొనగోటి కోసం
అడవిదారిలొ అహల్య

పరిమళాల అత్తరు పగులగొట్టి
పాదాలకు రాయాలని ఒ మరియ

కొత్తచిగురును తొడగాలని
ప్రసవ వేదన పడుతున్న
ఎన్నొ కొమ్మలు

చల్లని సాయంకాలాల
స్నానమాడాలని
పక్షులు, జంతువులు

ఎదురుచూపంతా
ప్రవాహం కోసం

Tuesday, September 20, 2011

గోదారి అనుబందం -2

 
పడవనెక్కిన బాల్యం
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
 * * * *
( ఫోటో : కొండవీటి సత్యవతి  )

Saturday, September 17, 2011

గోదారి అనుబందం

బాల్యంలో ఈ పచ్చదనాన్ని
నాకెవరో నలుగు పెట్టారు
ఇప్పుడది
గుండెల్లోకి ఇంకింది

**

బాల్యానెవరో చెక్కారు
ఆ బడిలోనో ప్రక్కనున్న గూడిలోనో
ఇప్పుడది
జ్ఞానపు కొమ్మల్లో వూగుతుంది

****
 

ఈతలు నేర్పారెవరో
ఈ నీళ్ళలోనే
ఇప్పుడు
నగరాన్ని ఈదగలుగుతున్నా

**


(అంతర్వేదికి, గోదారికి, కొండవీటి సత్యవతి గారికి, సుజాత గారికి)

Saturday, September 3, 2011

అమ్మ మనసున సంతసం


సంతసం అహఁ   హఁ  సంతసం
నా హృదయముప్పొంగుచున్నది
నీ వొసంగిన మేలులకై

ఆశీర్వాదపు జల్లులతో తడిపి
అనురాగపు పరిమళములతో నింపి
నీ బహుమానముల నొసగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

విజ్ఞానపు వినువీధులలో
మా జ్ఞానపు లోతులకతీతమై
నా గర్భమున ఫలము నొసంగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

ధాత్రిలో ప్రతి ప్రసవం వేదన చేసి
ధృతినిచ్చి రోదన బాధలు దీర్చి
ప్రతినిత్యం కృపలతో నింపుచున్నందున
సంతసం అహఁ   హఁ  సంతసం

నీవిచ్చిన స్వాస్థ్యములభిమానముతో
నీ దయలో పెద్దల దీవెనలతో పెంచే
బుద్ది కుశలతకై ప్రార్థించ గలిగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం
 ----------------------------------------------------
ప్రతి తల్లి మనసులో పొంగే భావానికి చిన్న ప్రయత్నం

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 
అగష్టస్ -  లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి

గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె  షైనీ లిడియా

అభినందనలతో

Sunday, August 28, 2011

మదిలో మెదిలే అపురూప రూపం


నీ రూపం అది అపురూపం
లీలగా మందార మాలగా
మకరంద ధారగా
నాలో నిలచి, నాలో నింపి
నిన్నే వలపింప చేస్తుంది
నన్నే మరిపింప చేస్తుంది

ఒంటరివేళ తుంటరిగా దరిచేరి
మురిపించి మైమరపించి
ఎదగిల్లి మదినల్లి
కవ్వింతల కలవరింతలతో
కళ్ళలో మెదిలేను

కళ్ళుమూస్తే కళ్ళలోచేరి
కళ్ళు తెరిస్తే ఎదలోచేరి
చెక్కిలి చిదిమి కౌగిలి నదిమి
గిలిగింతల పలవరింతలతో
తలపుల్లో తడిమేను

కఠినశిలనైన నన్ను తడిమి, తురిమి
మది తెరచి నను మలచి
ముద్దగా మైనపు ముద్దగా
జీవమై నాదమై
నా జీవితపు వేదమై కదిలేను

Friday, August 26, 2011

రంగు రంగుల పరిమళం


కొమ్మల నడిగా
రెమ్మల నడిగా
నీలో సొగసు ఎక్కడిదని
పూవులనడిగా
రేకలనడిగా
నీలో పరిమళం ఎక్కడిదని

నీ అపురూపవడిలో
నీ ప్రేమజడిలో
మొలచి తడిసి
వడివడిగా నడయాడగా
నీవిచ్చినదే ఈ సొగసు
నీవిచ్చినదే ఈ పరిమళం

చిలుకలనడిగా
సీతాకోక చిలుకలనడిగా
నీ మేనిలోని వర్ణమెక్కడిదని
నీ సహచర్యంలో
నా దినచర్యలలో
కలిపి పులిమి
నీ చెలిమి నా బలిమి కలిమిగా
నీ విచ్చినదే ఆ వర్ణం
వర్ణానికే పేరిచ్చిన చందం
--------------------------------------------
తొలి సంకలనం హృదయాంజలి (మార్చి 2004) లోనిది

Thursday, August 25, 2011

నీ కోసం నా మది


హద్దులు చెరిపేస్తా నీ కోసం
సరిహద్దులు మార్చేస్తా నీ కోసం
కొండలు దాటి కోనలుదాటి
ఎల్లలులేని కల్లలులేని
నవలోకం నిర్మిస్తా నీ కోసం

వినీలాకాశంలో రంగుల హరివిల్లు తేలేను నీ కోసం
తెరచివుంచిన రంగులమదినే పరిచేస్తా నీ కోసం

గగనంలో మెరిసే తారను తెంపలేను నీ కోసం
రెక్కలువిప్పిన సౌధాలకై ప్రక్కనుండగలనునీ కోసం

విరిసిన వెన్నెల చల్లదనం పట్టలేను నీ కోసం
గుండెలనిండిన అనురాగాన్ని ఆరబోయగలను నీ కోసం

లలిత పదజాలంతో కవితలల్లలేను నీ కోసం
మమతనెరిగిన ఓ మాట పలుకగలను నీ కోసం  

Wednesday, August 24, 2011

ఊగిసలాడే మనసు ఊసులు



చిగురాకుల మాటున దాగిన
ఆకుల కొమ్మల మాటున రెమ్మలదాగిన
కొత్తచిగురల వగరులతో
ఒదిగి ఎదగాలని
ఊగిసలాడుతోంది మనసు

సొగసులొలుకు పూరేకులతో
పూరెమ్మల పరిమళాలలో
చిరుగాలి అలలతోచేరి
కొమ్మకొమ్మను రెమ్మ రెమ్మను తాకాలని
ఊగిసలాడుతోంది మనసు

కూనిరాగాల తుమ్మెదల చేరి
పువ్వు పువ్వున మకరందాన్ని గ్రోలి
తనువంతా మధురంచేసే
ఓ కొత్త రాగమాలపించాలని
ఊగిసలాడుతోంది మనసు

కిలకిలరావల పక్షులతోచేరి
కొమ్మరెమ్మల ఊయలూగి
భాషకందని భావాలతేలి
కోకిలగానాల వగరు పొగరుతో
ఉత్సాహపు చిటారుకొమ్మలు తాకాలని
ఊగిసలాడుతోంది మనసు
--------------------------------------------

తొలినాళ్ళ మనసు ఊగిసలాట 

Friday, August 19, 2011

నీవు నిండిన మనసు


నీవే వున్నావు..
నా మనసంతా నీవే వున్నావు
నా తలపుల్లో నా మలుపుల్లో

కనురెప్పల కలత నిదురలో
తళ్ళుక్కున మెరిసే మెరుపులా
రెప్పల్లో కనువిప్పుల్లో
నీవే వున్నావు..

ఉడికించే వడగాలుల్లో
సోలిపోని మల్లెల మాలగా
స్వేదంలో అనుస్వాదనలో
నీవే వున్నావు..

పయనించే జీవన దారుల్లో
తోడుండే ధైర్యపు నీడగా
అడుగుల్లో అడుగుజాడల్లో
నీవే వున్నావు..

ఊయలలూగే మనసు


మనసా ఊగవే ఉయ్యాల
ఊగి ఊగి సాగవే ఈ వేళ

మది కురిసిన వెన్నెల్లో
సన్నని పిల్లగాలి తీవెల్లో
మురిపించే రేయి కౌగిట్లో
మురిసి మురిసి ఊగవే ఉయ్యాల

పట్టాల మెయిలులపై
చెట్టపట్టాల ఈ మెయిలుల్లో
ప్రియుడంపిన సందేశం
తలచి తలచి ఊగవే ఉయ్యాల

గాలి మరచిన ఈ గాలుల్లో
కులుకు జారిన ఈ వేళల్లో
జల్లులా తడిసిన చిన్ని అభినందనకు
తడిసి తడిసి ఊగవే ఉయ్యాల
ఎదురుచూపుల దూరాలు
ఎదను కలిపిన తీరాలుగా
చెవిలో సెల్పోను గుసగుసలను
మరి మరి తలచి ఊగవే ఉయ్యాల

Wednesday, August 17, 2011

గానం ప్రవాహం కాదా!!


పలకాలి గా రాగం
పాడాలి లే గానం
హృదినిండిన వేళ
మది పొంగి రాదా!
గానం ప్రవాహం కాదా!!

మీటినదెవరో
పలికినదేదో!
చినుకు చినుకుల పలుకులు
పదములల్లిన జల్లులు
తడిసినా వెల్లువ
గానం ప్రవాహం కాదా!!

దాచిన రాగాలు
పలికిన భావాలు
సరిగమల సరాగాలు
గమకాల జావళులు
సవ్వడిచేసే వేళలో
గానం ప్రవాహం కాదా!! 

పులకింతల పున్నమి
నడయాడే చెలిమి
ఆశలే ఊసులై
పూలదారులై పరచి
గుండె రేపే గుబులుతో
గానం ప్రవాహం కాదా!! 


Saturday, August 13, 2011

ఎదురుచూసా ప్రతిక్షణం

ఎదురుచూసా ప్రతిక్షణం
ఊహలవేగంతో ఎగిరొస్తావని
కనులలో కదిలే
కలలకే రూపం ఇస్తావని

విడివడిపొయిన ముంగురులు
పడిగాపుల చూపులు
విసిగి వేసారి
నిట్టూర్పుల సెగలైపోవగా...

ముంగురులనే సవరించగ
మోముపై కదలాడిన  వేలికొనలు
గిలిగింతలై నడయాడేనని
ఎదురుచూసా ప్రతిక్షణం

సతమతమయ్యే పనులు
మదికలచే గిరులు
కలచి నిలచి కుతకుతలాడగా
కదులుతుంటే
ఊతమిచ్చే మోతాదుగా
చెవిలో పలికే పలుకులు
మూటల ధైర్యమయ్యేనని
ఎదురుచూసా ప్రతిక్షణం   .

భద్రంగా


ఓ  చెలీ!
అనుభూతులు మాలలుగా
జ్ఞాపకాల పొరలమాటున
దాచాను భావాలే!
రాసాను కావ్యాలే!

తొలిచూపు నవ్వులనే
వాడిపోని రేకులలో
ఏరుకున్న పువ్వులుగా
మనసు పొరల కితాబులో
మలచివుంచాను భద్రంగా

నిదుర రాని కళ్ళలో
నిలుపుకొన్న బొమ్మగా
చెదరిపోని రంగులతో
అల్లుకున్న రుమాలుగా
దాచివుంచాను భద్రంగా


పరాకులో చిరాకులో
ఆదమరచి నేనుండగా
చిరుగాలివై అలరించిన
జారినకురులలో కుసుమంగా
తలచివుంచాను భద్రంగా
---------------------
ఇది రాయటంలో ప్రోత్సాహపు స్పూర్తినిచ్చిన జగతి కి ధన్యవాదములతో

Friday, August 12, 2011

నీలిమేఘం


మేఘం నీలిమేఘం
రంగుల హరివిల్లుకై
చినుకులిచ్చిన మేఘం

వింజామరలా చిరుగాలి స్పర్శతో
యదలో దాచిన వూసులకు
వూతమిచ్చి రేకులు తొడిగి
తునీగలై తారాడగా
తుంపరలనిచ్చిన మేఘం

చినుకు చినుకులారాలి
మనసులో ముడుచుకున్న
భావాలు రాగాలుగా చేసి
కమ్మని గీతాలు నే పాడగా
తనువునే తడిపిన మేఘం

కానరాని చెలియ చూపులు
తరిమి తరిమి వెదకుతుంటే
రెప్పలమాటునున్న కలలు
పురివిప్పి నాట్యమాడగ
పులకరింపచేసిన మేఘం

Thursday, August 11, 2011

పల్లకిలో ఊరేగింపు


పల్లకిలో ఊరేగింపు
తొలి సిగ్గుల మేళవింపు
కళ్ళలో ఇంద్రధస్సు
మేనిలో క్రొత్తసొగసు
ఒహోం ఒహోం హోయ్

ఫ్రీజర్‌లో బద్రమైన ఊహలు
గీజర్‌లో కాగుతున్న ఆశలు
గుబాళింపుల పరిమళాలై
ముందునడుస్తూ మున్ముందుకు నడుస్తూ

కలలే ఓ చిగురాకు
పండిన గోరింటాకు
నున్నని బుగ్గలపై చేరి
మెరిసి మురిపిస్తూ మైమరపిస్తూ

గుసగుసలాడే ఆశల ఊసులు
బుస బుస పొంగే కోరికల తూపులు
రాగాలై సరాగాల మేళాలై
వీధుల్లో వినువీధుల్లో ఆలపిస్తూ



Thursday, June 30, 2011

నేను - సముద్రం- విశాఖ

ఆపుడప్పుడూ చూసే
సముద్రమంటే ఎదో భయం

దూరాన్నుంచి చూస్తున్న
కెరటం ఎగసిపడి
నన్నెప్పుడూ తనలోకి లాక్కోలేదు

అడుగులు ముందుకేసినప్పుడు
పాదాన్ని తాకిన నురుగు
అనంత అనుభవాల లోతుల్లోకి
స్వాగతం పలుకుతోంది

హోరెత్తే ధ్వని పదే పదే చెబుతోంది
అలలపై తేలియాడటం
అలల్లో మునగడం
నా చేతుల్లోనేవుందని.

Saturday, September 12, 2009

ఈ మాటలో నా కవిత - జమ్మి బంగారం చెట్టు

మిత్రులకు, నా బ్లాగు పాటకులకు
నన్ను ప్రోత్సాహించిన వారికి
నమస్సులు
ఈ మద్యకాలంలో సాహిత్యానికి, అంతర్జాలానికి కొద్దిగా దూరంగా వుండవసి వచ్చింది.
దాని పరిస్థితులనుండి బయటపడుతున్న నేపథ్యంలో

ఈ మాటలో నా కవిత వచ్చింది

చదివి, మీ అభిప్రాయాలను రాయండి, కొత్త ఉత్సాహాన్నివ్వండి


అంబులపొదిలో అస్త్రాలేవీ
అక్కరకురానట్టే
సమస్యలు బాణాలై సంధిస్తాయి


http://www.eemaata.com/em/issues/200909/1477.html

మీ

జాన్ హైడ్ కనుమూరి

Tuesday, February 24, 2009

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

హితులెవ్వరూలేని ఈ నిశ్శబ్దపు రాత్రి

చుట్టూ చీకటినిండుతుంటే

ఈ ప్రదేశమంతా భయంతో నిండినప్పుడు

నీవు ఇక్కడవుండి నా భయం పోగొడతావని

నాలో చిరునవ్వు పూయిస్తావని

నా ఆశ!

దురదృష్టం నీవిక్కడలేవు

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

ఇక ఎవరు పట్టించుకుంటారు నన్ను

Tuesday, October 28, 2008

వెలిగే దివ్వెలకోసం యుద్ధమే!



రేపెప్పుడో వెలిగించే దివ్వెలకోసం
సర్వసన్నద్ద యుద్ధం

ప్రతిరోజూ వూడ్చే చీపురుదూరని మూలల్లో
పొందిగ్గా గూడేర్పరచుకున్న
పురుగులతో చిన్న యుద్ధమే!

వెలుగుచూపు కొత్తదనంకోసం
వేసే సున్నపు చినుకులకోసం
ఖాళీచేస్తున్న గదులు
దించుతున్న చిత్రపటాలతో ఓ యుద్ధమే!

చిందరవందరైన వస్తువుల మద్య
ఎప్పుడో పోయిందనుకున్న
పుస్తకమో వస్తువో కళ్ళకెదురైనప్పుడు
తేలికైన దేహానికి దొరికే ఆనందంలో
ఆదమరచిన ప్రియులతో ప్రచ్చన్న యుద్ధమే!

సదురుతున్న షెల్పుల్లోంచి
హటాత్తుగా ఎగిరొచ్చిన వూహల్లా
ముందుపడ్డ పాత ఫొటోలు
లాక్కుపోతున్న అనుబంధాలు
పరుచుకున్న జ్ఞాపకాలను
మూసివేయడమూ ఓ యుద్ధమే!

ఎన్నో యుద్ధాల జయాల ఆనందహేలలో
వెలిగే దివ్వెల పిల్లలనవ్వులు
విరజిమ్మే కాకరపువ్వొత్తులు

చీకటివేళను చీల్చడంకోసం
వెన్నెల నవ్వులను పూయించేందుకు
ఎన్ని యుద్ధాలైనా సిద్దమే నేను!
----
5116
----
దీపావళి అలంకరణకొసం పనిచేస్తూ ఫోనులో మాట్లాడిన సాహితీ మిత్రురాలు
శ్రీమతి రేణుకా అయోలా దీపావళి శుభాకాంక్షల ప్రేరణ