Showing posts with label ఎం.ఎ. తెలుగు - పాఠాలు. Show all posts
Showing posts with label ఎం.ఎ. తెలుగు - పాఠాలు. Show all posts

Saturday, December 15, 2012

సతీష్ చందర్ కవిత్వం - పంచమ వేదం




Photo By: mediafury
నూరేళ్ళకీ పదిహేడు మార్కులే వేసి
జీవితంలో తప్పించిన గురుదేవులకు
చేతులు జోడించి వ్రాయునది

‘నీకు చచ్చినా అర్థం కాదురా’- అని
మీరు తిట్టుకుంటూ చెప్పిన వేళ్ళ మీద లెక్క
నాకు చచ్చాకనే అర్థమయ్యింది.
నేనెన్నిసార్లు లెక్కపెట్టుకున్నా
నాచేతికి నాలుగు వేళ్ళే వుండేవి.
నాన్నకి కూడా అయిదోవేలు లేకనే
మీరు గుండుసున్నలు చుట్టిన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద
ఎప్పుడూ వేలి ముద్ర వెయ్యలేదు.
పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల రోజున కూడా
అవేలు లేకనే,
అమ్మ గోరుముద్దలు తినిపించలేదు.
నేను తెల్లముఖం వేసినప్పుడెల్లా
మీరదేదో అమృతభాషలో తిట్టేవారు.
నాకన్నం తప్ప అమృతం సయించదు.
నిజం చెప్పండి
పంచముడంటే అయిదోవేలు లేని వాడనేనా అర్థం?

మా ముత్తాత ఏకలవ్వుడు చెప్పాడు

II
మీకు ఫీజు ఇవ్వకుండా మరణించినందుకు మన్నించండి.
ఏమివ్వమంటారు?
ప్రాణాలే యిద్దామంటే-
ఇంతవరకూ నా బొందిలో తలదాచుకుని మైలపడ్డాయి.
అదీ కాక మీకు తలంటురోగం!
పోనీ,
అతి సున్నితమైన నా మనోఫలకాన్ని మీకిచ్చేద్దామంటే
నా చావు మీకొచ్చి పడుతుంది.
ఎలా చూసినా మీకు నా దిష్టిబొమ్మనివ్వడమే
ధర్మమనిపిస్తోంది.
ఏ గాంధీ జయంతినాడో మీరు చేసే సహపంక్తి భోజనమ్మీద
చెడుచూపు పడకుండా కాపాడుతుంది.

ఏకలవ్యుడు కూడా
భారతంలో ఓ దిష్టిబొమ్మ

III
మా క్లాసులో పాండవుల్నీ,కౌరవుల్నీ
అడిగినట్లు చెప్పండి
కొత్తగా కేస్ట్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుని క్లాసులో చేరిన కర్ణుడికి
నా సానుభూతిని తెలియజేయండి.
ప్రతిభావంతులు వాళ్ళు
మీ శ్లోకాలకు చప్పట్లు కొట్టేవారు.
నాకు మాత్రం అవి తిట్లులా అనిపించేవి.
నిజం చెప్పొద్దూ
మనుధర్మాలు వాత్సాయన కామసూత్రాల్లా వినిపించేవి.
దేవుడి నాలుగు శరీరమర్మాలూ
అశ్లీల భావ చిత్రాల్లా కనిపించేవి.
నా జన్మరహస్యం మీ శాస్త్రాల్లో రాయనందుకు
నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే.
నన్నేవగించుకోవడానికి మీ నిఘంటువుల్లో
శాపనార్థాలు దొరకనప్పుడెల్లా
నా తల్లి మాటే మీనోట్లో నానుతుండేది
పోనీలెండి, దూషణలోనైనా నా తల్లికే నేను పుట్టానని
ఖరారు చేశారు.
ముమ్మాటికీ మేం తల్లికి పుట్టిన బిడ్డలమే.
అమ్మే మాకు దైవం
గొప్పిళ్ళు వెలివేసిన కుంతెమ్మనయినా
మా యిళ్ళకొస్తే గొంతెమ్మను చేసి కొలుచుకుంటాం

ఏకలవ్యుడు దేవుళ్ళకు కాకుండా
తల్లికే పుట్టాడు

IV
నన్ను దహించింది కిరోసిన్‌ కాదూ-
అభిమానమేనని పత్రికలవాళ్ళతో చెప్పండి
మంటల్లో కాలినప్పుడు నా శరీరమే
నాకు కంపు కొట్టింది.
అచ్చంగా బతికున్న మీ దగ్గర కొట్టే కంపే.
అప్పుడర్థమయ్యింది మాష్టారూ
మీకూ నాకూ వున్న తేడా.
కులం కాల్చకుండానే కంపుకొడుతుంది కదండీ!
మిమ్మల్ని చంపినా పాపం లేదని మావాళ్ళంటున్నారట
అసలు మీరు బతికున్నదెప్పుడు?
ఊపిరితో వుండి తన పిండాకూడు తనే తినేవాణ్ణి
‘సచ్చినోడ’నేది మా అమ్మ.
మీరు నన్ను చూసి నవ్వినప్పుడెల్లా
పెదవుల్లేని పుర్రెదంతాలు కనిపించేవి

వీరుడు ఏకలవ్యుడు
శవాలను చంపడు

V
చివరిగా ఒక్క మాట
నా అంతిమ యాత్రలో పాల్గొన్న
శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి
వాళ్ళ కన్నీటిధారలకు ఊళ్ళో వరదొచ్చిందట కదా!
నేను చూస్తూనే వున్నాను.
వాళ్ళ ఏడుపు ముఖాలమీద మేకప్‌ చెరిగిపోయి
పులిచారలు బయిటపడ్డాయి
వాళ్ళస్మారకోపన్యాసాల నిండా
బ్యాలెట్‌ పెట్టెల ముక్కవాసనే.
అయినా వాళ్ళు నాకెంతో మేలు చేశారు.
నా సజీవదహనానికి
బియ్యం కార్డు మీద కిరోసిన్‌ సరఫరా చేసింది వాళ్ళే.

రేపు అడవిలో ఏకలవ్యుడు
వాళ్ళను ఉచితంగా దహనపరచి
నా రుణం తీర్చుకుంటాడు.

-సతీష్ చందర్
(గురువుల కులపిచ్చికి బలయిపోయిన విద్యార్థులు దాకె బాలాజీ, డొక్కా పద్మనాభరావులకు)
1989
http://satishchandar.com/?p=1151


సతీష్ చందర్  పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 1958 అక్టోబరు 29న జన్మించారు. సతీష్చందర్ పంచమవేదం అనే కవితా సంపుటిని 1995 ఫిబ్రవరిలో ఆవిషరించారు ఇది దళిత కవిత్వానికి మంచి ఊతమిచ్చింది. పంచమవేదం స్పూర్తితో దళిత కవితలు అనేకం వచ్చాయి. దళిత కవిత్వాన్ని, ఉద్యమాన్ని చిక్కబరచాయి. 
సతీష్  చందర్ దళితుడు. వర్ణాధిక్య సమాజాన్ని ఖుణ్ణంగా అధ్యనం చేసినవాడు. వర్ణ జమాజానికి మూలాలెక్కడవున్నాయో, దాని నిర్మూలనకు పరిషారమేమితో, ఆ సమాజాన్ని కాపాడటానికి ఏ శక్తులు పనిచేస్తాయో, ఆ శక్తుల కుయుక్తులను గమనించిన దళితులు వర్ణనిర్మూలకు చేస్తున్న కృషి ఏమిటో కవికి పూరిగా తెలుసు. పత్రికారంగంలో పనిచేయడంవలన సమాజాన్ని లోతుగా, విస్తృతంగా అధ్యయనం చేసే అవకాశం వచ్చి వుంటుంది. రచనా పద్దతినిబట్టి జిజ్ఞాస, శోధన, పరిశోధన, పరిశీలన, పరిష్కారం మొదలైనవి ఆయన దృక్పథానికి మరింత పెట్టినట్లు భావించవచ్చు. పంచమవేదం కవితను గురువులపిచ్చికి బలయిపోయిన విద్యార్థులు దాకె బాలాజీ, డొక్కా పద్మనాభరావులకు అంకింతమిచ్చినట్లుగా కవిత చివిరలో రాసిన మాటలనుబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కవిత ఉత్తమ పురుషలో ఉంది.

పంచములు వర్ణవ్యవథకు అట్టడుగున వున్నవారు, వారు చదువుకోరాదు. చదువులేని జాతి నాగరికతకు దూరమవుతుంది. నాగరికత తెలియని వాళ్ళకు సాంస్కృతిక విలువలే ఉండవు. వికాసం అసలే వుండదు. దళితులకు ఇతరులకులాగా జీవితసౌక్యాలు, సౌకర్యాలు లేవు. ఉండకూడదని వర్ణధర్మం చెపుతోంది. వర్ణధర్మ చట్రంలోని డొల్లతనాన్ని పంచమ వేదం కవిత ఎత్తిచూపుతుంది. ఈ కవితలో కర్ణుడు, ఏకలవ్యుడు కనిపిస్తారు. వీరు గతంలో కులంచేత అవమానింపబడి వచనకు గురైనవాళ్ళు.

మా ముత్తాత ఏకలవ్వుడు చెప్పాడు

ఏకలవ్యుడు కూడా
భారతంలో ఓ దిష్టిబొమ్మ

ఏకలవ్యుడు దేవుళ్ళకు కాకుండా
తల్లికే పుట్టాడు


వీరుడు ఏకలవ్యుడు
శవాలను చంపడు

ఇలా కవిత ఐదుభాగాల చివర్లో ఏకలవ్యుణ్ణి గురించి చెప్పటం పూర్వంనుండి తమకున్న సాంస్కృతిక వారసత్వం, దాన్ని గుర్తించ నిరాకరించిన వర్ణ సమాజం, ఒకవేళ గుర్తించినా దాన్ని నిర్వీర్యం చేసిన విధానాలను తెలియచేసి చరిత్రను తిరగరాసి కొత్త విలువలను ప్రతిపాదించడమే పంచమవేదం కవితలో దళిత దృక్పథం.


ఈ కవితలో ఏకలవ్యుడు, కర్ణుడు గతంలో కులంచేత అవమానింపబడి , వంచనకు గురైనవాళ్ళు. దళితుల పట్ల నిర్దయగా, అమానుషత్వంగా రాజ్యం ప్రవర్తించేలా మనుధర్మం కొన్ని విధులను శిక్షలను నిర్ణయించింది. కౌరవులు, పాండవులు, శకుని, కుంతి లాంటి పేర్లు ఈ కవితలో కనిపించడానికి ఇతిహాస పురాణమంతా రకరకాల కథలను చెప్పినా అంతర్గతంగా వర్ణసంరక్షణ కొసమనే కవి భావనగా గుర్తించాలి. 

ఓట్ల పండుగలకో, కులాధిపత్య కోవలకో ఎందరో దళితులు బలైపోతున్నారు. అలా బలైపోయిన వర్గంలో విద్యార్థి వర్గంకూడా వుంది. ఇలా బలిపోయిన విద్యార్థులకు సానుభూతి తెలియజేయడం అనివార్యమైపోయింది.  



కె. శివారెడ్డి కవిత్వం - కవిత



కవులేం జేస్తారు
***
కవులేం జేస్తారు
గోడలకు నోరిస్తారు
గుట్టకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు
కవులేం జేస్తారు
ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు
ప్రజలకు చేతులిస్తారు
తెల్లకాయితానికి అనంత శక్తినిస్తారు


కవులేం జేస్తారు
చేతుల్లోకింత మట్టి తీసుకొని శపిస్తారు
మణికట్టు దాకా నరికినా
మొండి చేతుల్తో గోడలమీద పద్యాలు రాస్తారు
జేవురు రంగుతో అరక్షణం
గోడలమీద ప్రత్యక్షమయిన పద్యాలు
మరుక్షణంలో
జనం దేహాలమీద ప్రత్యక్షమవుతాయి
దేహాలు సముద్రాల్లాగా దొర్లుతాయి
ఇసుకరేణువులన్నీ పద్యపాదాలై పల్లవిస్తాయి

గోడున్నందుకి ఇంటిని నిందించు
యిల్లుందకు మనిషిని నిందించు
మనుషులున్నందుకు దేశాన్ని నిందించు
మీక్కావలసింది
గోడలులేని యిల్లు, ఇళ్ళులేని మనుషులు
మనుషులు లేని దేశం
మీరు ఎడారి పట్టాభిషక్తులు
ఏలుకోండి ఎడారిని, ఎడారిని ఏలుకోడి


కవులేం జేస్తారు
చట్తాన్ని ధిక్కరిస్తారు
ఎడారిమీద పద్యాలు రస్తారు
ఎడారి క్రమంగా
సజీవ దేశంగా రూపొందుతుంది


కవులేం జేస్తారు
గోడలకు నోరిస్తారు
చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు
ప్రజలకు చేతులిస్తారు
ప్రజల చేతుల్లో
అనంత శక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.
* * *

కె. శివారెడ్డి గుంటూరు జిల్లాలోని కార్మూరివారిపాలెంలో 1943 ఆగష్టు 6న జనించారు. విప్లవకవుల్లో కె. శివారెడ్డి ఒకరు. ఈయన విప్లవ కవితా దృక్పదంతో రక్తసూర్యుడు, చర్య, ఆసుపత్రిగీతం, నేత్ర ధనస్సు, భారమితి, మోహనా! ఓ మోహనా!, అజేయం, నా కలల అంచున, వర్షం, జైత్రయాత్ర వంటి కవితా సంపుటాల్ని ప్రచురించారు. తన విప్లవ కవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంసాల్ని ఆయన పదే పదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. విప్లవకవిత్వం నినాద ప్రాయంగా వుంటుందనే అపవాదుకు ఈయన మినహాయింపు. శివారెడ్డి కవిత్వం అనుభవ మాధుర్యంగానూ, ఆలోచనా నిమగ్నంగానూ, అనుభూతి ధగ్నంగానూ వుంటుంది.


Friday, December 14, 2012

చెరబండ రాజు - కవిత్వం - పాట

 కొలిమంటుకున్నాది
******

 కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా

నీ పక్క పొలమోడు
దుక్కి సాగిండన్న
కాల్జాపి కూకోకు - రామన్నా
కార్తెపోతే రాదు - యినుమన్నా

ఎరువు కావాలింక
గుడిసలేసుకోవాల
నీ బండి పట్టాలు - రామన్నా
కొత్తయే కావాల - యినుమన్నా

ఉత్తరానురిమింది
రోజూ మొగలవుతుంది
ఎర్రమెరుపూ సూడు - రామన్నా
కర్రు పారా సాన - బెట్టన్నా

కంచాన గంజికీ
గద్దలూ కాకులూ
వడిసెల పేనుకో - రామన్నా
వడివడిగా రాళ్ళేసి - కొట్టన్నా

ఇనుప ముక్కలు కొడుకు
లుండిఫలమేముంది
పగలు నిద్రలు మాని - రామన్నా
కూడబెట్టిందేమి - లేదన్నా

చట్టాలు అన్నారు
పట్టాలు అన్నారు
పొలములొ కాలెడితే - రామన్నా
పోలీసులొచ్చేరు - ఏలన్నా

కౌలికిచ్చినోడు
కన్నెర్ర సేసేడు
అప్పులిచ్చినోడు
ఆలినే సూసేడు
దయజెప్పు సర్కారు
దాదాలె అయ్యేరు
నీ దారి గోదారి - రామన్నా
కానీక కదనాన - నిలువన్నా

 కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగా వున్నాది
నిప్పారి పొనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా
కర్రు పారా సాన - బెట్టన్నా
బతుకు యుద్ధములోన - నిలువుమన్నా

కొలిమంటుకున్నాది పాటలో విప్లవ ప్రభోదాన్ని ఒక మేల్కొలుపును మనం గమనించవచ్చు. ఈ పాటలో రైతుల, రైతు పేదల కష్టనష్టాలు చిత్రిత మయ్యాయి. చ్చెరబండరాజు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క చేతి వృత్తిని, కాయకష్టాన్ని స్మరిస్తూ వచ్చాడు. "కొడలుపగలేసినం" మొదలైన పాటలన్నిటినీ మనం గమనిస్తే మనకా విషయం అర్థమౌతుంది. ఈ పాట ఒక మేల్కొలుపుతో ప్రారంభమౌతుంది.
                         కొలిమంటుకున్నాది
                         తిత్తినిండా గాలి
                         పొత్తంగా వున్నాది
                         నిప్పారి పొనీకు - రామన్నా
                         పొద్దెక్కి పోనీకు - లేవన్నా
పోరాటం రాజుకుందని, బతుకు పోరు సిద్దం కావాలని, ఆలస్యం చేయకూడదని కవి ఇందులో అన్యాపదేశంగా సూచిస్తున్నాడు. దుక్కి సాగించే క్రమాన్ని ఆ క్రమంలో చేయాల్సిన పనుల్ని, పంటచేతికి వచ్చినప్పుడు చేతిలో పట్టల్సిన బడిసెలను ఇందులో చెరబండరాజు ప్రసావించారు. ఇంత కష్టపడినా చట్టాలు, పట్టాలు అంటూ ఆ భూమిని స్వంతదారులు  వేరంటూ పోలీసులు సృష్టించే కల్లోలం గురించి కూడా ఇందులో ప్రస్తావన వుంది. కౌలుకిచ్చిన వాళ్ళ, అప్పులిచ్చిన వాళ్ళ సర్కారు దొరల దౌర్జన్యాల గురించి ప్రస్తావన కూడా ఈ పాటలో కనిపిస్తుంది.
నీ దారి గోదారి - రామన్నా
కానీక కదనాన - నిలువన్నా

                           కొలిమంటుకున్నాది
                           తిత్తినిండా గాలి
                           పొత్తంగా వున్నాది
                           నిప్పారి పొనీకు - రామన్నా
                           పొద్దెక్కి పోనీకు - లేవన్నా
                           కర్రు పారా సాన - బెట్టన్నా
                           బతుకు యుద్ధములోన - నిలువుమన్నా


బతుకు పోరులో ఎదురయ్యే కష్టాలను లెక్కచేయకుండా కదనానికి సిద్ధం కమ్మంటూ చెరబండరాజు చేసిన ప్రబోధం ఈ పాటలో వుంది. ఈ పాటలో భూమిని నమ్ముకున్న రైతుల వెతల్ని కవి చిత్రించాడు. ఆలస్యం చేయకుండా బ్రతుకు పోరాటానికి తయారు కమ్మన్నాడు. విప్లవానికి అనువుగావున్న వాతావరణాన్ని సూచిస్తూ, నిప్పరిపోనీకు రామన్నా, పొద్దెక్కి పోనీకు లేవన్నా అని ఉద్భోధించాడు. చట్టాలు, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయవన్న సత్యాన్ని నిర్భయంగా వెల్లడించాడు.

అలలు - శివసాగర్ కవిత్వం -కవిత

..
శివసాగర్ కవిత్వం
*****
అలలు
*****
           అలలపై నిఘా!
           అలలుకనే కలలపై నిఘా!
           చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!

           అలపై కదిలే
           పడవలపై నిఘా!
           పడవల తెరచాపలపై నిఘా!
           పడవల తెరచాపల తెల్లదనంపై నిఘా!

           ఉరికంబం మీద అలలు
           కటకటాల వెనుక  అలలు
           కన్నీళ్ళలో అలలు! అలలు!
           కారడవిలో అలలు! అలలు!
           కడలి జనం ! అలలు దళం!
           అలలు కడలి ప్రాణప్రదం!

           అలల కంఠంపై కత్తి!
           అలల గాయాల నుండి కొన్నెత్తురు!
           సముద్ర దొంగల గుర్రపు డెక్కకింద
           అలల గాయాల నుండి కొన్నెత్తురు!
           కత్తులతో సముద్రం గుండెల్లో గుచ్చుతూ
           పచ్చినెత్తురు తాగుతూ దొంగలు! సముద్ర దొంగలు!

           మట్టికాళ్ళ మహారాక్షసి పుత్రులు
           అన్ని తీరాల్లో తిరుగాడే దొంగలు!
           అలలు ఏడ్చినవి
           విశాల విషాదము సముద్రము
           అలలు ప్రశ్నించినవి
           సముద్రమంతా హోరు
           అలలు కదిలినవి
           సముద్రమంతా పెనుగాలి
           అలల కొసల మంటలు

           సముద్రంలో బడబాగ్ని
           అలలు కదిలినవి
           అలలు హోరెత్తినవి
           అలలు వలయాలు పన్నినవి
          తీర తీరాలు తాకినవి
          ఏకాంత ద్వీపాంతరంలోని
          మట్టికాళ్ళ మహారాక్షసిని కూల్చినవి

          అలల నెవ్వరడ్డగలరు?
          కడలినెవ్వడాపగలరు?
          సముద్రం పురిటి నొప్పులుగా అలలు

          దరిద్రం రేపటికోసం కన్న కలలు
          అలలు సముద్రం చేతి కత్తి
          అలలు సముద్రం చేతికలం
          ఉదయం నిండా అలలు

          అలలు అలలు అలలు
          నీలో నాలో
          అలలు
          అలలు కనే
          కలలు
          కలలు తెగిన
          కలలు

          అలలపైన నిఘా!
          అలలుకనే కలలపై నిఘా!
          అలలపై అనురాగం చూపించే
          చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!

 
విప్లవ రాజకీయాలకు నిబద్దత వహించి, సృష్టించిన సాహిత్యం విప్లవ సాహిత్యమనీ, మార్కిష్టు సిద్దాంతాన్ని సమసమాజ నిర్మాణానికి ఒక సాధనంగా అంగీకరించి ఆచరణలో స్వీకరించి నడిపే రాజకీయాలను విప్లవ రాజకీయాలు అని ష్థూలంగా చెప్పవచ్చు. 1969 లో వెలువడిన తిరగబడు అను కవితా సంకలనం విప్లవ కవిత్వానికి ఒక వైతాళిక గీతంగా పనిచేసింది. విప్లవ కవితా ఉద్యమాన్ని పరిపుష్పం చేసిన కవులలో శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు మొదలగువారు ప్రసిద్ధులు.
అలలు రచన శివసాగర్ చేసినది. 1931 జూలై 15 శివసాగర్ జన్మించిన రోజు. ఇది అతని కలంపేదు. అతని అసలు పేరు కంభంజ్ఞాన సత్యమూర్తి. విప్లవ కవిత్వంఓని వస్తు, రూప వైవిధ్యాన్ని శివసాగర కవిత్వంలో మనం గమనించవచ్చు. విప్లవ వాతావరణంలోచి భిన్నమైన అనుభవాల నేపథ్యాలనుంచి, పోరాటాలనుంచి రూపుదిద్దుకున్న కవిత్వం శివసాగర్ది. కవితా పద్దతిలో శివసాగర్ సంవేదన, లలితమైన భావన, హృదయాంతరాలను తాకే అనుభూతి, అభివ్యక్తి "అలలు" కవితలో కనిపిస్తుంది.
ఈ కవితలోని విప్లవ నిదర్శనాలు, విప్లవ కవులకు సంకేతాలు. "చిరుగాలి సితారా సంగీతం" ప్రజా విప్లవోద్యమం.    మట్టికాళ్ళ మహారాక్షసి ...సామ్రాజ్యానికి చిహ్నం. చాలా స్పష్టమైన, సూచియైన సంకేతాలను ఉపయోగించి కవి ఒక విప్లవ సందర్భానికి సంబంధించిన అవగాహనను పాఠకుల్లో కలిగించడానికి "అలలు" కవితలో ప్రయత్నం చేశాడు.
అలలపై నిఘా
అలలుకనే కలలపై నిఘా
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారపై నిఘా !
అంటూ ప్రజల, విప్లవదళాల చర్యలను ఒక క్రమపరిణామంలో సూచించడానికి ప్రయత్నించాడు

అలలు ఏర్పడినవి
విశాల విషాద సముద్రము
అలలు ప్రశించినవి
సముద్రమంతా హోరు
........
........
మట్టికాళ్ళు మహారాఖసిని కూల్చినవి"
పై మాటలద్వారా ప్రజాదళాల విప్లవాచరణ సామ్రాజ్యవాదాన్ని పెకలించి వేస్తుందనే కవిభావం ఇందులో ప్రస్పుటమవుతుంది.
అలలు సముద్రంచేతికత్తి
అలలు సముద్రం చేతికలం
ఉదయంనిండా అలలు
అలలు అలలు అలలు
అని కవి అనడంలో ప్రజాదళాల విప్లవ కార్యాచరణ, విప్లవ సాంకేతికోద్యమంలో  భాగంగా సాహిత్య సృజన అనే రెండు అంశాలను కవి సూచించాడు. చివరగా అలలపై అనురాగంచూపించే "చిరుగాలి సితారా సంగీతం"పై కూడా నిఘా వుందనడంలో విప్లవోద్యమం పట్ల సామాన్య ప్రజలు కూడా ప్రేమ చూపిస్తున్నారని, పోరాటానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారని ఒక ఆశావ్హమైన చూచనతో కవి కవితను ముగిస్తాడు. విప్లవ పోరాటాలకు సంబదించిన అనుకూల, ప్రతికూల వాతావణాన్ని మన కళ్ళకు కట్టేట్లు చిత్రించడంలో కవి సఫలుడయ్యాడు.