Showing posts with label అమ్మ. Show all posts
Showing posts with label అమ్మ. Show all posts

Thursday, August 23, 2012

ఇంటికెళ్ళివచ్చాక (ప్రవీణ కొల్లి)......నీవు వెళ్ళాక (జాన్ హైడ్ కనుమూరి )


ప్రవీణ కొల్లి శెలవులో ఇండియావచ్చి తిరిగివెళ్ళి  ఇంటికెళ్ళివచ్చాక  అనే కవిత రాసారు


అది చదవగానే నా మనసు ఉద్విగ్నతకు  లోనయ్యింది. ఓ ముప్పయేళ్ళక్రితం నేను మధ్యప్రదేశ్‌లో పనిచేస్తూ ఇంటికివచ్చి తిరిగివెళ్ళాలనుకున్నప్పుడు అమ్మ చేసిన హడావిడి గుర్తుకొచ్చింది

ఎప్పటినుంచో గూడుకట్టుకున్న భావనలు ఒక్కసారిగా పెల్లుబికాయి

ఇక్కడ మీ కోసం రెండు కవితలు మీ కోసం


నేను రాసినవి ఎందరో అమ్మలకి, వారివెనుకున్న నాన్నలకు అంకితం



......................ప్రవీణ కొల్లి



రాత్రంతా వర్షం కురిసి
ఇప్పుడే వెలిసినట్టుంది
తడిసిన గుమ్మం
చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి.

సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ
ఆ ఆవరణంతా ప్రేమమయమే!
“బాగున్నావా తల్లి?”, “అలా చిక్కిపోయావే?”
ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే!

నాన్న పడక్కుర్చీ
అమ్మ గాజుల మోత
వంటింట్లో తాలింపు వాసన
వరండాలో బంధువుల సందడి
అబ్బ…ఎప్పటికీ ఇవి ఇలాగే
నేను ఇక్కడే ఉండగలిగితే ఎంత బాగుండు!

కలవాలనుకున్నా కలవలేకపోయిన స్నేహితులు
ఎవరి జీవితాలలో వారు బిజీ అని సాక్ష్యం చెపుతూ
మరో సంవత్సరానికి వాయిదా పడ్డాయి!
కొత్తగా కలిసిన నేస్తాలు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపాయి.

చాన్నాళ్ళకు కలిసిన తోబుట్టువులతో
కబుర్లు తీరనే తీరలేదు!

బాల్యం, కౌమారం, యవ్వనం
ఇవన్ని హడావుడిగా వెళ్లి పోతాఎందుకో?

గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
ఆటవిడుపుగా వెనక్కి వెళ్ళితే
మరి తిరిగి రావాలనిపించదు!

జ్ఞాపకాల అరలలో
స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా
కాలం కరిగిపోతుందన్న బెంగ తీరక మునుపే
మబ్బులు ముసిరిన ఆకాశం
వర్షించటం మొదలుపెట్టింది
వీడ్కోలిస్తూ…..

**__/\__ **

|నీవు వెళ్ళాక|


.................జాన్ హైడ్ కనుమూరి



నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది

నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
నా పనులు చేస్తున్నప్పుడు
నీవు చేసిన సవ్వడులు
ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి

ఎదో మిషతో
నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
బాధ్యతల గుమ్మానికి
ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
బంధించాలనే వూహలన్నీ
పురిలేని దారాలయ్యాయి

చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
ఎగరటం ఎలా అని అడిగిన నువ్వు
అనురాగాలన్నీ ప్రక్కనపెట్టి
హఠాత్తుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు

నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు

నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
మళ్ళీ వచ్చేదెపుడోనంటూ
ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
కేలండరును కత్తిరిస్తుంటాము

అప్పుడప్పుడు
ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడుల్లో
నీవున్నావని భ్రమపడి
బయటకొచ్చేలోగా
విశాలాకాశంలో అదృశ్యమౌతుందా తలపు

నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు

తలపుల్తో పాటు
తలపుల్ని మూసి
చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
నిద్ర రాక తూగుతుంటాము

**************అమ్మలందరికి అంకితం**************


Sunday, July 22, 2012

అమ్మ తన అస్థిత్వాలను ఇక్కడే వదిలి వెళ్ళిన రోజు



***

ఇప్పుడు
అమ్మొక వాస్తవ అనుభవాల జ్ఞాపకం
అనుభవమైన జ్ఞాపకం అక్షరాల్లో ఇముడుతుందా!!

నన్ను శిశువుగా మోస్తూ మోస్తూ
పొందిన అనుభూతిని ఎలా రికార్డు చెయ్యాలి!

గోరుముద్దల తప్పటడుగుల బాల్యం
ఏ మురిపాలను మూటగట్టిందో ఎలా విప్పాలి!

నా లేత దేహానికి పొంగు కమ్మి
వారాలు గడుస్తున్నా తగ్గని కురుపులతో విలవిలలాడుతున్నప్పుడు
మందులిచ్చిన ఆచారి మాష్టారు
పిల్లాడికి ఇష్టమైనదేదైనా  చేసిపెట్టమనిచెబితే
నా ఇష్టాన్ని తెలుసుకొని
రాత్రంతా నిదురకాచి వండిన కజ్జికాయల్లో
ఏ పాళ్ళలో ఏమి కలిపివండిందో ఇప్పుడు ఎలా తెలిసేది

* * *

ఏడుగుర్ని కన్నందుకు
గర్భం ధన్యమా!
పురిటినొప్పులు సహించిన శరీరం ధన్యమా!!


సుఖదుఖాఃలను తుంగచాపలుగా అల్లి
మోకరించిన వేకువ జాములు ధన్యమా!!



అమ్మా!!
నా జ్ఞాపకాలపొదిలో నీరూపం
చెదరకుండా
ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాయి            

నీవు కోరుకున్న ఆశీర్వాదాలేవో
నాపై కుమ్మరింప బడుతూనేవున్నాయి


Saturday, September 3, 2011

అమ్మ మనసున సంతసం


సంతసం అహఁ   హఁ  సంతసం
నా హృదయముప్పొంగుచున్నది
నీ వొసంగిన మేలులకై

ఆశీర్వాదపు జల్లులతో తడిపి
అనురాగపు పరిమళములతో నింపి
నీ బహుమానముల నొసగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

విజ్ఞానపు వినువీధులలో
మా జ్ఞానపు లోతులకతీతమై
నా గర్భమున ఫలము నొసంగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం

ధాత్రిలో ప్రతి ప్రసవం వేదన చేసి
ధృతినిచ్చి రోదన బాధలు దీర్చి
ప్రతినిత్యం కృపలతో నింపుచున్నందున
సంతసం అహఁ   హఁ  సంతసం

నీవిచ్చిన స్వాస్థ్యములభిమానముతో
నీ దయలో పెద్దల దీవెనలతో పెంచే
బుద్ది కుశలతకై ప్రార్థించ గలిగినందున
సంతసం అహఁ   హఁ  సంతసం
 ----------------------------------------------------
ప్రతి తల్లి మనసులో పొంగే భావానికి చిన్న ప్రయత్నం

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న 
అగష్టస్ -  లీనాల కుమారుడు రాల్ప్ సుందర్ సింగ్ కనుమూరి
సత్యానంద్ - పద్మల కుమారుడు చైతన్య కనుమూరికి

గాబ్రియేలు - కృపారోజ్ ల కుమార్తె  షైనీ లిడియా

అభినందనలతో

Monday, March 8, 2010

మహిళా దినోత్సవ సందర్భంగా- కొన్ని జ్ఞాపకాలు


ఈరోజు చాలా విషయాలతో టపా రాయాలని వుదయమే అనిపించింది. కొన్ని ఆలోచనలు మనసున తొలిచాయికూడా. ఆఫీసుకు వెళుతూ కొన్ని మననం చేసుకున్నాను. ఆఫీసులో అడుగు పెట్టాక దాని సంగతే మరిచిపోయా. ఇదిగో ఇప్పుడు(సాయత్రం 7.50గంటలకు)  మళ్ళీ గుర్తుకువచ్చింది.
మననం చేసుకున్న విషయాలు ఒక్కటికూడా గుర్తు రావటంలేదు.
అయినా చిన్న ప్రయత్నం 
-- 0 --
అమ్మనుగురించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే వుంటాయి.
క్రైస్తవనమ్మకం ప్రకారం బంగారువీధులున్న  పట్టణానికి  అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.
తను మోకరించిన వేకువ జాములు, తొలివెలుగుల పక్షుల కిలకిల రావాలతో గొంతుకలిపి ఆలపించిన స్తుతిగీతాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి.
నిద్రలో మరో కల
అడుగులు నేర్వని
బుడుగు పాదాలను కడిగిన వేళ
జారుడు వూగిసలాటలో
మెరిసిన బిందువుగా
ముద్దుల వర్షంలో ఆవిరయ్యాయి
పదంనేర్చి పథం ప్రాకులాటలో
పొరలమాటున దాగిన
ఈ వన్నె దేహాన్నంటి
జారుతున్న బిందువులపై
ప్రసరించి మెరిసిన కిరణపు వెలుగు
తళుకు కాంతులైనప్పుడు
నీ ఆశల కిరణాలుగా చుటుముట్టాయి
నాకోసం పరిశమించిన పాదాలను ముద్దాడలనివుంది
నేనందుకోలేని దూరంలో నీ పాదాలు
ని రెప్పలు నిద్రలో మరోకల కంటున్నాయి
నా కోసం
--0--
ఊహ తెలిసినప్పుడు నాతో నడిచి, నాకు ఎన్నో నేర్పించి దిశా నిర్దేసాల ఆలోచనా గమనం.    
తను డాక్టరైతే నేను కాంపౌడర్ని, తను ఓ కొట్టుపెడితే నేను సామను అందిచే కూలివాణ్ణి ఇలా ఎన్నో ఆటలలో, వయసులో తనే నాముందున్నా భోజనం దగ్గర మాత్రం నేదే ముందు.

యువతగా వున్నప్పుడు తను చదివిన పుస్తకాలను నాకు చెబుతున్నప్పుడు నాకు తలనొప్పి తెస్తుందనుకున్నా, ఇప్పుడిప్పుడే సాహిత్యాన్ని అద్యయనం చేస్తున్నప్పుడు ఆమే నా ఎదురుగా ఎవో వివరిస్తున్నట్లే అనిపిస్తుంది     అమె నా అక్క. నా ఆలోచనా ధారకు అంబులపొది.
జ్ఞాపకాల వాకిటముందు ప్రణమిల్లుతున్నాను 
--0--

ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి (పాతవే  అయినా) ఈ నాలుగుమాటలు 
దృశ్యం-1

మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.


దృశ్యం-2

సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి

సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది

నేనే చెలమగా చూస్తుండిపోయా
--
అందుకే ప్రేమిస్తున్నానని కాకుండా ఇంకా ప్రేమిస్తున్నానని చెబుతున్నా.   
-- 0--

 
వసంతగానం ఎప్పుడూ మదురంగానే వుంటుంది.
నన్ను కన్న అమ్మను ఎన్ని సార్లు అమ్మా అని పిలిచానో గుర్తులేదుకాని, నాచిన్ని తల్లులు ఎదపై ఆడుకున్న బుల్లి పాదాల ముద్రలు నన్ను నిత్యం పరవసింప చేస్తూనేవుంటాయి.
అమ్మా అనిపిలవటం కన్నా ఏమి చెయ్యగలను.

--0--
మొన్నీ మద్యే ఎదో సందర్భంలో  మహిళ పదానికి నిగంటువు వెదికాను.    భూమినుంచి వచ్చినది అనే స్పురణ కలిగింది. ఆ ఓర్పు, సహనం, ప్రేమ, కరుణ, ధీరత కలిగిన  మహిళలందరికి శుభాకాంక్షలు.
--0--
జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతాయి? జరిగిపోయినది ఎదో కళ్ళెదుటలేనప్పుడే కదా! బహుశ మీరు భౌతికంగా ఇక్కడలేని అమ్మను మాట్లాడుతున్నారా??
బంగారు వీధులున్న పట్టణానికి వెళ్ళిన అమ్మ దగ్గరకు నేనూ వెళతాను చెప్పటానికి మీరు చేసింది సాహమే అనిపిస్తుంది నాకు.
మీకు జ్ఞాపకమొస్తున్న శబ్దరాగాలు కొంచెం హృదయపు చెవినిపెడితే మాకూ లీలగా వినబడుతున్నాయి.
అవును నిజమే!
అమ్మ ఎప్పుడూ మనకోసమే కలకంటూ వుంటుంది
అది బాల్యంలో లాలపోసి తడిసిన దేహాన్ని ముద్దులతో ఆవిరిచెయ్యాడం వెనుక
ఆమెలోదాగిన ప్రేమ ఎంతఘాడంగా వుంటుందో కదా!
శ్రమకు కారే బిందువుల్లోంచి సాధిస్తున్నవి విజయాలైనా అమ్మకు వెలుగుచిమ్మే నవ్వులకన్నా సహచర్యమెంతో గొప్పగా పలవరిస్తుంది.
అన్నిటిని గుర్తించిన అక్షరాలు అభినందనీయమైనవి. స్నేహితులుగా, బాల్యమిత్రులుగా అక్కా తమ్ముళ్ళు, అనా చెల్లెళ్ళుగా వుండటం ఒక మధురమైన అనుభూతే అయినా దాన్ని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడం నిజంగా ప్రశంసనీయం.
----

"ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి" ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా ఎదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటా కొత్తదనం అనేది అర్థం కావటంలేదు.
ఇక రెందుదృశ్యాలను చూస్తూ చదువుతున్నప్పుడు ఎప్పుడో చూసిన క్లియోపాత్రా సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఎవ్వరికి తలవంచని సీజర్ (రోమా చక్రవర్తి) ఐ బవ్ అని మోకాళ్ళపై అమె ముందు నిలబడతాడు.
అలా మీరు కనిపిస్తున్నారు.
--- పిల్లలను అమ్మా అని పిలిచి అమ్మను గౌరవిస్తున్నారో
అమ్మను గుర్తు చేసుకుంటూ పిల్లలను ప్రేమిస్తున్నారో
ఇద్దరూ జెండరు ప్రకారం స్త్రీలే కావటం కాకతాళీయమా! ??

నాకూ ఎవేవో రాయల్నిపిస్తునాదండోయ్ మీ టపా చదివాక

అభినందనలు
అపూర్వ 



Monday, May 11, 2009

అమ్మ సంకలనం అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది.

అమ్మ సంకలనం అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది.
అయినా నాకు ఈ మద్యనే దానికొసం పనిచేసినట్టు అనిపిస్తుంది.
ఈ ఏడాది కాలంలో మరేది చెయ్యలేకపోయాను.

మదర్స్ దినోత్సవ సందర్బంగా అమ్మను ప్రత్యేక దృష్టితోనూ, ప్రత్యేకమైన ప్రేమతోనూ జ్ఞాపకంచేసుకోవడంలోని దివ్యమైన అనుభూతి ఎన్ని సంకలనాలు చేసినా తీరదు.

నా నలబై తొమ్మిదేళ్ళ జీవితం కళ్ళముందు కనిపిస్తుంది. అందులో అమ్మతోటి అనుబందం, జ్ఞాపకాలు అనిర్వచనీయమే.

అందుకే అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాను.

నా జీవితంలో వొడిదుడుకుల సమయంలో నన్ను వూరడించి, వెన్నుతట్టిన నా సహచరి, నా ప్రక్కటెముక ఎన్నోసార్లు అమ్మలాగే కనిపిస్తుంది.

ఎన్నటికీ అమ్మను కాలేని వాణ్ణే, అందుకే అమ్మతనంముందు ప్రణమిల్లుతున్నాను.

Saturday, May 10, 2008

బ్లాగర్లకు విన్నపం - మదర్స్ డే



(photo Nanacy)

అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు
అక్షరాలు, ఆలింగనాలు
నడక నడత
ఆనురాగాలు ఆత్మీయతలు
ఇంకా ... ఇంకా..
మీ గళంనుండి కలం నుండీ పంచుకోండి
ఓ మరుపురాని జ్ఞాపకాన్ని తయారు చేద్దాం


మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.

లింకు ఇవ్వడం మర్చిపోకండి

పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.

john000in@gmail.com

బ్లాగర్లకు విన్నపం

అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం

మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.

పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com

మదర్స్ డే - నేను అమ్మ

రోడ్డుపై నేను ... అమ్మ

అప్పుడే

చీకటి పులుముకుంటుంటోంది

చలి మెల్లగా పంజా విసురుతోంది

శాలువా కప్పుకున్న... అమ్మ

నడుస్తున్నాం ఇద్దరం

దూరం తెలియకుండా

ఏవో చెబుతోంది అమ్మ

నేడు

అదే దూరం

అదే రోడ్డు

అదే చలి

చెంత అమ్మలేదు

అయినా...

ఎన్నో సంగతులు

నన్ను కప్పేవున్నాయి

శాలువాలా !

-----------------
అమ్మ జ్ఞాపకం