***
ఇప్పుడు
అమ్మొక వాస్తవ
అనుభవాల జ్ఞాపకం
అనుభవమైన
జ్ఞాపకం అక్షరాల్లో ఇముడుతుందా!!
నన్ను శిశువుగా
మోస్తూ మోస్తూ
పొందిన
అనుభూతిని ఎలా రికార్డు చెయ్యాలి!
గోరుముద్దల
తప్పటడుగుల బాల్యం
ఏ మురిపాలను
మూటగట్టిందో ఎలా విప్పాలి!
నా లేత దేహానికి
పొంగు కమ్మి
వారాలు
గడుస్తున్నా తగ్గని కురుపులతో విలవిలలాడుతున్నప్పుడు
మందులిచ్చిన
ఆచారి మాష్టారు
పిల్లాడికి
ఇష్టమైనదేదైనా చేసిపెట్టమనిచెబితే
నా ఇష్టాన్ని
తెలుసుకొని
రాత్రంతా
నిదురకాచి వండిన కజ్జికాయల్లో
ఏ పాళ్ళలో ఏమి
కలిపివండిందో ఇప్పుడు ఎలా తెలిసేది
* * *
ఏడుగుర్ని
కన్నందుకు
గర్భం ధన్యమా!
పురిటినొప్పులు
సహించిన శరీరం ధన్యమా!!
సుఖదుఖాఃలను
తుంగచాపలుగా అల్లి
మోకరించిన వేకువ
జాములు ధన్యమా!!
అమ్మా!!
నా
జ్ఞాపకాలపొదిలో నీరూపం
చెదరకుండా
ఇప్పుడు నన్ను
నడిపిస్తున్నాయి
నీవు కోరుకున్న
ఆశీర్వాదాలేవో
నాపై కుమ్మరింప
బడుతూనేవున్నాయి
No comments:
Post a Comment