Showing posts with label సతీష్ చందర్ కవిత్వం. Show all posts
Showing posts with label సతీష్ చందర్ కవిత్వం. Show all posts

Saturday, December 15, 2012

సతీష్ చందర్ కవిత్వం - పంచమ వేదం




Photo By: mediafury
నూరేళ్ళకీ పదిహేడు మార్కులే వేసి
జీవితంలో తప్పించిన గురుదేవులకు
చేతులు జోడించి వ్రాయునది

‘నీకు చచ్చినా అర్థం కాదురా’- అని
మీరు తిట్టుకుంటూ చెప్పిన వేళ్ళ మీద లెక్క
నాకు చచ్చాకనే అర్థమయ్యింది.
నేనెన్నిసార్లు లెక్కపెట్టుకున్నా
నాచేతికి నాలుగు వేళ్ళే వుండేవి.
నాన్నకి కూడా అయిదోవేలు లేకనే
మీరు గుండుసున్నలు చుట్టిన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద
ఎప్పుడూ వేలి ముద్ర వెయ్యలేదు.
పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల రోజున కూడా
అవేలు లేకనే,
అమ్మ గోరుముద్దలు తినిపించలేదు.
నేను తెల్లముఖం వేసినప్పుడెల్లా
మీరదేదో అమృతభాషలో తిట్టేవారు.
నాకన్నం తప్ప అమృతం సయించదు.
నిజం చెప్పండి
పంచముడంటే అయిదోవేలు లేని వాడనేనా అర్థం?

మా ముత్తాత ఏకలవ్వుడు చెప్పాడు

II
మీకు ఫీజు ఇవ్వకుండా మరణించినందుకు మన్నించండి.
ఏమివ్వమంటారు?
ప్రాణాలే యిద్దామంటే-
ఇంతవరకూ నా బొందిలో తలదాచుకుని మైలపడ్డాయి.
అదీ కాక మీకు తలంటురోగం!
పోనీ,
అతి సున్నితమైన నా మనోఫలకాన్ని మీకిచ్చేద్దామంటే
నా చావు మీకొచ్చి పడుతుంది.
ఎలా చూసినా మీకు నా దిష్టిబొమ్మనివ్వడమే
ధర్మమనిపిస్తోంది.
ఏ గాంధీ జయంతినాడో మీరు చేసే సహపంక్తి భోజనమ్మీద
చెడుచూపు పడకుండా కాపాడుతుంది.

ఏకలవ్యుడు కూడా
భారతంలో ఓ దిష్టిబొమ్మ

III
మా క్లాసులో పాండవుల్నీ,కౌరవుల్నీ
అడిగినట్లు చెప్పండి
కొత్తగా కేస్ట్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుని క్లాసులో చేరిన కర్ణుడికి
నా సానుభూతిని తెలియజేయండి.
ప్రతిభావంతులు వాళ్ళు
మీ శ్లోకాలకు చప్పట్లు కొట్టేవారు.
నాకు మాత్రం అవి తిట్లులా అనిపించేవి.
నిజం చెప్పొద్దూ
మనుధర్మాలు వాత్సాయన కామసూత్రాల్లా వినిపించేవి.
దేవుడి నాలుగు శరీరమర్మాలూ
అశ్లీల భావ చిత్రాల్లా కనిపించేవి.
నా జన్మరహస్యం మీ శాస్త్రాల్లో రాయనందుకు
నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణే.
నన్నేవగించుకోవడానికి మీ నిఘంటువుల్లో
శాపనార్థాలు దొరకనప్పుడెల్లా
నా తల్లి మాటే మీనోట్లో నానుతుండేది
పోనీలెండి, దూషణలోనైనా నా తల్లికే నేను పుట్టానని
ఖరారు చేశారు.
ముమ్మాటికీ మేం తల్లికి పుట్టిన బిడ్డలమే.
అమ్మే మాకు దైవం
గొప్పిళ్ళు వెలివేసిన కుంతెమ్మనయినా
మా యిళ్ళకొస్తే గొంతెమ్మను చేసి కొలుచుకుంటాం

ఏకలవ్యుడు దేవుళ్ళకు కాకుండా
తల్లికే పుట్టాడు

IV
నన్ను దహించింది కిరోసిన్‌ కాదూ-
అభిమానమేనని పత్రికలవాళ్ళతో చెప్పండి
మంటల్లో కాలినప్పుడు నా శరీరమే
నాకు కంపు కొట్టింది.
అచ్చంగా బతికున్న మీ దగ్గర కొట్టే కంపే.
అప్పుడర్థమయ్యింది మాష్టారూ
మీకూ నాకూ వున్న తేడా.
కులం కాల్చకుండానే కంపుకొడుతుంది కదండీ!
మిమ్మల్ని చంపినా పాపం లేదని మావాళ్ళంటున్నారట
అసలు మీరు బతికున్నదెప్పుడు?
ఊపిరితో వుండి తన పిండాకూడు తనే తినేవాణ్ణి
‘సచ్చినోడ’నేది మా అమ్మ.
మీరు నన్ను చూసి నవ్వినప్పుడెల్లా
పెదవుల్లేని పుర్రెదంతాలు కనిపించేవి

వీరుడు ఏకలవ్యుడు
శవాలను చంపడు

V
చివరిగా ఒక్క మాట
నా అంతిమ యాత్రలో పాల్గొన్న
శకుని మామలకు ధన్యవాదాలు చెప్పండి
వాళ్ళ కన్నీటిధారలకు ఊళ్ళో వరదొచ్చిందట కదా!
నేను చూస్తూనే వున్నాను.
వాళ్ళ ఏడుపు ముఖాలమీద మేకప్‌ చెరిగిపోయి
పులిచారలు బయిటపడ్డాయి
వాళ్ళస్మారకోపన్యాసాల నిండా
బ్యాలెట్‌ పెట్టెల ముక్కవాసనే.
అయినా వాళ్ళు నాకెంతో మేలు చేశారు.
నా సజీవదహనానికి
బియ్యం కార్డు మీద కిరోసిన్‌ సరఫరా చేసింది వాళ్ళే.

రేపు అడవిలో ఏకలవ్యుడు
వాళ్ళను ఉచితంగా దహనపరచి
నా రుణం తీర్చుకుంటాడు.

-సతీష్ చందర్
(గురువుల కులపిచ్చికి బలయిపోయిన విద్యార్థులు దాకె బాలాజీ, డొక్కా పద్మనాభరావులకు)
1989
http://satishchandar.com/?p=1151


సతీష్ చందర్  పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 1958 అక్టోబరు 29న జన్మించారు. సతీష్చందర్ పంచమవేదం అనే కవితా సంపుటిని 1995 ఫిబ్రవరిలో ఆవిషరించారు ఇది దళిత కవిత్వానికి మంచి ఊతమిచ్చింది. పంచమవేదం స్పూర్తితో దళిత కవితలు అనేకం వచ్చాయి. దళిత కవిత్వాన్ని, ఉద్యమాన్ని చిక్కబరచాయి. 
సతీష్  చందర్ దళితుడు. వర్ణాధిక్య సమాజాన్ని ఖుణ్ణంగా అధ్యనం చేసినవాడు. వర్ణ జమాజానికి మూలాలెక్కడవున్నాయో, దాని నిర్మూలనకు పరిషారమేమితో, ఆ సమాజాన్ని కాపాడటానికి ఏ శక్తులు పనిచేస్తాయో, ఆ శక్తుల కుయుక్తులను గమనించిన దళితులు వర్ణనిర్మూలకు చేస్తున్న కృషి ఏమిటో కవికి పూరిగా తెలుసు. పత్రికారంగంలో పనిచేయడంవలన సమాజాన్ని లోతుగా, విస్తృతంగా అధ్యయనం చేసే అవకాశం వచ్చి వుంటుంది. రచనా పద్దతినిబట్టి జిజ్ఞాస, శోధన, పరిశోధన, పరిశీలన, పరిష్కారం మొదలైనవి ఆయన దృక్పథానికి మరింత పెట్టినట్లు భావించవచ్చు. పంచమవేదం కవితను గురువులపిచ్చికి బలయిపోయిన విద్యార్థులు దాకె బాలాజీ, డొక్కా పద్మనాభరావులకు అంకింతమిచ్చినట్లుగా కవిత చివిరలో రాసిన మాటలనుబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కవిత ఉత్తమ పురుషలో ఉంది.

పంచములు వర్ణవ్యవథకు అట్టడుగున వున్నవారు, వారు చదువుకోరాదు. చదువులేని జాతి నాగరికతకు దూరమవుతుంది. నాగరికత తెలియని వాళ్ళకు సాంస్కృతిక విలువలే ఉండవు. వికాసం అసలే వుండదు. దళితులకు ఇతరులకులాగా జీవితసౌక్యాలు, సౌకర్యాలు లేవు. ఉండకూడదని వర్ణధర్మం చెపుతోంది. వర్ణధర్మ చట్రంలోని డొల్లతనాన్ని పంచమ వేదం కవిత ఎత్తిచూపుతుంది. ఈ కవితలో కర్ణుడు, ఏకలవ్యుడు కనిపిస్తారు. వీరు గతంలో కులంచేత అవమానింపబడి వచనకు గురైనవాళ్ళు.

మా ముత్తాత ఏకలవ్వుడు చెప్పాడు

ఏకలవ్యుడు కూడా
భారతంలో ఓ దిష్టిబొమ్మ

ఏకలవ్యుడు దేవుళ్ళకు కాకుండా
తల్లికే పుట్టాడు


వీరుడు ఏకలవ్యుడు
శవాలను చంపడు

ఇలా కవిత ఐదుభాగాల చివర్లో ఏకలవ్యుణ్ణి గురించి చెప్పటం పూర్వంనుండి తమకున్న సాంస్కృతిక వారసత్వం, దాన్ని గుర్తించ నిరాకరించిన వర్ణ సమాజం, ఒకవేళ గుర్తించినా దాన్ని నిర్వీర్యం చేసిన విధానాలను తెలియచేసి చరిత్రను తిరగరాసి కొత్త విలువలను ప్రతిపాదించడమే పంచమవేదం కవితలో దళిత దృక్పథం.


ఈ కవితలో ఏకలవ్యుడు, కర్ణుడు గతంలో కులంచేత అవమానింపబడి , వంచనకు గురైనవాళ్ళు. దళితుల పట్ల నిర్దయగా, అమానుషత్వంగా రాజ్యం ప్రవర్తించేలా మనుధర్మం కొన్ని విధులను శిక్షలను నిర్ణయించింది. కౌరవులు, పాండవులు, శకుని, కుంతి లాంటి పేర్లు ఈ కవితలో కనిపించడానికి ఇతిహాస పురాణమంతా రకరకాల కథలను చెప్పినా అంతర్గతంగా వర్ణసంరక్షణ కొసమనే కవి భావనగా గుర్తించాలి. 

ఓట్ల పండుగలకో, కులాధిపత్య కోవలకో ఎందరో దళితులు బలైపోతున్నారు. అలా బలైపోయిన వర్గంలో విద్యార్థి వర్గంకూడా వుంది. ఇలా బలిపోయిన విద్యార్థులకు సానుభూతి తెలియజేయడం అనివార్యమైపోయింది.