Tuesday, April 30, 2013

అనుకరణ గురించి ఏమైనా చెప్పగలరా?

ఏదైనా చదివిన వెంటనే అయస్కాంతంలా ఆకర్షింపబడినప్పుడు 
అదే రీతిలో ఫార్‌మేట్‌లోకి వెళ్ళిన నా రాతలు గురించి మీరేమైన చెబుతారా? 
ఇలా ఆకర్షింపబడటం అనేది వేరే సందర్భాలలో జరగలేదు. 

ఇది నా అనుభవమేనా, లేక ఇలాంటివి సహజమా? ఎవరికైనా జరిగాయా? తెలుసుకోవాలనే కుతూహలం 

నాకు కవిత్వం రాయటం ఎలా అబ్బింది అని సందేహమొచ్చిందీమధ్య.

ఖచ్చితమైన సమాధానమేదీ దొరకలేదు.

నేను ఏమీ రాశాను అని కొంచెం సింహావలోకనం చేసుకున్నాను.

అందులో ఒకవిషయం కన్పించింది. అదేమంటే ఇప్పటివరకు నేను చదివిన కవిత్వం నుండి ప్రేరణ పొందిన తర్వాత అనుకరిస్తూ రాసినవి ఇద్దరే ఇద్దరిని. ఇది పేరడి అనడం సమంజసం కాదేమో.
ఒకరి అభివ్యక్తిని అనుకరణ చేయడం సమర్దనీయమూ కాదు. 
తెలిసీ ఎందుకు అనుకరించాను అనేది నాకు నాకుగా జవాబు దొరకడంలేదు

ఇది పూర్తి అనుకరణ మాత్రమే. వారిద్దరిని మాత్రమే ఎందుకు అనుకరించాను,నన్ను ఏ అంశాలు ప్రభావితం చేసివుంటాయి? ఏ అంశాలు ఉండివుంటాయి అనేది ఇప్పటికి నా సందేహం.

అవి మీ ముందుంచుతున్నాను. ఎవరైనా ఏమైనా చెప్పగలరా?

మొదటిది తిలక్ - అమృతంకురిసిన రాత్రి నుండి

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.


ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారామంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారు పృథు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.


నన్ను చూసిచూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైనవాడు
కలల పట్టుకుచ్చులూగుతేన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు,నరుడు, మనకి వరుడు

జలజలమని కురిసింది వాన
జల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఖాన్నీ చావునీ వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందర మాలగా భరించాను
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను.

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు
అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

- దేవరకొండ బాలగంగాధర తిలక్
1962
****
మద్యంకురుస్తున్న రాత్రులు


“అన్నపూర్ణ” యిప్పుడు
మధుశాలల నెలవయ్యింది
బార్లాతెరచుకున్న
బార్ రెస్టారెంట్లు
వీధివీధినా బారులు తీరుతున్నాయి


అంతా
ప్రవహిస్తున్న మద్యం మత్తులో నిదురోతున్నారు
రోడ్డుపైన తాగుబోతులు
తూలుతూ నడుస్తున్నరు
వారి పాదాల తడబాట్లలో
ఇల్లాలి ఇక్కట్లు నలిగి రోధిస్తున్నాయి
హైటెక్కు వాసులు
ఆడే తైతెక్కలతో
కొత్త సంస్కృతి దిగుమతి చేస్తున్నరు
వారి చెమటతాగిన వ్యాపారులు
బలిసిన బొజ్జలతో
నడవలేక
నాల్గు చక్రాల వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు
ఏ ఘడియలొనో ఛీత్కరించి
మధుపానానికి అనాశక్తుడనైన నన్నుచూసి
వీడుచూడు
తన్నుతాను సంస్కరించుకున్నననే
మిడిసిపాటును ధరించాడు
కళ్ళతోనే కాంతి సంగీతాన్ని తాగి
కొత్తగీతాన్ని రచిస్తున్నాడు
పెదవులపై నవ్వొకటిపేర్చి
మద్యంలో దొరకని రహస్యాల్ని వశపరచుకుని
విర్రవీగుతున్నడని నవ్వుతున్నారు
జీవితాన్ని ప్రేమించినవాడు
జీవనాన్ని కౌగలించుకున్నవాడు
ఆటుపోటులకు వెరవనివాడై
ఇదే దారిపై
వేకువకిరణాలతో సాగి పయనిస్తున్నడని
ఇతడు నిజంగా
మన శత్రువు
మద్యం ద్వారాలవైపు పోవద్దని చెప్పే
జోరీగహితవని
వ్యసనంలోకి తిరిగిలాగాలని పథకరచన చేస్తున్నారు
జలజలమని కురిసిన కన్నిటిలో
నా అమృతపు క్షణాల్ని వెతుక్కున్నాను
మద్యంమత్తులో కప్పేసిన
దుఃఖాన్నీ బాధనీ చేధించే ఖడ్గాన్నందుకున్నాను
జీవనాన్ని పోరాఠంగా తలచాను
సమరయాత్రలో తొలి అడుగుపెట్టాను
మద్య వరదై ప్రవహిస్తున్న రోజులు
అందరూ మత్తులై తూలుతున్నారు
ఎందరినో ఆకర్షించడానికి
కొత్తమార్గాలు వెతుకుతున్నారు
మత్తు భయాల మద్య చెలరేగే
హింసాయుత మార్గాలకు
సరికొత్త తెరలు తీస్తున్నారు
అనంతచైతన్యంలో
ప్రభుత్వ ఖజానాకు చేరేధనం
మద్యానిదే పైచేయి
మరో అధికారాన్నిస్తుంది
ఇక ఎవరికి చెప్పను
నా తల్లి “అన్నపూర్ణ”అని.


నవంబరు 2007
*******


రెండవది -  వాడ్రేవు చినవీరభద్రడు - పద్యం


వాడ్రేవు చినవీరభద్రుడు   పద్యం

తెల్లవారు జామునే నువ్వొక బల్లముందు కూచుంటావు,పక్షి ఈక ఒకటి
బంగారు రంగుది,గాల్లో ఎగురుకుంటూ యూకలిప్టస్ కొమ్మలమీద వాలే
దృశ్యం, తూలికాతుల్యమైన ఆ బరువుకి చెట్టంతా నునులేత తిమ్మిరి,
ఆమె నడుముచుట్టూ కొనవేళ్ళతో నువ్వు మీటుకునే సంగీతం లాంటిది.

వాళ్ళు రోజంతా ప్రభుత్వం కోసం పథకాలు రచిస్తుంటారు, ప్రజల కోసం
కాదు, అక్కడ నీకు ఊపిరాడదు, బయటకి చూస్తావు, రొప్పుతున్న
నగరం నీ మీద చిమ్ముతున్న సిమెంటునురగ. పార్కు గోడలమీద
ఒలికిన ఆకుపచ్చనిరంగుతో నీ మరకలు తుడుచుకోవాలనుకుంటావు.

రాత్రవుతుంది, ఒక గుడ్డతో ఆకాశాన్ని శుభ్రంగా తుడిచి బల్లమీద
చంద్రుణ్ణి తెచ్చి పెడతారు, పక్కన అద్దంలాగా చిన్ని మేఘమొకటి,
ఒక్కసారిగా నీ సౌందర్యం నీకు స్ఫురణకొస్తుంది, కవి చెప్పినట్టు
ప్రతి రాత్రీ వసంతరాత్రి కావాలనిపిస్తుంది, నీకు బతకాలనిపిస్తుంది

***April 2013

జాన్ హైడ్ కనుమూరి - పద్యం

తెల్లవారు జామున బల్లముందుకూర్చొని రాత్రి రాలిన మంచు
బిందువుల్ని ఏరుతుంటాను. పక్షులు విదిల్చే కువకువల్ని వింటూనే
అనంత నముద్రాలపై పయనిస్తుంటాను. ఎవరిదో రాత్రి తడిసిన దిండు,
పించమై పురివిప్పిన అక్షరాల మధ్య రంగులు వెదకుతుంటాను

కూజాలోంచి వంపుకున్న నీళ్ళు గొంతులో చల్లగా జారుతూ
ఎప్పుడో తడిసిన వెన్నెలవానను జ్ఞప్తికి తెస్తుంది. అక్కడో వృద్దుడు
తంత్రులను సరిచెయ్యాలని ఆత్రపడతాడు. తిరిగొచ్చేవారికోసం
కొత్త రాగాన్ని శృతిచేస్తుంటాడు. నింపడానికి నాదగ్గరేసంచీ వుండదు.

నా కోసం తీసుకొచ్చిన పలుకులేమనా వున్నాయా యని
వెదకుతుంటాను. ఎట్నుంచే ఎగిరిపడ్డ నెమలీకొకటి నన్ను
పట్టి వివశుణ్ణి చేస్తుంది. ఒక చిర్నవ్వు మనసుకో, ముఖానికో
పులుముకున్నాననుకొనేలోగా విద్యుత్తు దారితప్పుతుంది.

తెరచుకున్న గుమ్మంముందు ప్యాకెట్టులో ఒదిగిన పాలు
పలకరిస్తాయి. ఇక శబ్దం ఒకొక్కటిగా లోనికి చేరుతుంది.
పరుగులన్నీ తొందరచేస్తాయి. అలుపు, నిద్రలను దులుపి
మళ్ళీ బల్లముందు కూర్చునే వరకు ఏదీ గుర్తుండదు.

***April 2013

2 comments:

శ్యామలీయం said...

క్షమించాలి.
వాడ్రేవుగారి రచన పద్యాలు యెలాగయాయి?

జాన్‌హైడ్ కనుమూరి said...

శ్యామలీయం gaaru

ఆయన దానికి ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి దాన్నే నేను వాడాను. అవి పద్యాలా కావా అన్నది నా ఈ పోస్టులో చర్చాంశనీయం కాదు.

అనుకరణ గురించి ఏమైనా చెప్పండి