Monday, September 17, 2007

కవిత్వాలాపన

బాల్యంలో
బడిలోనో, అరుగుపైనో
అక్షరాలు దిద్దినప్పటి నేస్తం
పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలో
తప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల … నా కవిత్వం

చలిరాత్రుల్లో గువ్వపిల్లలా ముడుచుకొని
వెచ్చదనపు మంగవడిలో
రాకుమారుల సాహసాలకు ఊకొట్టిన కథల సవ్వడి … నా కవిత్వం
వెలుగుల్లేని వాడల్లోకి
కాలినడకన గడప గడపను దర్శించి
మండే చితుకుల వెలుగుల్లో
అక్షరాలను, వాక్యాలను
వెదజల్లిన బోధకురాలు రత్నమ్మ బైబిలుసంచి … నా కవిత్వం

నవరాత్రుల సంబరాల్లో తడిపొడి చిందుల్లో
ఉర్రూతల కేరింతల చిందేయించిన
వీరాస్వామి డప్పు వాద్య చిర్రా చిటికిన పుల్లా … నా కవిత్వం

సుబ్రమన్యుని తిరునాళ్ళలో
గమ్మత్తైన లాజిక్కుతోఒకటికి మూడంటూ బొమ్మలజూదం
కనికట్టో మేజిక్కో
పాములనో మనుషులనో ఆడించి విసిరే మంత్రించిన తాయత్తు … నా కవిత్వం

అక్కకోరిన కోర్కెతీర్చలేనిది కాదంటూ
కుక్కలున్న వీధినిదాటి
ఎండవేళను మరచి
స్కూలు వెనకున్న ముళ్ళపొదొంచి
కోసుకొచ్చిన గొబ్బిపూలు … నా కవిత్వం

గట్టుడంకల్లోని కాకరకాయలు
కొండదిగువలో వాక్కాయలు
చింతతోపుల్లో చింతకాయలు
తూములకెదిరెక్కిన చేపలు
చిటారు కొమ్మనో తూము ప్రవాహాన్నో
వడిసిపట్టుకున్న గుప్పిట వేళ్ళు …। నా కవిత్వం

ఆజానుబాహుడు
వాచక నటనావైదుష్యంతో సహజకవచకుండలాల కర్ణుణ్ణి
అవలోకగా సాక్షాత్కరింపచేసిన
క్రిష్ణమూర్తి(జడ్జి) కొట్టిన చప్పట్లధ్వని …। నా కవిత్వం

కొవ్వూరు పసివేదల మధ్య
నిరంతర సమాంతర రేఖాపట్టాలను
కలుపుతున్న కొంగల్బాడవ వంతెన
రైల్వే కమ్మీభుజాలు దాటిన లేతపాదాలు ... నా కవిత్వం

ఎదుగుతున్న బాల్యంనుంచి
ఆటవిడుపుల చెలిమిరెక్కలు విప్పుకుంటూ
ఆడుతున్న ఏడుపెంకులాట బంతి ... నా కవిత్వం

సంవత్సరాంత పరీక్షలకోసం
క్వార్టర్ నంబరు ఐదు వాకిట్లో
పెద్దలాంతరో, పెట్రొమాక్సు లైటో వెదజల్లే కాంతికి
చేరినపిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం

హైస్కూల్లో ఎదుగుతున్న పడచుల
పేమలేఖల పరిమళాలు
ఫుట్బాలులు, కబడ్డీలు, వాలీబాలులు
పోటిలతో సీనియర్స్
స్పూర్తి నిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వం

గోదారి ఈతలు
అలల గలగలలు
జాలరివలలు
ఇసుకతెన్నెల పరుగులు,
నిర్ణీత సమయ సాకేంతాల ప్రేమజంటలు
వేళను గోధూళిని చేసే పశువులు
చూస్తూ చూస్తూనే జారిపోతున్న పొద్దులో
భానుథియేటర్ నుండి వినిపించే
ప్రార్థనా గీతపు గ్రామఫోబు రికార్డు ... నా కవిత్వం

తవ్వుకుంటున్న చెలమల్లో
చెలి అస్పష్ట ప్రతిబింబం .. నా కవిత్వం

వోడిసిపట్టుకున్న గుప్పిటవేళ్ళు ... నా కవిత్వం

1 comment:

ఏకాంతపు దిలీప్ said...

ఈ కవితకి నేను స్పందించడం భావుకునిగా నా అస్తిత్వాన్ని తరచి చూసుకోవడంగా భావిస్తున్నాను...

చాలా బాగా రాసారండి... బహుశా నేనూ గొదావరి వాడిని కావడం వల్లే మొదట స్పందిచగలిగానేమో... కొవ్వూరు-పసివేదల వంతెన నాకు పరిచయమే... పట్టి సీమా పరిచయమే... సుబ్రహ్మణ్య తిరుణాళ్ళు పరిచయమే...

గోదావరి అని కాకుండా... భావ ప్రకటనలొ సార్వజనీనత ఉంది... గత కాలపు ఙ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ రాసే కవితల పొటీ పెడితే ఈ కవితని నేను మొదటి వరసలో పెడతాను...