Saturday, June 9, 2007

ఓ జ్ఞాపకం

ఇక్కడే
ఈ చోటులో ఆడుకున్నాము కదా!
అప్పుడే
ఆ చోటులో దాగుకున్నాము కదా!
ఎప్పుడో
ఈ బాటలో నడచి వెళ్ళాము కదా!
ఆడుకున్న ఆటలు
దాగుకున్న చోటులు
నడచివచ్చిన బాటలు
గురుతులే తీపి గురుతులే!
చొతుల్లో మూసిన నీ కళ్ళు
దాచివుంచిన మమతల కోవెల్లు
నులివెచ్చని స్పర్శాభావం
పలికించేను పెదవులపై నీ పేరే
అదిరెనులే ప్రతిసారి
విశాలాకాశ లెక్కలచుక్కలు
వెన్నెల్లో పరచిన పక్కలురెక్కలు
తొడిగి ఎగిరొచ్చి ఆడుకున్న యువరాజులు, యువరాణులు
కనరాకున్నారు ఈ వేళ
నీవు నడచే దారిపై
చూపులనే పరిచాను ఎన్నాళ్ళో
నీతోడు నడచి వెనుదిరిగి
ఏరుతున్నాను నీవి రాల్చిన మాటలు
గంపలు చాలకున్నాయిలే!
ఇప్పుడు
మరచాను దారియేదో
రావా నేస్తం
లెక్కపెట్టాలి మరెన్నో చుక్కల్ని
లాక్కొద్దాం యువరాజుల్నీ రాణుల్నీ
రావా నేస్తం
మళ్ళీ ఆడుకుందాం
ఆ దూదిబిళ్ళ కోతి కొమ్మచ్చి
దాగుడుమూతలు మరేదైనా
బద్దలు కొడ్దాం మౌనాన్ని
ముడివేద్దాం మరోగాలి పటాన్ని
ఒంటి కాలితోనైనా కుంటేద్దాం!

No comments: