Monday, June 4, 2007

సిలువ మోత

అందరూ

ఏదొక సిలువను మోస్తున్నవారే

కొందరు బహిరంగంగా

మరికొందరు రహస్యంగా

ఇంకొందరు సూక్ష్మంగా

సిలువొక మరణశాసనం

ఆదిపత్య అహంకారం సాగిపోతున్నప్పుడు

అన్ని దేహాలపైనుంచేనడక సాగిపోతుంది.

తల వంచిన వాళ్ళు

మౌనంగా మోస్తూ మోస్తూ

ఏ దారిలోనో రాలిపోతారు

ఏ మెలకువలోనో బాదిస్తుందని

నిద్రలో దేహాన్ని దాచి

కొందరు తిరుగుతుంటారు

తలలెత్తినవాళ్ళు బహిరంగంగా

సిలువను మోస్తూ మోస్తూ

ఏ కొండో చేరాక మిగిలిన వూపిరిని

మేకుల్తో కొడతారు.

విస్తుపోయిన క్షణం

ఏ తెరో అడ్డంగా చిరుగుతుంది

కన్నీళ్ళొలికిన కళ్ళన్నీ నిప్పుకణికలై లేస్తాయి

సీలువేసిన సమాధిలో

ప్రేత వస్త్రాలే మిగుల్తాయి

మోయలేనివాడు

ఇంకా సిలువను మోస్తూనే వుంటాడు.

మోయగల్గినవాడు

సిలువను విడచి పునరుత్ఠానాన్ని మోసుకెళ్తాడు.

No comments: