Monday, May 28, 2007

కలల ప్రియదర్శిని

కలల ప్రియదర్శిని
నిదురించిన రాత్రిలో కల కన్నట్టు
కనురెప్పల్లో కదుల్తున్న దృశ్యాలు
రెప్పతెరిచిన వేళ కళ్ళముందులేనట్టు
వాస్తవ అవాస్తవాల నడుమ
కొట్టుమిట్టాడుతున్న మనసు బద్దలుకొట్టి
“నిన్ను ప్రేమిస్తున్నానని” చెప్పాలి

మరియ ఎంచుకున్నది ఉత్తమమా?
మార్త ఎంచుకున్నది ఉత్తమమా?
న్యాయవాది యేసై వెలువరించినతీర్పు

తీర్పు తీర్పువెనుక దాగిన నిజాలను
వెలికి  తీయడాన్కి నేనెవరు?

ఎంచుకున్న మార్గాల ఆలోచనల్లో
పరుగెడుతూ పరుగెడుతూవిజయమెవరిది?

కలలు గానంచేస్తూ
అక్షరాలద్దిన రథాన్నధిరోహించి
సమరాంగణమై కదుల్తున్న ఈమె ఎవరు?

ఓ భారతనారీ! సహొదరీ!
తల్లిగర్భంలో నిన్నెరిగినవాడు
తానే తల్లి గర్భంలోకి మారినప్పుడు
శిశువై కొనియాడబడ్డాడా?
పశుల పాకలోకిచేరి తృణీకరింప బడ్డాడా?

ఆదినుంచి
వర్గ వర్గాలుగా విభజింపబడ్డ భూమిపై
నీ శ్వాస కేర్ మన్నప్పుడే
అవమానం కొండచిలువై
మింగాలని ప్రయత్నిస్తోంది
మింగలేనప్పుడు
అశపపండదో తినేటట్టు చేస్తుంది
నడుస్తున్న దేహం వెనుకనీడలా వెంటాడుతుంది

కళ్ళను పొడిచి కలలను చిదిమి
నిమ్మరసాన్ని పిండినట్టుజీవితాన్ని పిండేస్తుంది

మంచుపొగలను చీల్చుకొస్తున్నసూర్యకిరణాలల్లోంచి
నీ సాన్నిహిత్యం గోర్వెచ్ఛగా తాకుతూనేవుంది

జీవనపోరాటాల రణరంగంలోనడచిపోయిన అడుగులకోసం
అన్వేషిస్తున్నా
ఊరు వాడల్లోనో
రాజవీధుల్లోనో
జాడలకోసం వెదుకుతున్నా

నా నగర వాసులారా!
జీవనశ్రమలోపడి నే నిద్రిస్తున్న వేళ
అలికిడిలేకుండానేనడిచివెళ్ళిన
నా సోదరిని చూసారా!

నా సోదరి ధీశాలి!
పోరాట పటిమల యోద్ధ
అక్షర రాపిడి వెలిగించిన దివ్వె
తండ్రిచేసిన వ్యవసాయంలో పాదుగా ఎగబాకిన ద్రాక్షతీగ

బహుశ
బంగారువీధుల్లోకి వెళ్ళిపోయిందేమో!

నా నగర వాసులారా!
సోదరి ఎదురైతే
సోదరుడు ఒంటరి ఆలోచనల్తో
వీధుల్లో తిరుగాడుతున్నాడని చెప్తరా!

ఇక్కడింకా పాఠశాలలు నెలకొల్పాలి
దర్పణం మార్చాలి!
కొత్త ఆలోచనై బోధించాలి!

పోరాటాక్షరాలు తెలియని
నిశానులున్నారిక్కడని చెబుతారా!

ఇక్కడింకా
మురికి పట్టిన సందులు, వీధులు వున్నాయి
శుభ్రపరిచే పోరాటానికి
కొత్త ఆయుధాన్ని తయారుచేయాలి

23. 1. 2007