అనేకనేక బాహువుల్తో
ప్రతి గుండెల్లో
ఊడల్ని దింపాలని చూస్తున్న మర్రి
విధ్వంసాన్ని కలగనే వెర్రి!
విస్ఫోటనం కావాలి
భయానక క్షణాలు లెక్కించాలి
రక్తంతో పైశాచిక చిత్రాలు రచించాలి
భయపెట్టాలి
పదిమంది చేరే
ధ్వజ స్తంభం ప్రక్కకో
మోకరించే స్థలానికో
రెహాల్ వైపుచూసే జానిమాజ్ చోటుకో చేరుతుంది.
అంతే
విస్ఫోటనం కకావికలు చేస్తుంది
కొన్ని పావురాలు నేలరాల్తాయి
రెక్కతెగి అల్లల్లాడ్తాయి మరికొన్ని
భీతిల్లిన గుండె చప్పుళ్ళతో
బిక్కు బిక్కుమంటూ ఒదిగిపోతాయి
నిశ్శబ్దం ఆవరించిన వీధులవెనుక
భయం దాగి వుంటుంది.
వీధుల్లో తెలియని సమాచారం
విదేశాలలో తెలుస్తుంది
రెక్కలు కట్టుకున్నట్టు
నేతలు వాల్తారు
వేడెక్కిన వేదికలౌతారు
దోషులకోసం గాలింపులు మొదలైతే
పాలక అసమర్థతల సందుల్లోంచి
చిచ్చు రగిల్చినవాడు
మన దుస్తుల్లోనే మన మధ్యే తిరుగుతూ
చల్లగా జారుకుంటే
ఎరను మింగిన చేప గేలానికి చిక్కినట్టు
అమాయకులెవరో చిక్కుతారు.
విప్పలేని చిక్కుముడుల మధ్య
కాలం దొర్లిపోతుంది.
గుండెను తాకిన గాయం
నెగడై మండుతూనే వుంటుంది.
మరెక్కడో విస్ఫోటనం కోసం
కొత్త రచన జరుగుతూనే వుంటుంది
అదొక మహమ్మారి
అనేకనేక బాహువుల్తో
ప్రతి గుండెల్లో
ఊడల్ని దింపాలని చూస్తున్న మర్రి
విధ్వంసాన్ని కల కనే వెర్రి!
- జాన్‌హైడ్ కనుమూరి
No comments:
Post a Comment