Tuesday, October 8, 2013

కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ్తే చదవాలనివుంది



*****

కొన్ని రోజులుగా అడపాదడపా ఇబ్బంది పెడ్తున్న దగ్గుతో పాటు నిన్న సాయత్రంనుండి శరీరంలో ఏదో తెలియని అలజడి. శ్వాస ఇబ్బందో, గాస్ ఎటూ పోక ఇబ్బందో శరీరం సన్నని వణుకుల మధ్య నా ప్రక్కటెముక, పిల్లలు ఉపచారాలు చేసారు. బాగా ఆలస్యమైన రాత్రి అయ్యాక ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. ఉదయం 5 గటలకు వినిపించే అజా పిలుపుతో తెలవారుతుందని మాగన్నుగా తెలుస్తుంది.

అప్పుడు మరో అలజడి మొదలయ్యింది. ఎవరో కవిత వినిపిస్తున్నట్టు, నాలోనే కవిత రూపుదిద్దుకుంటున్నట్టు. ఇలాంటి అనుభవం కొత్తేమీకాదు, కానీ ప్రతిసారీ నిద్రనుతోసి రెప్పలు తెరచాక ఒక్క వాక్యం గుర్తుండేది కాదు. ఇలాంటి అనుభవాన్ని అక్షరం అక్షరం రాయగలగటం ఇది రెండవసారి.
నిద్రమత్తుగానే లేచి సిస్టం ఆంచేసి నిద్రకళ్ళాతోనే టైపు చేసాను. చివరి వాక్యం పూర్తిచేస్తుండగా కరంటుపోయింది. ఉన్న యు.పి.యెస్. ఎక్కువసేపు వుండదు అదిపోయేటంతలో సేవ్ చేసి సిస్టం ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాను.

నేను ఎప్పుడైనా చదివిన కవిత్వమా అని సందేహం.
అందుకే శీర్షిక  పెట్టలేదు.

***

నీవు
నడిచిన మార్గాలను
వదిలిన పాదముద్రలను వెదకుతుంటాను
నాలుగు రోడ్లకూడలిలో
ఒంటరిగా నిలబడి కనిపిస్తావు

నలుగురుచూస్తున్న కూడలికదా
నాల్గు పూలమాలల్తో నిన్ను నింపేస్తాను
అలసిన చేతులు, మనసును మడతబెట్టి
నా గదిలోకి ముడుచుకుంటాను
నిద్రనిండిన దేహానికి నే వెదకుతున్నదేమిటో గుర్తురాదు

మెలకువవచ్చిన వేళ
తెరతీసిన నాటకమేదో మొదలౌతుంది
కూడలిలో నిన్నొంటరిగా వొదిల్నసంగతి గుర్తుకే రాదు!

రోడ్డు విస్తరణకో
పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు.

--0--

(నిద్రలో ఎవరో వినిపించినవి యదాతదంగా మీకోసం) 02.10.2013 05:15 hours ISD


కొన్ని అభిప్రాయాలు 
Ajit Kumar ఆమె పూర్తి చంద్రముఖిగా మారినట్లు మీరు పూర్తి కవిగా మారుతున్నారు. నిరంతరం మీ మనస్సులో కవితలతోనిండిన పాదాలు నాట్యం చేస్తున్నట్లుగా అందుబాటులో ఉంటున్నాయి. శారీరక బలహీనత ఏర్పడినప్పుడు మానసికోద్రేకాలు ప్రకోపిస్తుంటాయి. మీ వ్యాధి నిర్ధారణ అయినట్లే ఉంది. పాపం . మీరు కవి అయ్యారు. దయచేసి రోజుకోసారి మాత్రమే రెండుమూడుకు మించి గేయాలతో గాయాలు చెయ్యకండి ప్లీజ్. ఇక గేయ భావాన్ని చూస్తుంటే మీకు ఎవరిమీదో అనుమానంగా ఉన్నట్లుంది. ఆమె ఎప్పుడో రోడ్డు ప్రక్కన కనిపించిన ఆమె మిమ్మల్నొదిలిపోయిందేమోననే సంశయం కనిపిస్తుంది. చివరికి మీరు ఆమెను మరచి వెళ్ళిపోయారు. మీకు గుర్తు వచ్చి చూడడానికి వెళ్ళేసరికి రోడ్డు ప్రక్కనున్న ఆ పాకా పీకివేయబడి రోడ్డు విస్తురణ జరిగింది. ఆమె ఇప్పుడు తన పాకా ఏ రోడ్డు ప్రక్కన వేసుకున్నదా అని వెదుకుతున్నారు. రాత్రుళ్ళు ప్రయత్నించితే ఫలితం ఉండొచ్చు. బెష్ట్ ఆఫ్ లక్. షరా- దొరకకపోతే నన్ను తిట్టుకోవద్దు.

Sriramoju Haragopal రోడ్డు విస్తరణకో, పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు.....తొలగించబడని కలలు మాక్కూడా రావాలి. మీ స్వప్నకవిత చాలా బాగుంది.
Mercy Suresh Jajjara ఒక ఆధ్యాత్మికత , తాత్వికత నిండిన కవిత . ఒక దృశ్యంలోకి నడిపించి చివరన ముగించిన పాదాలు రోడ్డు విస్తరణకో, పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు. అన్నప్పుడు ఎందుకో ఒకలాంటి బాధ కలిగింది .. ఒక గాఢమైన నిట్టూర్పు కూడా ...
Afsar Afsar జాన్, చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులోని క్లుప్తత నాకు నచ్చింది. భావం కూడా మీ మామూలు కవిత్వ ధోరణికి భిన్నంగా వుంది. ఈ పద్ధతిలో ఇదే శైలిలో మరిన్ని రాస్తే బాగుంటుంది.
Padmakar Daggumati కవిత గురించి కాకుండా అన్నారు గనక షేర్ చేసుకుంటాను సారు. గాంధీ జయంతి ప్రభావం ఈ కవితమీద వుంది. గమ్ముగా పడుకుని టీవీలో గాంధీ ఫొటోలు చూడ్డం, ఇంకా పాటలు ఆటోమేటిగ్గా విన్న ప్రభావం మీ సబ్కాన్షస్ లో పనిచేసి ఉండాలి. ఇవేవీ కాకున్న Date rememberance చాలు మైండ్ కి. శంకర్దాదా జిందాబాద్ కాన్సెప్ట్ కూడా ఇదేనని మనకి తెలుసు. నాకూ ఇలా కొన్నిసార్లు వేకువలో జరిగింది. మీ సామాజిక చింతనకి, గాంధీయిజం అనాదరణ పట్ల మీఫీలింగ్స్(may be concious or subconcious) అక్షరాలుగా రూపొంది ఉండొచ్చు. బాగా జ్ఞాపకం పెట్టుకుని రాశారు. థాంక్యూ.
  
 

No comments: