Tuesday, September 10, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 3


గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం 

కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు సర్టిఫికేట్టు వుంటే ఐ.టి.ఐ. పరీక్ష రాయవొచ్చని. అందుకోసం జేవియర్స్ ఐ.టి.ఐ. వర్కు షాపులో బీరువాలు తయారీలో నానీ అనే ఒకాయ వుండేవారు ఆయన దగ్గర పనికి చేరాను. నాతోపాటు మరో ఇద్దరు ఆయన చేతిక్రింద పనిచేసేవారు. అప్పటివరకు ఆఫీసు పనులు చేసిన నేను ఆ పని కష్టమనిపించేది. బీరువా కోసం షీట్ ను  ముందుగా తగిన కొలతలతో చుక్కలు పెట్టుకొని వాటి ప్రకారం వులితో కట్ చెయ్యడం, అవసరమైన వంపులు కొన్ని మిషను సహాయంతో మరికొన్ని సుత్తిని వుపయోగిస్తూ చాకచక్యంగా వంచడం కత్తిమీద సాములా అనిపించేది. మొదటి వారంలో సుత్తెదెబ్బవేయడంలో మెళకువలు తెలియక  వేళ్ళు నలగ్గొట్టుకున్న సందర్భాలు వున్నాయి. షీట్‌ను డిజైన్ చెయ్యడం అనేది అన్నిటిలో కీలకమైన పని. దాన్ని సులువుగా నేర్చుకున్నానని ఆయన నా స్నేహితులతో అనడం తటస్థించింది. డ్రిల్లింగు, రివిటింగు, షీట్‌లో చొట్టలను కనిపెట్టి సరిచెయ్యడం, విదివిడిగా బెండింగు చేసుకున్న వాటిని ఒక్కచోట చేర్చి రివిటింగు చేసి, తలుపులు అమర్చడం, తలుపులకు, లోపలి అరలకు తాళాలు తయారు చేసుకుని బిగించడం. చివరిగా కొలతలను చూసుకొని   టింకరింగు   ఛేయించడం.  

తర్వాతి సంగతి పెయింటరు చూసుకునేవాడు. చలా కాలం పెయింటింగు సెక్షనుకు నేను వెళ్ళలేదు. ఒకరోజు వెళితో అంతకుముందు రోజు మేము పూర్తిచేసిన బీరువాకు గ్రీన్‌మెటాలిక్ రంగు వేస్తున్నారు. వావ్... మేమేనా చేసింది ఈ బీరువాను అనిపించింది.
 
నేను రాయలనున్న ఐ.టి.ఐ. పరీష కాస్థ అప్పటికే 25 దాటిన వయస్సువల్ల అవకాశం పోయింది. దానితో అక్కడ పనిచేయడంలో ఉత్సాహం ఎక్కువరోజులు మిగలలేదు.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ సంవత్సరం నానీ మేస్త్రీ (ఆయన్ని అలానే పిలిచేవారు, ఆయన అసలుపేరు తెలియదు) వినకచవితి పూజను మొత్తం నాచేత చేయించారు. అంతకుముందే కొన్ని సందర్భాలలో నేను పంచె, లాల్చీ ధరించేవాణ్ణి. అది తెలిసిన ఆయన నా చేత పంచె కట్టించి, తను కూడా పంచె కట్టుకుని పూజా విధానం పుస్తకం తెప్పించి ఆరోజు పూజను నాచేత చేయించారు. పూజ తర్వాత లేవబోతుంటే వాళ్ళ ఆవిడ ప్రక్కన ఇళ్ళలోని వారిని పిలిచి కూర్చోబెట్టి కథను చదవమన్నారు. పంచే కూర్చుంటానికి అనుకూలమైనా, ఆ వయసులో అంతసేపు కూర్చోవడం గొప్ప విషయమే.  ఎలాగో కథ పూర్తి చేసాను. నేను అంతకుముందు తెలియని కొందరు ఆడవాళ్ళు కుర్రపంతులు గారు కథ బాగా చదువుతున్నారు, మాయింటిలోనూ కథ చెప్పించుకుంటాము వస్తాడంటారా! ఎంత తీసుకుంటారు అని అడగటం నా చెవిన పడనే పడింది. :) 
 
అప్పటికి గురువు (నానీ మేస్త్రీ) ఏదో తాంబూల ఇచ్చారు అది గుర్తు లేదు కానీ, చాలా కాలం తర్వాత చవితి నాటి కథను బాగ వినిపించావయ్యా! అని మెచ్చుకోవడం గుర్తుంది.
 
అప్పుడు పూజను మనస్సుపూర్తిగా చేసానో, పైపైనే చేసానో గానీ, వినాయకచవితి పూజలో కూర్చోవడం అదే తొలి మరియు తుది. 

తర్వాతి కాలంలో హైదరాబాదు వచ్చేయడంతో  మళ్ళీ ఆయన్ను కలవలేదు. కలవాలనే ప్రయత్నంచేసినప్పుడు ఆయన ఇక లేరు అనే విషయం తెలిసింది.  

 

2 comments:

Chunduri Srinivasa Gupta said...

Nee Vinayaka Chavithi story baagundi, nuvve better katha chadivavu good

జాన్‌హైడ్ కనుమూరి said...

కథ చదివింది ఇప్పుడు కాదురా బాబూ! 1985లో