Saturday, August 24, 2013

ఎవరినుంచైనా స్ఫూర్తి పొందొచ్చా అనే సందేహం నన్ను వెంటాడేది.


 
కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి. ఎంతగా అంటే విశ్లేసించుకుని వాటినుంచి వచ్చే అనుభవాన్నో, సారాంశాన్నో  జీవిత విధానంలోకి తెచ్చుకుని మార్పు తెచ్చుకునేంతగా.
నా అనుభవాలనుంచి  కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటలన్నిటిని విశ్లేసించుకున్నాను ఒకసారి. కొన్ని విషయాలను క్రోడీకరించుకున్నాను

1999-2001 సంవత్సరాలలో నేను మద్యపానం మానేయాలనుకోవడం, కంప్యూటరు నేర్చుకోవల్సిన అవసరం ఏర్పడింది. అప్పట్లో సాయంత్రాలు కంప్యూటరు నేర్చుకోవడం  జరిగింది. ఇంటర్నెట్టు వాడకం కూడా నేర్చుకోవడంకోసం కొద్ది సేపు నెట్టు సర్ఫింగు కోసం సమయాన్ని పెట్టాను. ఇలాంటి సమయంలో యాహూలో చాట్ పరిచయమయ్యింది. అప్పట్లో చాట్‌లో మిశ్రమమైన అనుభవాలున్నాయి. అందులో నా అభిరుచికి కొందరు పరిచయమయ్యారు. వారికి "కొండగాలి తిరిగిందీ గుండె వుసులాడిందీ-ఉయ్యాల జంపాలలోని పాటని నాకొచ్చిన ఇంగ్లీషులో   అనువదించి వివరించాను.  నా మాటల్లో ఏదో మా ఎదుర్యం వుంది అనేవారు.
*  అందరికీ నా మాటలు ఏదో విధంగా ప్రభావితం చేస్తున్నప్పుడు  ఇవే నాకెందుకు పనిచేయవు అని ఆలోచించుకోవడం.
*. అనేకులకు నా మాటలు ప్రభావితం చేస్తూ పనిచేస్తున్నాయంటే దాని వెనుక ఏదైనా రహస్యం దాగివుందా? అనే ప్రశ్న
*  ఆ ప్రశ్నలోంచి ఇది దైవదత్తమైనదా! అయితే దేవునికి నా పట్ల ఏదో వుద్దేశంవుంటే నేను దాన్ని వ్యర్థం చేస్తున్నానా?
*. కొన్ని విషయాలు ఏక కాలంలో వివిధ ప్రాంతాలలో ప్రభావితం కావడం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే.
అప్పటినుంచి బైబిలును, సాహిత్యాన్ని సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాను.  అదే స్పూర్తితో చదువుతున్నాను కూడా.  
నేపద్యంలో కవిత్వం వంటబట్టడం యాదృశ్చికమే అనుకుంటాను  నన్ను ప్రభావితంచేసిన కొన్ని ఘటనలు ఇక్కడ ఇస్తున్నాను.

1
చాట్‌లో ఎదురు పడ్డవారిలో ఇటలీనుంచి డోనీ అనే ఇంగ్లీషు టీచరు  పరిచయం నా సమయాన్ని, నా అలోచనల్ని ప్రభావితం చేసింది. మూడు రకాల ప్రశ్నలు వుండేవి. భారత సంస్కృతి, సమాజము, గాంధీ వీటి మధ్య ఆమె విన్న లేదా చదివిన వాటిల్నుండి వుండేవి. మొదట సాధారణంగానే జవాబులిచ్చాను. ఆమె అడుగుతున్న తీరునుబట్టి తెలిసీ తెలియకుండా ఎదో ఒకటి చెప్పాలనిపించలేదు. ఆమె అడిగే ప్రశ్నలు చిన్న చిన్నవే అయినా నాదగ్గర జవాబు లేకపోయేసరికి ఎప్పుడో డిగ్రీలోచదివిన  సోషియాలజీ పుస్తకాల దుమ్ము దులపాల్సివచ్చింది. అలా అమె జవాబులకోసం  చదవడం మొదలుపెట్టిన నేను, చాలాకాలంగా వదిలేసిన చదవడం అనే అలవాటును పునఃరుద్దరించుకున్నాను. ఆమెతో స్నేహార్దమైన మెయిల్సు తరచూ వస్తూండేవి.  ఈ మధ్య ఎటువంటి జవాబు, స్పందన రావడంలేదు. ఎందుకో తెలియదు   

2
ఈ రోజుల్లోనే మా చిన్న అమ్మాయి/శృతి  నన్ను ప్రశ్నించిన ప్రశ్న!
అప్పటికి బహుశ అమెకు 10-11సంవత్సరాల వయస్సు.  ప్రతీ అదివారము అలవాటుకు ప్రకారం ఏదొక చర్చికి వెళ్ళేవాళ్ళము. ఓ రోజు చర్చిలో  రొట్టె, ద్రాక్షారసము(ప్రభురాత్రి భోజనము) ఇస్తున్నారు.    ఆ చర్చి  స్థలం చాలా చిన్నదిగా వుండటంవల్ల దానిలో పాలుపంచుకొనేవారిని ముందుకు రమ్మని, మిగతావారిని వెనుకకు వెళ్ళమని పాష్టరుగారు చెప్పారు. ప్రభురాత్రి బోజనములో పాలుపొందాలంటే బాప్తీస్మము తీసుకుని వుండాలనేది ప్రధాన నియమము. నేను అప్పటికి ఇంకా బాప్తీస్మము తీసుకోకపోవడంవల్ల వెనుకకు వచ్చేసాను.  నా ప్రక్కటెముక(భార్య) ముందుకు వెళ్ళింది. బహుశ మా అమ్మాయి అది గమనించింది. చర్చి అయిపోయాక ఇంటికి నడిచి వెళుతున్న సమయములో మా అమ్మాయి ప్రశ్నించింది. డాడీ, మమ్మీ తీసుకుంది కదా, నీవు ఎందుకు తీసుకోలేదని? అప్పటికి ఎదో సర్ది చెప్పినా నన్ను ఆ ప్రశ్న తొలుస్తునే వచ్చింది. జీవన విధానంన్నుంచి, జీవితాన్నుంచి పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము అనే అంతఃర్మధనం మొదలయ్యింది. అలా మొదలయ్యిన ఆలోచన నా క్రైస్తవ అనుసరణా విధానాన్ని మార్చివేసింది. తర్వాత అనతికాలంలోనే బాప్తీస్మాన్ని తీసుకోవడం వెనుకకు జరిగిన స్థాయినుంచి బోధించే అంశాలలో పనిచేసే అంతగా మార్పు జరిగింది. 
అలా మా అమ్మాయి ప్రశ్నించకుండావుంటే మరికొన్నాళ్ళు దానిపై దృష్టి పెట్టేవాణ్ణి కాదేమో అనిపిస్తుంది.  

చాట్ అనుభవాల్లోనే ఒక అనుభవం-1
 మద్యం మానేయడంవల్ల కలిగిన శారీరక మార్పులు, పనివత్తిడి, విసుగు వల్ల పనిచేసే చోట చిన్న చిన్న పొరపాట్లు దొర్లేవి. వర్కర్లవిషయంలో ఏదైనా పొరపాటు దొర్లితే అది పెద్ద రాద్దంతంగా మారేది. అప్పుడప్పుడు నా బాస్‌తో తిట్లు తినడం జరిగేది. ఇది తరచూ జరగడం వల్ల కొంత ఇబ్బందిగానూ, వత్తిడిగానూ వుండేది.
ఓ రోజు సాయంకాలం యధావిధిగా చాట్‌లో వున్నప్పుడు ఒక కుర్రవాడు ముంబాయి నుంచి లైన్లోకి వచ్చాడు. మద్రాసు దగ్గరలోని ఒక గ్రామమని, ఇంజనీరింగు చదివి ముంబాయిలొ పనిచేస్తున్నాడు. అతనికి సమస్యేమంటే రోజు అతని బాస్ ఏదో ఒక విషంపై తిడుతున్నాడట. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటంలేదు, బహుశ ప్రాంతీయ భేధం వల్ల అలా జరుగుతుందేమోనని అతని సందేహం. ఏదైనా సలహా చెప్పమన్నాడు.  నేనేదో టైం పాస్ చేస్తుంటే వీడేంటి ఇలా సతాయిస్తున్నాడు అనుకుంటూనే ఒక సలహా చెప్పాను.
అదేమంటే బాస్ తిడుతున్నాడు అనుకునేకంటే "బాస్ తిట్టేలా ఏమిచేస్తున్నాను అని" ఆలోచించమని చెప్పాను. రెండురోజుల తర్వాత ఒక మెయిలు ఇచ్చాడు. ఈ రోజు బాస్‌తో కలిసి టీ తాగానని.  ఆ తర్వాత ఉత్తరంకూడా రాసాడు. ఆ ఆలోచన ఉద్యోగం మానేయాలనుకున్నచోటులోనే పదోన్నతి పొందాడని.

చాట్ అనుభవాల్లోనే ఒక అనుభవం-2
ఒక అమెరికన్ స్త్రీ పరిచయమయ్యింది. ఆమెకు 6 యేళ్ళ పిల్లవుంది. భర్త ఏవో గొడవపడుతూవుండేవాడు. ఒకసారి పిల్లను చంపాలని ప్రయత్నించాడు. చివరికి జైలు పాలయ్యాడు. కొంతకాలం పోయాక తన శరీరక, ఆర్థిక విశయాలకోసం  వేరే అతన్కి ఆశ్రయమిచ్చింది. అతను నైట్ డ్యూటీలు చేసివచ్చి పగలంతా నిద్రపోయేవాడట.  తన అవసరాలను గురించి ఆశక్తిలేనట్లే కనిపించేసరికి ఎందుకు అతన్ని చేర్చుకున్నాను అని అనుకునేది. ఓ రోజు తెగించి అడిగేసరికి అతడు కనపర్చిన అనాసక్తివల్ల ఇంటినుంచి పంపివేసింది.  చాల విసుగుగాను, నిరుత్సాహంగానూ వుండేవి ఆమె మాటలు. 

ఓ రోజు ఒక మెయిలు ఇచ్చింది ఆమె అనుకూల  సమయం చెప్పి ఆ సమయానికి నన్ను ఆన్‌లైన్‌వుండమని దాని సారాంశం. ఏమి తిప్పలౌ పడ్డనో గురుతులేదు కానీ ఆమెకోసం చాలా సమయం వెచ్చించాను. అప్పట్లో నెట్‌సెంటరులో మాత్రమే వీలయ్యేది. దానికి కూడా గంటకు కొత్తవారికి రూ.25/-, పాతవారైతే రూ20/- వసూలు చేసేవారు. సుమారు 5-6 గంటలు చాట్‌చేసాను. తన బాధలు చెప్పుకుంది, ఏడ్చింది, మగవాళ్ళని తిట్టింది. నాదగ్గర ఏదో సాంతన పొందాలని చూసింది. ఏమి మాట్లాడనో, ఏమి చెప్పాను గుర్తులేనంతగా ఆ రోజు విసిగిపోయాను. తలనొప్పి రెండు రోజులు వదలలేదు. నా బాధలు నాకుంటే ఇదేంటిరా దేవుడా అనుకున్నాను.

రెండురోజుల తర్వాత ఒక మెయిలు వచ్చింది ఆమెనుంచి.  సారాశమేమంటే చాలా విసిగించినందుకు క్షమాణతో మొదలయ్యిందా మెయిలు. నిజానికి ఆ రోజు ఆత్మహత్యచేసుకోవాలనుకుందట, బాగా మధ్యం త్రాగి తర్వాత పోయిజన్ తాగాలని ఆలోచన. చివరిసారిగా నాతో మాట్లాడనుకున్నదట. నాతో మాట్లాడాక ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నదట. ఎక్కువగా త్రాగటంవల్ల హేంగోవర్‌నుండి బయటపడటానికి కొంత సమయం పట్టిందట. నేను ఆత్మ హత్యచేసుకోను అని చెప్పింది. అంతగా ప్రభావితం చేసాయట నా మాటలు.
ఏమీ మాట్లాడానో, ఏ సలహాలిచ్చానో నాకూ ఇప్పటికీ అర్థం కాదు.
కొంతకాలం మెయిల్సి వచ్చేవి, తర్వాత ఉద్యోగము మారింది, ఇల్లు మారింది ఆ తర్వాత తన నుండి సమాచారం రావటం ఆగిపోయింది.

తర్వాత కాలంలో టెక్నాలజీపరంగా వచ్చిన మార్పులవల్ల అప్పట్లో వాడిన యాహూ ఐడిలో సమాచారాన్ని కోల్పోయాను.

చాట్ అనుభవాల్లోనే ఒక అనుభవం-3
 ఒక ఫేక్ ఐడి(స్త్రీ పేరు)తో కొంతకాలం చాట్‌చేసాను. వయసు నాదే, అనుభవాలు నావే. నేను ఎవరు అని తెలియకుండానూ, దొరక్కుండానూ వుండటానికి చాలా జాగ్రత్త పడేవాణ్ణి.  కొంచెం కష్టమనిపించేది. కానీ ఏదో ఆనందమనిపించేది. ఇదో పర్వెర్శన్ అని ఇప్పుడనిపిస్తుంది. ఆ చాట్‌లో ఒకరు పరిచయమయ్యారు. ఎదో కంపెనీలో సేల్స్ ఎక్సిక్యూటివ్‌గా పనిచేసేవాడు. అతని భార్య నిమ్సులో నర్సు.  దాదాపు ఆరునెలపైనే సాగింది మా చాటింగు. తన సొంతవిషయాలు చాలా చెప్పాడు. కొన్ని బలహీనతలు కూడా. ఎంత స్త్రీ ఫేక్ ఐడి అయినా హద్దుమీరి నేను మాట్లాడలేదు. తనని మాట్లాడనివ్వలేదు. నా మాటలవల్ల చాలా అలవాట్లను మార్చుకున్నానన్నాడు. నా మాటల్లో ఏదో మాజిక్ వుందనేవాడు. అది ఏంటి అనేది నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. నన్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడుకూడా. అయితే నా కున్న పరిమితులవల్ల రాలేనని చెప్పాను. 
అప్పట్లోనే గోదావరి నదీతీర గుడులు, పుణ్యక్షేత్రాలను గురించిన వివరాలు సేకరించాలనే ప్రయత్నం చేసాను. అది అతనికి ఎదో మాటల్లో చెప్పాను. ద్రాక్షారామం, రాజమండ్రి పోటోలను తనదగ్గర వున్నవి అవస్థలు పడి స్కాన్ చేసి పంపాడు. అప్పట్లో  స్కానింగు,  డౌన్‌లోడ్ చాలా నెమ్మదిగా వుండేది.  

మొదట ఏదో థ్రిల్ అనిపించినా  కొన్నాళ్ళకు అతనితో చాట్‌చెయ్యడం గిల్టీగా అనిపించేది. చాలాసార్లు చెప్పలనుకునేవాణ్ణి. కానీ ఎందుకో చెప్పలేకపోయేవాణ్ణి. ఈ ప్రవృత్తి నాకే ఎందుకో కష్టమనిపించింది.  చివరికి ఓ రోజు చెప్పేసాను. చాలా బాధ పడ్డాడు. ఇంతకీ నేనెవరో చెప్పలేదనికి.  తర్వాత తన లిస్టు లోంచి తొలగించాడు. నన్ను కూడా తొలగించేయమని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ఫేక్ ఐడిలు వాడడం మానేసాను.  

 
చాట్ అనుభవాల్లోనే ఒక అనుభవం-4
చాట్లో నార్త్ నుంచి డాక్టరు చదువుతున్న ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. నేను చిన్న చిన్నగా సేకరిస్తున్న తెలుగు కవితల్ని నాకొచ్చిన ఇంగ్లీషులోకి తర్జుమాచేసి చాట్‌లో ఉపయోగించేవాణ్ణి. అవి తను క్రమం తప్పకుండా చదువుతుండేవాడు. చిన్న చిన్న అభిప్రాయాలు చెప్పేవాడు.  కొత్తవి ఏమి రాసారు అని అడిగేవాడు. అలా ప్రారంభమైన చిన్న చిన్న కవిత్వానికి మొదటి శ్రోత అని చెప్పవచ్చు.. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు మెయిలు వచ్చింది. దానిలోని సారంశమేమిటంటే తన మెడికల్ కోర్సు పూర్తి అయ్యిందని, చాలా వత్తిడిలో చదువుతున్న సమయంలో రిలీఫ్ పొందడానికి నాతో చాట్ మరియు నా కవిత్వం సహాయం చేసిందని. తన ఉత్తీర్ణతలో నాకు కూడా భాగమివ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
తర్వాతి కాలంలో కూడా తరచూ మెయిలు చేసేవాడు. ఫోనులోకూడా సంభాషించాను. 

* * *

మారిన అభిరుచులు, పరిస్థితుల దృష్ట్యా మరుగునపడినా ఆయా సమయంలో ప్రభావితం చేసిదనే విషయం వాస్తవం. ఇవి నెమరువేసుకోవడం ద్వారా మళ్ళీ స్పూర్తి పొందడమే ఉద్దేశం.
 

No comments: