నేను ఎప్పుడో పోగొట్టుకున్నదానిని
మళ్ళా పోగొట్టుకున్నానని ఎలాచెప్పను
మిత్రమా!
నాన్న ఉద్యోగపు బదిలీలమధ్య
తొమ్మిదవ తరగతికి
సెయింట్ జేవియర్స్ హై స్కూలులో చేరినప్పుడు
కొత్తకొత్త వాతావరణం మధ్య
కలిసిన తొలి స్నేహహస్తానివి
పదవతరగతి పరీక్షలకు
కట్టా సుబ్బారావు తోటలో కలిసి చదివిన పాఠాలకు
ముఖ్యాంశాలను అద్దిన వాడివి
ఉన్నత విద్యలో నీదారి నాదారీ వేరైనా
కలిసి తిరిగిన సాయంత్రాల సాక్షిగా
జీవితాన్ని చదివిన రోజులవి
***
జీవితం జీవనభత్యాల లెక్కలయ్యాక
నీ ఇంటర్వూలవెంట
నీవు హాస్టల్ వార్డన్ అయ్యాక
నీ తొలి జాయినింగులవెంట
తిరిగిన వాణ్ణే నేనేగా
నా జీవనాన్ని వెతుక్కుంటూ తిరిగిన స్థలాలోకి నీవు రాకున్నా
నేవెతుక్కున్న జీవన సహచరిని
వరమాలలతో అలంకరించడానికి
ఊతమిత్తిన స్నేహ హస్తానివి
***
కాలం కాటేసింది
దేన్ని ఏదిమింగింగిందో తెలియకుండానే
కాలం నీవైపు అంచును జార్చేసింది
అప్పుడప్పుడూ పలకరించుకునే సెల్లు మూగబోయింది
ఈ నంబరులో ఎవరో పలుకుతారు
నీ గొంతెలా అవుతుందది!
ఈసారి ఎలా అయినా కలుద్దాం
అన్నపుడే ఒకరినొకరం పోగొట్టుకున్నాం!
ఆమాట కూడా గాలిలో కలిసిపోయింది
***
ఇప్పుడు
నేను ఎప్పుడో పోగొట్టుకున్నదానిని
మళ్ళా పోగొట్టుకున్నానని ఎలాచెప్పను
నీవులేని ఇంట నన్ను ఎవరు గుర్తిస్తారిప్పుడు.
-------
మిత్రుడు పి. శ్రీధర్ విద్యాసాగర్, ఏలూరు స్మృతిలో
No comments:
Post a Comment