Thursday, January 31, 2013

ఇదీ జీవితం పదచిత్రంగా మారితే

ఘజల్ రాయడంలో నేనూ ప్రావీణ్యున్నేమీ కాదు. ఇలానే ఒకప్పుడు  నేను రాస్తున్న కవితలు ఘజల్ లా వుంటాయని నేను రాయాలని నాచేత రాయించిన క్రెడిట్ జ్యోతిర్మయి మళ్ళ గారిది.
కవిత చదవగానే నాకు "చిత్రం భళారే విచిత్రం" అనే పాట గుర్తొచ్చింది. ఈ పాట నేపద్యానికి అనేక ప్రయోగాలున్నాయి.
ప్రాస అనుప్రాసలు వాడినప్పుడు  శబ్ద ధ్వని వస్తుంది, ఆ శబ్ద ధ్వనికి అనువైన పదాలు అమరినప్పుడు భావంతో పాటు సంగీతపరమైన ధ్వని వస్తుంది. ఇక్కడ ధ్వని రెందు రకాలు ఒకటి సాహిత్య పరమైతే తెండవి సంగీత పరమైనది. సంగీతం గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఈ ధ్వని వివరించే సాహసం చెయ్యను

ద్విపదలుగా  చూస్తున్నప్పుడు ప్రాస, అనుప్రాసలతో పాటు పాదాలలో అంత్య ప్రాసలు ధ్వనించగానే ఆ పాదాలు ఘజల్‌కు దగ్గరగా వున్నాయని పిస్తాయి. నాకూ అలాగే అనిపించాయి.  
ప్రతి పాదాని కొనసాగిస్తూ చలోక్తితో ముగించడం ఘజల్ నియమం. చిన్ని మార్పులు చేస్తే రూపంలోకి మారతాయని అనిపించడం ఓ కారణం.

ఒక పాదం చిత్రం అంత్య ప్రాసగాను తర్వాతి పాదం విచిత్రంగాను అమరిపోవడం నాకు బాగా థ్రిల్ అనిపించిన విషయం.
నిజానికి ఇలాంటి నియమం ఘజల్ ప్రక్రియలో వున్నట్టులేదు. ఇలా చేయడంలో పైన చెప్పిన పాట స్పూర్తి కావొచ్చు.
పాదాల నిడివి విషయంలో ఘజల్ నియమాన్ని పాటించలేదు. ఎందుకంటే ఆ నియమాన్ని పాటిస్తే పదాల కూర్పు మారాలి కాబట్టి ఆ స్వాతంత్ర్యాన్ని నేను తీసుకోలేదు 

మీరజ్ ఫాతీమా కవిత :
***************

ఇదీ జీవితం.

నిన్నటి అలలమీద ఎగసిన విచిత్రం,
నేడు కలలలో నిగూడ చిత్రం.

ప్రతి పలుకులోనూ ఓ ఒప్పందం,
ప్రతిరోజూ తొణికిసలాడే గాలి దీపం.

చలాకీగా సంద్రాన్ని ఈదటం నైపుణ్యం.
ఆగని నావకు లంగరె అనవసరం.

అవాస్తవ బాటని ఎన్నుకోవటమే శరణ్యం.
అందుకే దారంతా ఒంటరి ప్రయాణం.

ప్రేమ నేర్పే పలుకులే మోసపు గుళికలు.
కానీ కార్చే కన్నీరే కళ్ళకు కొస మెరుపులు.

వేదనలో రోదనై ఇంకిన రక్తపు కన్నీరు.
దేహమంతా పారదర్శకమై పారుతుంది.

రంగును కోల్పోయి రాలిన హరిత పత్రం.
హంగును కోల్పోయిన చెల్లని హామీపత్రం.

ఆక్రోశ, అసహనాల అభ్య ర్దనల మద్య,
కాలం వెంబడి వర్తమానమై సాగిపో...ఇదే జీవితం.


నేను మార్చిన ఘజల్ రూపం
******************

నిన్నటి అలలమీద ఎగసిన విచిత్రం,
నేడు కంటి కలలమీద తెరతీసిన చిత్రం

ప్రతి పలుకులోనూ ఓ ఒప్పందం
ప్రతిరోజూ తొణికిసలాడే గాలి దీపమైన చిత్రం

చలాకీగా సంద్రాన్ని ఈదటం నైపుణ్యం.
ఆగని నావకు లంగరు అనవసరమైన విచిత్రం

అవాస్తవ బాటని ఎన్నుకోవటమే శరణ్యం.
అందుకే దారంతా ఒంటరి ప్రయాణమైన చిత్రం

ప్రేమ నేర్పే పలుకులే మోసపు గుళికలు
కార్చే కన్నీరే కళ్ళకు కొస మెరుపులైన విచిత్రం

వేదనలో రోదనై ఇంకిన రక్తపు కన్నీరు
దేహమంతా పారదర్శకమై పారుతున్న చిత్రం

రంగును కోల్పోయి రాలిన హరిత పత్రం.
హంగును కోల్పోయిన చెల్లని హామీపత్రమైన విచిత్రం

ఆక్రోశ, అసహనాల అభ్యర్దనల మద్య ఫాతిమా
కాలం వెంబడి వర్తమానమై సాగిపో ఇదే జీవిత పదచిత్రం

---------
శ్రీనివాస్ వాసుదేవ్ గారికి, మీరజ్ ఫాతిమా గారికి
ఇలా నాచేత రాయించినందుకు ధన్యవాదాలు