Saturday, December 15, 2012

కె. శివారెడ్డి కవిత్వం - కవిత



కవులేం జేస్తారు
***
కవులేం జేస్తారు
గోడలకు నోరిస్తారు
గుట్టకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు
కవులేం జేస్తారు
ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు
ప్రజలకు చేతులిస్తారు
తెల్లకాయితానికి అనంత శక్తినిస్తారు


కవులేం జేస్తారు
చేతుల్లోకింత మట్టి తీసుకొని శపిస్తారు
మణికట్టు దాకా నరికినా
మొండి చేతుల్తో గోడలమీద పద్యాలు రాస్తారు
జేవురు రంగుతో అరక్షణం
గోడలమీద ప్రత్యక్షమయిన పద్యాలు
మరుక్షణంలో
జనం దేహాలమీద ప్రత్యక్షమవుతాయి
దేహాలు సముద్రాల్లాగా దొర్లుతాయి
ఇసుకరేణువులన్నీ పద్యపాదాలై పల్లవిస్తాయి

గోడున్నందుకి ఇంటిని నిందించు
యిల్లుందకు మనిషిని నిందించు
మనుషులున్నందుకు దేశాన్ని నిందించు
మీక్కావలసింది
గోడలులేని యిల్లు, ఇళ్ళులేని మనుషులు
మనుషులు లేని దేశం
మీరు ఎడారి పట్టాభిషక్తులు
ఏలుకోండి ఎడారిని, ఎడారిని ఏలుకోడి


కవులేం జేస్తారు
చట్తాన్ని ధిక్కరిస్తారు
ఎడారిమీద పద్యాలు రస్తారు
ఎడారి క్రమంగా
సజీవ దేశంగా రూపొందుతుంది


కవులేం జేస్తారు
గోడలకు నోరిస్తారు
చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు
ప్రజలకు చేతులిస్తారు
ప్రజల చేతుల్లో
అనంత శక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.
* * *

కె. శివారెడ్డి గుంటూరు జిల్లాలోని కార్మూరివారిపాలెంలో 1943 ఆగష్టు 6న జనించారు. విప్లవకవుల్లో కె. శివారెడ్డి ఒకరు. ఈయన విప్లవ కవితా దృక్పదంతో రక్తసూర్యుడు, చర్య, ఆసుపత్రిగీతం, నేత్ర ధనస్సు, భారమితి, మోహనా! ఓ మోహనా!, అజేయం, నా కలల అంచున, వర్షం, జైత్రయాత్ర వంటి కవితా సంపుటాల్ని ప్రచురించారు. తన విప్లవ కవిత్వానికి వచన కవిత్వాన్ని వాహికగా స్వీకరించాడు. ఈయన కవితలు సుదీర్ఘంగా వుంటాయి. పునరుక్తుల్ని కూడా బాగా కలిగి వుంటుంది. సామాజిక అంసాల్ని ఆయన పదే పదే ఆలోచించి కవితాబద్దం చేస్తాడు. విప్లవకవిత్వం నినాద ప్రాయంగా వుంటుందనే అపవాదుకు ఈయన మినహాయింపు. శివారెడ్డి కవిత్వం అనుభవ మాధుర్యంగానూ, ఆలోచనా నిమగ్నంగానూ, అనుభూతి ధగ్నంగానూ వుంటుంది.


No comments: