Thursday, August 9, 2012

ఆసుపత్రి అనుభవం - 1




నియమితమైన పడక
లేచి తిరగడానికి కొన్ని ఆంక్షలు

ఏదీ చదవటానికి లేదు
ఏదీ రాయటానికి తట్టదు

నిద్రకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టు
బాల్యంలో రాని పద్యాన్ని వల్లెవేస్తున్నట్టు
కళ్ళలోనో, జ్ఞాపకంలోనో
ఒక అంసంపూర్ణ కవిత్వానికి చివరివాక్యాన్ని ఎక్కడో పారేసుకున్నట్టు
ఇక్కడైనా దొరుకుతుందంటావా?

సమయాన్ని నేను కోస్తున్నానా?
సమయం నన్ను కోస్తుందా??

నాతోపాటు కొందరు
ఎవరిదేహం పడ్తున్న అవస్థ వారిదే
కొన్ని ఆర్తనాదాలు, కొన్ని మూల్గులు
వినటంతప్ప ఏమీచేయలేని స్థితి

ఒంటరితనం ప్రక్కనచేరి
వూసులాడాలని విఫలయత్నం

శరీరానికి గ్రుచ్చుతున్న సూదులు
గుండెచప్పుళ్ళను కొలమానాల్తో కొలిచి
దారితప్పిన నాడీమండలవ్యవస్థను సరిచెయ్యాలని
ఆత్రంగానో కర్తవ్యంగానో పరుగులు తీసే నర్సులు

నిద్రపట్టని సమయంతో ఇటు అటూ వత్తిగిల్లి
ఒంటరితనాన్ని దగ్గరకు పిలిస్తే
అన్నీ నిరాశా పర్వాలు తెరిచి చదువుతుంది
ఒక్కసారి వూకొట్టడం మొదలుపెడితే
దారితెలియని ఏ సొరంగ మార్గంలోనో వదిలివేస్తుంది
 ఈ ఒంటరితనంతో జాగ్రత్తగానే వుండాలిసుమా!

నియమితమైన పడక
లేచి తిరగడానికి కొన్ని ఆంక్షలు

ఏదీ చదవటానికి లేదు
ఏదీ రాయటానికి తట్టదు



(ఆసుపత్రి అనుభవంనుంచి)

No comments: