బ్లాక్ ఇంక్
..... వినోదిని
సెల్లారంతా పిల్లలతో విరగబూసిన పూలతోటలా ఉంది. రకరకాల పిట్టలు అరుస్తున్నట్టు పిల్లల అరుపులు, ఆటలు, కేకలు - గోలగోల. బుల్లి బుల్లి సైకిళ్లు - తూనీగల్లా. తూనీగల మీద సీతాకోకచిలకల్లా పిల్లలు - జుయ్ జుయ్ మని. సడెన్ బ్రేకులు - నవ్వులు - విరగబడి, తుళ్లిపడి, పడీపడీ, పకాపకా. విచ్చుకున్న పువ్వులా మొహాలు. రాలిపడుతున్న పుప్పొడిలా నవ్వుల వెలుగులు.
స్సుర స్సుర టీ పొంగి స్టవ్వారిపోయింది.
ఒక చేతిలో టీ కప్పు - ఇంకో చేతిలో రిమోట్.
'కలిసి పాడుదాం' అంటూ పిల్లలతో కలిసి పాడుతున్న శోభన్‌బాబు ... 'బలిపీఠమా'...?
కాలింగ్ బెల్ బదులు వేళ్ల కణుపులతో శబ్దం - రిథమిగ్గా. పాటని మ్యూట్‌లోకి తోసి తలుపు తీశా.
సీతాకోకరెక్కల్తో నేసిన ఫ్రాకేసుకున్న పువ్వులా - పాప.
ఎనిమిదేళ్లుంటాయా?
కళ్లనిండా నవ్వు - ఉబికి ఉబికి వస్తోంది. పట్టనంత నవ్వుని నోట్లో కుక్కుకుని, ఇంకొంచెం నవ్వుని బుగ్గల్లో దోపుకొని ... బొటన వేలెత్తి రెండు పెదాల మధ్యకు తీసికెళ్తూ ... పువ్వు తిరిగి తాజాతనం పొందడానికి కొంచెం నీళ్లు చిలకరించుకోడాని కొచ్చినట్లుంది.
లోపలికి రమ్మన్నట్లుగా తలూపి ఫ్రిజ్ దగ్గరకు నడిచా - నా వెనకే తను ... పూరేకల పాదాలకు చుట్టిన పట్టీలు కూడా మెత్తగానే మోగుతున్నాయ్.
"ఆంటీ, ఆ పాట్ వాటర్ యిస్తారా?''
నోటి పూలగంపలోంచి ఓ నవ్వు పువ్వు తుళ్లి పడింది.
కళ్లల్లో చిన్న ఆశ ... చిన్న యిష్టం ... చాలా చిన్న అభ్యర్థన ...
నాకూ కుండకీ మధ్య మైలు దూరం ఉండి, ఆ మధ్యలో గులక రాళ్లుండి, నాకు చెప్పుల్లేకున్నా సరే - వెళ్లి నీళ్లు తెచ్చుండే దాన్ని.
వెంట వెంటనే రెండు గ్లాసులు తాగింది.
"థ్యాంక్యూ ఆంటీ ... గేమ్ మజ్జలో వచ్చేశాను'' గ్లాసు టీపాయ్ మీద పెట్టి - తలుపు బయట విప్పిన పొందికైన హై హీల్ పిచ్చుక గూళ్లల్లో పసిపావురాయి పాదాలను దోపి, రెక్కలు మొలిచిన డాల్ఫిన్‌లా ఎగురుకుంటూ, ఈదుకుంటూ మెట్లమీంచి సెల్లార్లోకి చేరిపోయింది.
పాప తాగిన గ్లాసు పక్కనే టీ కప్పు - వంగి తీసుకున్నా. ఛానెల్ మార్చా. బ్లాక్ అండ్ వైట్‌లో కుట్టి పద్మిని - కళ్లు తిప్పుతూ ... 'పిల్లలూ దేవుడూ చల్లని వారే... కల్ల కపట మెరుగనీ కరుణామయులే'' పాడుతోంది.
నా 'టీ' చల్లబడిపోయింది. టీ వేడిగానే తాగాలి. మళ్లీ టీ పెట్టుకున్నా ... వేడి వేడి టీ. కప్పులో పోసుకొనొచ్చి కూర్చోబోతుండగా మళ్లీ అదే శబ్దం - తలుపు మీద వేళ్ల కణుపులతో ...
బెలూన్‌లో గాలిలా ... బుగ్గల్లో నవ్వుతో మళ్లీ అదే చందమామ.
ఈ సారి చిటికెన వేలుని గోరు కన్పించేటట్లు పైకి లేపి రెండు కళ్ల మధ్య నిలబెడుతూ ...
ఈ సారి యిదన్నమాట ... నవ్వొచ్చింది. బాత్రూమ్ వైపు చెయ్యి చూపించా!
"జుజ్జెపుడూ లెట్రిన్లోనే వెళ్లాలి. బాత్రూంలో వెళ్లకూడదు. మమ్మీ చెప్పింది. ఇప్పుడు నేను లెట్రిన్లోనే వెళ్లా.''
వెన్నెల్లో ముంచి తీసిన రెండు పూరెక్కలకూ మధ్య తేనె చుక్కలద్దినట్లు కళ్లు - వాటి మీద వాలడానికి తటపటాయిస్తున్న రెండు కందిరీగల్లా దట్టమైన వెంట్రుకలతో కనురెప్పలు ... చెమట పట్టినట్టు మొహమంతా ... నవ్వు పట్టింది.
ఎప్పుడూ యిలా నవ్వుతూనే ఉంటుందా? పేరేమయి ఉంటుంది? హాసిని? హాస్య? హసిత? స్మైలీ...? " ఆంటీ, నేను కొంచెం సేపు మీ దగ్గరుండొచ్చా?''
ఊర్లో మా తాటాకు బాత్రూం దడిమీద అల్లుకున్న పచ్చని తీగ మీద పూసిన పసుపు పచ్చని సోయగాల బీరపువ్వు నడిచొచ్చి నా యీ కాంక్రీట్ కుటీరంలో తన పుప్పొడి చినుకుల నవ్వులతో నాతో గడుపుతానంటే వద్దనడం కూడానా ...?
"కూర్చో, నీ పేరేంటి?''
"శ్రియ, ఫోర్త్ బి''
"ఏ ఫ్లాట్?''
"మాది గాంధీనగర్ ఆంటీ. సెకెండ్ ఫ్లోర్ టూ జీరో టూలో మోహన్రావుగారు మా చినతాతగారు. అంటే మా డాడీకి చినడాడీ అన్నమాట. ఈ రోజు రేపు హాలిడేస్ కదా, ఇక్కడికొచ్చేశా. మోర్నింగ్ మా డాడీ దింపేసి వెళ్లిపోయాడు.''
ఒక కేబుల్ కనెక్షన్ ... వంద ఛానళ్లు.
"మీరు జాబ్ చేస్తారా ఆంటీ''
చెప్పాను. వివరాలు కూడా.
"ఇది మాకు స్కూల్ వదిలే టైం. నేను యింటికొచ్చేసరికే ఫోర్, ఫోర్ఫిప్టీన్ అయిపోతుంది. నేను యింటికి రాగానే ఫస్టు మా మమ్మీ హార్లిక్సిస్తుంది''
నేను టీ తాగి తనకి హార్లిక్స్ కలిపా.
మొహమాటపు రేపర్ చుట్టిన చాక్లెట్ నవ్వు!
రెండు చేతులతో జాగ్రత్తగా కప్పు పట్టుకొని చాలా యిష్టంగా తాగుతోంది. చివర్లో కొంచెం మిగిల్చి లేచి నిలబడి "అపాంగ్ జపాంగ్, బపాంగ్!!'' అంటూ అడ్వర్టయిజ్మెంట్లో పిల్లల్లా నడుమూ, చేతిలో కప్పూ తిప్పుతూ ...
చాలా నవ్వొచ్చింది ... గట్టిగా నవ్వాను.
నేనింకా నవ్వుతుండగానే నా కప్పు, తన కప్పు తీసుకెళ్లి సిింకులో పెట్టేసింది.
"ఏంటలా చూస్తున్నారూ? నాకు ఖాళీగా ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటా. ఇంట్లో కూడా అంతే. ఎప్పుడూ మా మమ్మీకి హెల్ప్ చేస్తుంటాను ... సో ... నాకేదయినా పని చెప్పండి ...''
"చెప్తాలే, దా. ముందిటొచ్చి కూర్చో - మీ యింటి దగ్గర నీకు ఫ్రెండ్సున్నారా?''
"ఓ తరుణ్, ఆష్తోష్, లాలస ... యివి ఫ్రిజ్‌లో సర్దాల్సిన కూరగాయలా'' పొద్దున రిలయన్స్ నుండి తెచ్చిన కవర్లను చూపిస్తూ అడిగింది.
నవ్వుతూ కవర్లను ఫ్రిజ్ దగ్గరకు లాగా. ఇద్దరం అక్కడే చతికిలబడ్డాం.
పాప మాట్లాడుతూనే ఉంది. ఏ మాటా తనంతట తాను బయటకు రావడం లేదు. వెనకా ముందూ నవ్వుల కాన్వాయ్. కూరగాయల్ని ఆర్నమెంట్లుగా ఎట్లా ఉపయోగించొచ్చో చెబుతూనే పీలర్, చాకూ తీసుకొని వాటిని పూలనీ, పక్షుల్నీ చేయడానికి ఒకటే ప్రయత్నం.
ఫెయిలయితే దీనికి రెక్క విరిగిందనీ, దీనికో కాలు పొట్టలోనే ఉంది - ఆపరేషన్ చేసి బయటకు తియ్యాలని చమత్కరించింది. తను చెప్పే తీరుకి చాలా చాలా నవ్వొచ్చేస్తోంది. తట్టుకోలేనంత! నవ్వుకీ నవ్వుకీ మధ్య ఒక షార్ట్‌బ్రేక్ కూడా లేకుండా పోతోంది.
కూరగాయలు సర్దడం అయిపోయింది. తను లేచి నిలబడి నాకు చెయ్యందించింది. మీగడతో చేసినట్లు చేతివేళ్లు - ముట్టుకుంటే నా వేలి ముద్రలు పడతాయేమోనన్పించేంత నున్నగా, పారదర్శకంగా, సుకుమారంగా ... ఆ చెయ్యి వదలాలన్పించలా - నా స్పర్శ తనతో ఏం చెప్పిందో, తలెత్తి నా మొహంలోకి చూస్తూ నా నడుముని చుట్టేసింది.
పాలపువ్వుల్ని పూసిన పూలతీగలా పాప! నా మనసు పూరేకుల మత్తులో కూరుకుపోయింది.
నా గుండెల వరకే వచ్చిన పాప మునివేళ్ల మీద పైకి లేచి నవ్వుల బుగ్గల్లోంచి పెరుక్కొచ్చిన ఓ హాయి ముద్దుని పెదాల మీదకి లాక్కొచ్చి లేతలేతగా తడితడిగా నా బుగ్గమీద అద్దింది. అటు మనసూ, ఇటు శరీరం దూది మబ్బుల్లోంచి దూరి, నెలవంక అంచుల్ని పట్టుకుని "సీ - సా'' ఆడుతున్నాయి.
ఇద్దరం హాల్లో కొచ్చాం. నా చెయ్యి ఒకటి తన భుజం చుట్టూ తన చెయ్యి నా నడుం చుట్టూ.
"ఏం చేద్దాం?'' అడిగా.
"ఓ పని చేద్దాం! ఏదైనా పనిచేద్దాం!!''
బాల్కనీ లోంచి ఆరిన బట్టల్ని తెచ్చి దీవాన్ మీద వేసి మడత పెట్టడం మొదలుపెట్టాం. కర్చీఫుల్ని సమోసాల్లా మడత పెట్టి తలమీద పెట్టుకొని -
"హ్హే స్సమోస్సాలే .. స్సమోస్సాలూ ...'' అంటూ ఇల్లంతా తిరుగుతూ అమ్మింది.
రెండేసి ముద్దులకి ఒక సమోసా చొప్పున నేనే కొనుక్కున్నాను.
"అవునూ. నువ్వింక ఆడుకోడానికి వెళ్లవా?''
"ఊహూ ... మీతోనే ఉంటాను'' నవ్వుని గారాబంలో రంగరించి ...
"ఆం బీం బుష్'' అని ముద్దుకి ఓ రూపం తెప్పిస్తే అది ఈ పాపమొహం.
"అలాగే'' అన్నాను.
"ఇంకా ఏదైనా పని చేద్దామా?'' అడి గింది.
"ఓ పని చేద్దాం, ఏమైనా తిందాం'' అని, వంటింట్లోకి వెళ్లి నలుపలకల స్టీల్ సాసర్ నిండా గవ్వలు తెచ్చాను. వాటిని చూసి అడిగింది.
"మెగాస్టార్ ఫుడ్డా''
"ఏం? యివంటే ఆయనకిష్టవా?''
"ఊహు కాదు. చిరుతిండికి నేను పెట్టిన ట్రాన్స్లేషన్ పేరు''
ఇద్దరం పకపకా నవ్వుకున్నాం. తనకి ఏ మెగాస్టార్ ఫుడ్డిస్టమో లిస్టు చెప్పుకొస్తోంది.
మార్కెట్లో రంగురంగుల పూలు కుప్పలు కుప్పలుగా పోసినట్టు నవ్వుల పువ్వుల్ని నా యింటినిండా పోసింది. క్రిస్మస్‌రోజున మా యింటి సీలింగుకీ, గోడలకీ, తలుపులకీ, కిటికీలకీ వేలాడే రకరకాల డిజైన్లున్న రంగురంగుల కాగితాల్లా నా యింటినిండా ఈ పాప మాటలే అతుక్కొని గాలికి ఊగుతున్నాయి.
"ఆంటీ, ఆ సౌండేంటీ?'' పక్క ఫ్లాట్‌లోంచి గట్టిగా కసిగా తలుపులు బాదుతున్న శబ్దం వినబడి కనుబొమలు పైకి లేపుతూ అడిగింది.
"పక్కింటోళ్లు, వాళ్ల డాగుని లోపలబెట్టి లాక్ చేసి బయటికెళుతుంటారు. మళ్లీ వాళ్లు తిరిగొచ్చేవరకూ అది అలాగే చేస్తుంటుంది. కుక్కంటే ఎవరూ నమ్మరు. అచ్చం మనిషిలా ముందు కాళ్లతో తలుపునలా బాదుతూనే ఉంటుంది.''
"పాపం కదా. ఎందుకలా యానిమల్స్‌ని బాధ పెట్టడం?''
" .......'' ఏం చెప్పాలి?
"యానిమల్స్ బాధ పడితే నేనసలు చూడలేను. ఒకసారి ఏమయిందో తెల్సా ఆంటీ? నేను స్కూల్ నుంచి ఆటోలో వస్తున్నా. డ్రైవరంకుల్ అందర్నీ వాళ్లిళ్లదగ్గర దించేశాడు. నేను చివర్లో దిగుతానన్న మాట. ఇంకో ఫైవ్ మినిట్స్‌లో మా యిల్లు వచ్చేస్తుంది. గల్లీలోంచి వస్తుంటే ఒక పిగ్పిల్ల మా ఆటోకింద పడింది. దాని కాలు విరిగింది. ఆటో ఆపమంటే అంకులేమో 'ఫర్వాలేదు ... వెళ్లిపోదాం' అన్నాడు. నేను దెబ్బలాడి దానిని ఆటోలో ఎక్కించుకోని ... నా కర్చీఫ్‌తో కట్టు కట్టాను. ఒళ్లో పెట్టుకొని నారాయణగూడ హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టరు చేత కట్టు కట్టించాం. మళ్లీ తీసుకొచ్చి అదే గల్లీలో వదిలేశాం - వాళ్ల అమ్మ దగ్గర ...'' వెలుగు మొహంతో కాండిల్లా నిలబడి చెప్పుకుపోతోంది.
"మరి నువ్వు రాకపోతే మీ అమ్మ కంగారు పడలేదా?''
"ఎందుకూ? డ్రైవరంకుల్ సెల్ఫోన్లోంచి ఫోన్ చేసి చెప్పాగా?!''
"ఇంటికొచ్చాక ఆ పిగ్పిల్ల గుర్తొచ్చి డల్‌గా అన్పించింది. రాత్రి ట్వల్వ్ వరకూ కూర్చుని ఇదంతా డైరీలో రాశా...''
"యేంటీ? నువ్ డైరీ రాస్తావా?'' ఇంకేదో చెప్పబోతుంటే ఆపి కొంచెం ఆశ్చర్యంగా అడిగా.
"అవునాంటీ, నేను రోజూ డైరీ రాస్తా. నాకిది మా రాఘవ మామ నేర్పాడు. నాకు సిస్టర్స్, బ్రదర్స్ లేరుకదా, ఒక్కదాన్నే కదా. అందుకే డైరీతో షేర్ చేసుకుంటానన్నమాట...''
బయట చీకటి కమ్ముకుంటోంది. నా ఫ్లాట్‌లో మాత్రం ఈ మూడడుగుల నిలువు చందమామ వెన్నెల కురిపిస్తూనే ఉంది. చీకటిని చొరబడనివ్వకుండా వెలుగు నవ్వుల కర్రలు విసురుతూనే ఉంది.
పాప చెప్పేది వింటూనే కారట్ వేపుడు చేశా. పెరుగు చారు చేశా. కొంచెం ముద్దపప్పు చేశా - ఇవన్నీ పాపకి యిష్టమైన పదార్థాలని తెలుసుకొని.
"అన్నం తినేద్దామా?'' అడిగా.
"అప్పుడేనా? ఓ పని చేస్తా. నేను మీతో కల్సి భోంచేస్తానని మా నాన్నమ్మతో చెప్పి వచ్చేస్తా!''
"తొందరగా వచ్చెయ్''
రెండు నిమిషాల తర్వాత - వాకిట్లో చెప్పులిప్పి, ఆ ఏడేడు రంగుల ఇంద్రధనుస్సు ఒంటినిండా నవ్వుల తళుకులు అద్దుకొని అడుగుపెట్టింది. బుల్లి బొటనవేలు ఎత్తి చూపి "నా భోజనం మీతోనే'' అంటూ ఒక్క గంతులో నన్ను హత్తుకుపోయింది.
ఏదో సువాసన తన మీంచి నా మీదకు వస్తోంది. ఒంటి మీద నుంచి కాదు ఒంట్లోంచి. మనుషుల్ని తన వశం చేసుకొనే పరిమళమేదో పిల్లల ఒళ్లు సహజ సిద్ధంగానే వెదజల్లుతుందనుకుంటా. గుండెల్నిండా ఆ సుగంధ ద్రవ్యాన్ని పీల్చుకున్న పరవశంతో పాప నుదుటిమీద ముద్దుపెట్టుకున్నా. ఇద్దరం కిచెన్‌లో కెళ్లాం. గిన్నెలన్నీ హాల్లో టీపాయ్ మీదకు చేరవేస్తోంది.
చిన్నప్పుడు మా యింటి తాలూకు కప్పుల్లోంచి దూరొచ్చిన కాంతికిరణం మట్టినేల మీద వెలుగు సున్నాలా పడి - కొంచెం కొంచెం - జరుక్కుంటూ జరుక్కుంటూ వెళ్లినట్లు ఈ పాప తన వెలుగు పాదాలతో ఇల్లంతా కలియ తిరుగుతూ నా మనస్సంతా నులివెచ్చని వెలుతురు పూలని పూయిస్తోంది.
"రేపీవినింగ్ ఇంటికెళ్లగానే మీ గురించి కూడా నా డైరీలో రాసుకుంటా'' గిన్నెల్లో గరిటలు పెడుతూ ..."అవునూ నా డైరీ గురించి మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు కదా?''
"ఏంటబ్బా'' ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి తనకందిస్తూ అడిగా.
"నా కిష్టమైనవే బ్లూ ఇంకుతో రాసుకుంటా, నాకు నచ్చనివి ఇష్టం లేనివి బ్లాకింకుతో రాస్తా...''
"అంటే పిగ్పిల్ల గురించి బ్లాక్ ఇంక్‌తో రాశావా?''
"నోనో ... అది నాకు చాలా ఇష్టమైన పని... ఒకసారి మహిమ వాళ్లింటికెళ్లి వాళ్లమ్మ పెడితే టిఫిన్ తిన్నా ... అది బ్లాకింకుతో రాశా... ఈ బౌల్లో దేంటాంటీ...?''
"చికెన్. నిన్నటిది. ఫ్రిజ్‌లో ఉంటే తీశా''
"అదేంటి? మీరు నాన్‌వెజ్ తింటారా?'' చాలా ఆశ్చర్యంగా ... చాలా చాలా అనుమానంగా అడిగింది. తన ప్లేట్లో అన్నం పప్పు పెట్టి కొంచెం క్యారెట్ ఫ్రై వేశా.
"అవునూ ... ఏం?'' నా ప్లేట్లో అన్నం కొంచెం కొరివికారం పచ్చడి, రెండు చికెన్ ముక్కలు వేసుకుంటూ.
"మీరు బ్రామ్మిన్స్ కారా?'' కళ్లలో ఎప్పుడూ ఉండే నవ్వు చెప్పాపెట్ట్టకుండ ఎక్కడికో ఎగిరిపోయింది.
"కాదు''
"చౌదరీసా?''
"కాదు''
"మరి రెడ్డీసా?''
"ఊహూ ... కాదు.''
"మరి యింకెవరు?''
"దళిత్'' ఆ పిల్లతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
"అంటే .... వేరే హిందూసా?''
"కాదు. క్రిస్టియన్స్.''
"హరిజన్సా? అంటే మహిమా వాళ్లకి లాగా...?''
ఆరో తరగతిలో డ్రిల్లు మాస్టారు గ్రౌండ్లో పరిగెత్తమన్నప్పుడు చూపుడు వేలంత ముల్లు అరికాల్లో కసుక్కున దిగి కాడ దగ్గర విరిగిపోయింది. ఇప్పుడదే ముల్లు తిరిగొచ్చి రెండింతలై నా గుండెల్లో కసుక్కున దిగబడింది.
"ముందు అన్నం తిను...'' నేను అన్నం కలుపుకుంటూ అన్నాను.
"నిజం చెప్పండి, హరిజన్సేనా...?'' పాప మొహంలో రంగులన్నీ మాయమయ్యాయి. చిన్నగా బూడిదరంగు అలుముకుంటోంది.
"అవును ... అయినా యిప్పుడవన్నీ ఎందుకు? మనం ఫ్రెండ్స్ కదా, మనమధ్య అవన్నీ అవసరమా?''
"ఊ ... మా డాడీకి, మా మమ్మీకి హరిజన్ ఫ్రెండ్సే లేరు. నాక్కూడా లేరు. అసలు మాకు వాళ్లతో ఫ్రెండ్షిప్పే ఇష్టం ఉండదు. నా ఫ్రెండ్సంతా బ్రామ్మిన్స్, చౌదరీస్, రెడ్డీస్, వేరే హిందూస్ ...''
ఆకాశం అంచుల వరకు ఎగిరిన రంగుల గాలిపటం పుటుక్కున తెగిన చప్పుడు -
"నేనంటే నీ కిష్టమే కదరా ...'' నా చేతిలో అన్నం మెతుకులు నలిగిపోతున్నాయి.
"ఇష్టమే ...'' పాప మొహం వాంతి తన్నుకొస్తోంటే అతి కష్టం మీద ఆపుకున్నట్లుంది.
"మరి కూర్చో, అన్నం తిందాం''
కూర్చోలేదు పాప. అలాగే నిలబడి నా వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. లుకలుకమని తిరుగుతున్న తెల్లటి పురుగుల్ని చూస్తున్నంత అసహ్యం ఆ పిల్ల కళ్లల్లో.
"నానమ్మ పిలుస్తున్నట్లుంది'' గబగబా నడుచుకుంటూ బైట విప్పిన చెప్పుల్ని వేసుకొని పడిపోతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తుకొని వెళ్లిపోయింది.
ఇందాకటి వెలుగుసున్నా భూతద్దంలోంచి నా గుండె మీద నిలబడిపోయింది.
గదినిండా పేరుకుపోయిన రంగు రంగుల సీతాకోకచిలకలు బొచ్చు పురుగులై నా మీదకు పాక్కుంటూ వస్తున్నాయ్!
ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం 27.7.2008
బ్లాక్ ఇంక్
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/27-7/story
పెదరాయ్డు said...
ఆ పసి హృదయంలో నాటిన ఆ విషపు మొక్క తనంతటత తానే పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఎందుకో తెలియని కుల కట్టుబాట్ల నుంచి బయటకు రావడానికి ఒక జీవిత కాలం పట్టొచ్చు.
-----
3498
3 comments:
ఆ పసి హృదయంలో నాటిన ఆ విషపు మొక్క తనంతటత తానే పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఎందుకో తెలియని కుల కట్టుబాట్ల నుంచి బయటకు రావడానికి ఒక జీవిత కాలం పట్టొచ్చు.
కదిలించిన కధండి. ఇంతమంచి కధని మేము మిస్సవకుండా అందజేసినందుకు ధన్యవాదాలు. పంది కి సహితం ప్రేమని పంచిన పసి హృదయంలో నాటిన విషబీజాలు ఏ సమాజానికి దారి తీస్తాయో?
మ౦చి కథ ల౦కె ఇచ్చిన౦దుకు ధన్యవాదాలు.
Post a Comment