
photo : khojhyderabad.com
నీవొచ్చేలోగా
నా వూహ
మబ్బుల పల్లకినెక్కి ఊరేగుతోంది
మనసు చేసే తొందర సవ్వడితో
మేనంతా పులకిస్తుంటే
ఇరుగు పొరుగు
బుగ్గలేం కెంపులయ్యాయని
పదే పదే నిలదీస్తున్నారు
చేతిన పండిన గోరింట
కొత్తరంగేదో మనసుకు పులిమింది
ఏ దుస్తులు ధరిస్తే
నీకందంగా కనిపిస్తానో తేల్చుకోలేక
ఉన్నవన్నీ చిందరవందరయ్యాయి
గుమ్మాలకు వేల్లాడే
పరదాల్లాంటి ఆంక్షల చూపులను తోసుకుంటూ
నీకోసం... ఉద్యానవనంలో... నిరీక్షిస్తున్నప్పుడు...
నిశ్శబ్ద మైదాన పరిసరాల్లో
నా గుండె
శబ్దపు పరుగును పెంచుతుంటే
మిణుగురు చెస్తున్న ప్రేమకాంతిలో
పికిలిపిట్టల గానమౌతోంది
నీవొచ్చేలోగా
ఈ గదినలంకరించాలని
తెచ్చిన పూలగుత్తులన్నీ
ఆత్రంలో అలసిన నన్ను
దిగాలుగా చూస్తున్నాయి
తీరా నీవొచ్చేసరికి
జిడ్డోడుతున్న మొహంతో
చెదిరిన కురులతో
నలిగిన వస్త్రాలతో
ఇక్కడే ఇలానే
నిలచేవున్నాను సుమా!
ఇలాక్కూడా అందంగావుంటావనే
నీ మాట
నా అలసటనుపోగొట్టి
నన్నింకా గిలిగింతలు పెడ్తూనేవుంది.
--------------
ఓ రోజు అమ్మ సంకలనం పేజీలను టైపుచేస్తున్నప్పుడు సుమారు రాత్రి రెండు గంటలయ్యింది. సిస్టం కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఎలగైనా పూర్తిచెయ్యానుకుంటూనే కుర్చీలోనే నిద్రపట్టింది. హటాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు నులుపుకుంటుంటే కొన్ని వాక్యాలు నన్ను వెంటాడాయి. అవే ఇవి ఇలా ఇక్కడ చేరాయి. అప్పటికి సమయం 4.00 గంటలయ్యింది.
------------
3425
8 comments:
బాగుంది :-)
అలాంటి బేషరతు ప్రేమ మనం ఎవరికోసం నిరీక్షిస్తున్నామో వారు ఇవ్వగలిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది కదా...బాగుందండి మీ కవిత...
ఊహలు మబ్బుల్లో తేలిపోవటం,
మనసు రంజితమవ్వటం
గుండె పికిలిపిట్టల గానమవ్వటం
ఏమి పదచిత్రాలండీ గురూగారూ
చాలా అద్బుతంగా ఉంది.
గుమ్మలకు: గుమ్మలా లేక గుమ్మాలా?
చాలా బాగుంది. మాంచి తొణికిసలాడే కవిత్వంతో ఉంది.
బొల్లోజు బాబా
"నీవొచ్చేలోగా
నా వూహ
మబ్బుల పల్లకినెక్కి ఊరేగుతోంది"
caalaa amdam gaa modalu pettaau kavitani.caalaa baagundandi.
@పూర్ణిమ
@ఏకాంతపు దిలీపు
@రాధిక
మీ స్పందనకు నెనరులు
@పూర్ణిమ
@ఏకాంతపు దిలీపు
@రాధిక
మీ స్పందనకు నెనరులు
@బొల్లబోజు బాబా
గుమ్మలు కాదు "గుమ్మాలే" సరిచేసాను
సూచినందుకు నెనరులు
పద చిత్రాలగురించి ఓ మాట
2-4 గంటలమద్య నాకు కలిగిన అలౌకికమైన భావనను చెప్పడానికి అప్రయత్నంగానే జాలువారాయి.
ఇలాంటి ప్రేమను తలపోస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడూ,
బైబిలులోని (పరమగీతము) సొలోమాను రాసిన ప్రేమతత్వము లేదా కృష్ణుడు - సత్యభామల మద్య వుండే ప్రేమ తత్వము నన్ను వెంటడుతుంటాయి.
Nice Literary Blog
Post a Comment