Tuesday, January 1, 2008

ఇసుక రేణువుల గీతం

గీతమాలపించాలని
గొంతు మథనపడ్తుంది
ఏ అనురాగం నిన్నూ నన్నూ ముదివేయలేదు
ఎడారి ఇసుకరెణువుల్లో
విస్తరించిన అడుగులేవీ నే లెక్కించలేదు
హటాత్తుగా కురిసిన వానకు
ఊరంతా మునిగినట్టు
మునుగుతున్న తనమేదో
వుక్కిరిబిక్కిరి చేస్తుంటే
గీతమాలపించాలని వుంది
చుక్క చుక్క ఏకమై
వాగై పారినట్టు
పారుతున్న ఏటివాగు ప్రక్క
పులి ఘర్జించినట్టు
రక్తానికి చమురుకు మద్య
హూంకరించిన
ఎడారి సింహమా!

పక్షి కన్ను గురిచూసిన
బాలార్జునుడు విలుకాడయ్యాడు
ఎగురుతున్న డెగ కన్నుకు
విహంగ పరుథుల్ని గీసిన నీవు
ఏ రాజదండానికో బలయ్యావని
గీతమాలపించాలని వుంది
మొక్కవోని ధైర్యంతో
తూటాల్లోంచి
మరణాన్ని ఆహ్వానిస్తున్న
ధీరతేజమా
గీతమాలపించాలనివుంది

ఎదురయ్యే జీవ్మరణాలతో
బెదరని గుండె
తీక్షణపు చూపును
ఆవాహన కోసం ఆహ్వానిస్తున్నా
ఒక్క క్షణం ఈ గుండెల్లో నిలిచిపో!
తరతరాలలో నిరంతరం పాడుతూనే వుంటాను
నీ ధైర్యాన్ని పాటగా!

ఆంధ్ర ప్రభ 3.12.2006
(సద్దాం జ్ఞాపకంలో )

2 comments:

కొత్త పాళీ said...

జాన్ గారూ..

సద్దాం మీద కవిత్వమా అన్న విషయం పక్కన బెట్టి కేవలం పద్యం మీదే దృష్టి పెడితే ..
1. దీనిలో అచ్చుతప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
2. ఇసుక రేణువుల గీతం అన్న శీర్షిక చాలా బాగుంది.
3. పులి గర్జించినట్టు గర్జించిన ఎడారి సింహం .. పోలిక అతక లేదు.
4. డేగ కన్నుకి విహంగ పరిధి అనే పదచిత్రం కూడా సరిపోలేదు.
కానీ మొత్తం మీద ఒక వీరరసం నింపుకుని ఉన్నది మీ పద్యం ..

జాన్‌హైడ్ కనుమూరి said...

కొత్తపాళీ గారికి
మీ స్పందనకు నెనరులు

చిన్నవివరణలు
1. అచ్చుతప్పులను సరిచేస్తాను - (తెలుగు టైపింగు పూర్తిస్తాయిలో వంటబట్టలేదు)
2. నిజానికి ఈ కవిత సద్దాం ఉరి తీర్పు వెలువడిన వేంటనే రాసినది. బోనులోవుండి అతను చూసిన తీక్షణ చూపు నన్ను ఈ పద్యం/కవిత రాసేటట్టు చేసింది. ఆంధ్రప్రభ అదివారం అనుబంధంలో 3.12.2006న వచ్చింది. అప్పటికి సద్దాం ఉరి అమలుకాలేదు.