Friday, December 28, 2007

ఒక్కో సంఘటన ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో?


ఒక్కో సంఘటన ఎంత అగాధాన్ని సృష్టిస్తుందో?
నిన్న ఇంటికిచేరేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది. పిల్లలు విద్యాపోరాటాల్లోచి ఇంకా గూటికి చేరలేదు. నా శ్రీమతికి బాగోలేదంటే కొంచెం టీ వేడిచేసి నా ఆవిడకిచ్చి, ఏదైనా కూరచేద్దామని ఉల్లిపాయలు కోస్తున్నా. అలవాటులేకపోవటంవల్ల కళ్ళవెంబడి నీళ్ళు (ఏడుస్తున్నట్టు) కారుతున్నాయి. నా ఆవిడ టి.వి. పెట్టి ఛానల్సు మారుస్తుంది. ఏదో న్యూస్ చానల్ వద్ద నా దృష్టి పడింది ఆపమని అరిచాను. ఆశ్చర్యం, నోటమాట రాలేదు. నేను కళ్ళు తుడుచుకోవడం నా ఆవిడచూసి వార్తచూసి ఏడుస్తున్నా అనుకుంది.
"అది బేనజీర్ భుట్టో మరణవార్త"

---
బరువెక్కిన మనస్సుతో చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎప్పటిదో (బహుశ 1982లొ జరిగిందనుకుంట) సంఘటన జ్ఞాపక మొచ్చింది.

నా పెద్దవదిన నేను ఒకే వయస్సువాళ్ళం కావటంవల్ల 6 వ తరగతినుండీ స్నేహితుల్లా వుండే వాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే వుండే వాళ్ళం. ఉద్యోగవేటలో జబల్పూర్ వద్ద పనిచేస్తున్నప్పుడు అన్నయ్య, వదిన ముగ్గురు పిల్లలు నేను కలిసి వుండే వాళ్లము. చాలా స్నేహితుల్లాగే వుండే వాళ్ళము.
అప్పుడె ఒకానొక సంఘటాన జరిగింది. నాపై లేనిపోని అపవాదుతో దుష్ ప్రచారము జరిగింది. అవతలివారి పక్షాన నా వదిన మాట్లాడటంతో అప్పుటి వరకూ స్నేహగావున్న మా అనుబధం ఒక్కసారిగా తెగిపోయింది. మా మద్య అగాధం ఏర్పడింది. సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఆ అగాధం మరింత పెరిగిపోయింది. ఈ సంఘటన దాదాపు మరిచిపోయినా, దుష్ ప్రచారాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోయినా ఆ సంఘటన చేసిన అగాధం గాయంగా మిగిలిపోయింది.
చిన్న సంఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయాయి మంచిస్నేహితురాల్ని పోగొట్టుకున్నాను. అప్పుడప్పుదూ ఎదురుపడుతున్నా ఏదో వెలితివెలితిగానే సంభాషణ సాగిపోతున్నయి.

చిన్న సంఘటనే జీవితంలో ఇంతప్రభావాన్ని చూపితే "భీభత్స మరణాల" సంఘటనలు దేశనికి, పొరుగు దేశాలకు, ప్రపంచానికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో కదా???

No comments: