Wednesday, December 26, 2007

బాల్యపుగుర్తులు



జీవితం యాంత్రికమయిన సందర్భం
ఈ దసరా కొత్తశోభనేమీ తెలేదు
కానీ
మాయింటికి ఓ చిన్నారి బొద్దుబొద్దుగా ముద్దుముద్దుగా వచ్చి
గంతులువేసి ఆటలు ఆడి పాటలుపాడి
తనకు స్కూలు తెరుస్తారంటూ బస్సెక్కి వెళ్ళిపోయింది
చాలా కాలంతర్వాత చిక్కిన సెలవుదినాన్ని
నచ్చిన కథ చదువుతూ చదువుతూ నిదురలోకి జారిపోయా
ఆ పసితనం అల్లిన నవ్వుల మాలలు
గుమ్మానికి తోరణాలుగా వాడిపోకుండా వ్రేళ్ళాడుతూనేవున్నాయి
మెలకువచ్చిన సాయంత్రం
కిటికీలోంచి తొంగిచూస్తున్న చందురుడు కొత్తగా అనిపిస్తున్నాడు
మావయ్యా అంటూ మెడనుచుట్టేసి
పోతూ పోతూ
బల్యాన్ని లాకొచ్చి బాల్కనీకి వున్న కొక్కానికి తగిలించి పోయింది.
ఇక జ్ఞాపకాలు
శరత్ కాలపు వెన్నెల్లో బాల్యాన్ని వెతకడానికి పరుగులు
రెండవ తరగతినుండి ఐదో తరగతి వరకూ
ప్రతీ సంవత్సరం
"అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లలకుచాలు పప్పు బెల్లాలు" అని
గొంతెత్తి పాడిన లేలేత గొంతులు
ఒక్కసారిగా చెవుల్లో మోగుతున్నాయి
సుబ్బారావు కట్టిన ఆంజనేయుడి వేషం
బడి గంటకొట్టే వీరయ్యవేసిన పులివేషం
బాషా పాడిన తత్వాలు
కళ్ళముందు కదలాడుతున్నాయి
ఊరిమద్య వేసిన చలువ పందిళ్ళలో
రాగాలుతీస్తూ శరత్ రాత్రులను
పద్యాలుచేస్తున్న నాటకోత్సవాలు
మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడుగా
కన్రెప్పలపై తారాడుతున్నారు
ఆ పిల్ల ఒక్కసారి నవ్వందుకుంటే
ఆరున్నర శృతికోసం
హార్మోనియంపై వేళ్ళాడిస్తున్న
డేవిడ్ మాష్టారిగొంతు గణగణ మోగుతున్నట్టేవుంది
ఏ కటాక్ష వీక్షణమోగానీ
ముద్దులొలికే బాల్యపుగుర్తులు ముంగిటపోసిన ముద్దుగుమ్మకు
ఏమివ్వాలి?
ఓ ముద్దు తప్ప ఈ పద్యం తప్ప
------------------------------------------------
(దశరా శెలవులకు వచ్చి నవ్వులతోరణం కట్టిన బ్లెస్సీకి ప్రేమతో )