Monday, August 6, 2007

ఈ మద్య నేను చదివిన కవిత " కొయ్యకాలు "



ఏ వో పుస్తకాలు సదురుతుంటే "మువ్వలచేతికర్ర" చేతికొచ్చింది. అటూ ఇటూ తిరగేస్తుంటే "కొయ్యకాలు" కళ్ళముందు నిలిచింది. ఒక్కసారి చదివాను అంతే, కొయ్యకాలును బిగించిన అక్షరాల మద్య నా మనసు బిగుసుకుపోయింది. చదివిన ప్రతీసారీ ఎదో కొత్తరూపంతోనో, ఆలోచనతోనో కనిపించింది. 1987 జూలైలో వచ్చిన సంకలనం 2007 జూలై 30వతేదీన చదవటం యాదృశ్చికమే. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కొత్త పరిమళం, కొత్త చూపు దానిలో నన్ను తాకాయి. కొయ్యకాలు కలిగిన వ్యక్తిలోకి కవి పరకాయ ప్రవేశంచేసి కెమేరా కళ్ళతో తీసిన వర్ణ చిత్రమిది.
నేను అర్థంచేసుకున్న కొయ్యకాలు :

రోజూ అవే అంకెలమీద
తిరిగిన అంకెలమీదే
తిరుగుతున్న గడియారం ముల్లులా..
ఇలా ప్రారంభమైన వాక్యాలు నేటి ప్రస్తుత జీవితాన్ని ప్రతిబింభిస్తున్నాయి. జనరద్దీలో యాత్రికంగా మారిపోయిన జీవితాలు టక్.. టక్.. మని నడిచే కొయ్యకాలుగానే మారిపోతున్నాయి.
ఈ కొయ్య దేనికి ప్రతీక? జీవం కలిగిన చెట్టునుండి వేరు చేయబడిన, చేవ సత్తువ కలిగిన పదార్థం, నాలుగు కాలాలు వుంటుంది. కాని ఏ స్థిలో వుంచితే అదే స్థితిలో. దాని చివరి పర్యవసానం శిథిలమే. గడియారం ముల్లులమద్య తిరుగుతూ శిథిలమౌతున్న మానవీయ విలువలవల్ల జీవనం కొయ్యగా చలించే జీవంలేని పదర్థంగా మారిపోతుంది.
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.


మనిషి వ్యాపారంలో వస్తువుగా మార్చబడకమునుపే, అనుబండాలను, మానవీయ విలువలను పోగొట్టుకున్నాడు. చెట్టు జీవంపోగొట్టుకొని పచ్చదనం కోల్పోయినప్పుడే కొయ్యగా రూపాతరానికి దారితీస్తుంది. ఈ కొయ్యకాలులో ఏ దైనా జవజీవాలు మిగులుంటే తేమ తగిలినప్పుడు చిగురించడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి ప్రయత్నమేదైనా జరిగితే
నన్ను నేను
తలకిందులుగా
పాతుకుంటాను .... అంటాడు
యాంత్రికత మద్య కొయ్యమారుతున్న మనిషినే కొయ్యకాలుగా చూపిస్తున్నాడా అనిపిస్తుంది.
పత్రికల్లో
అందమైన కవిత్వం మద్య
తెల్లమచ్చల గురించి
నల్లవెంట్రుకల గురించి
నరాల బలహీనతలగురించి
అసహ్యమైన ప్రకటనల్లా

ఇక్కడ అప్పటి పత్రికల పరిస్థితి చూపుతున్నాడు, అంటే కకుండా అందమైన ప్రకటనల మద్య అసహ్యమైన ప్రకటనలు కూడా వుంటాయి, అవి కూడా ఏదో బలహీనతలపై దాడి చేసి మనిషిని లొగదీసుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాయని చెపుతున్నాడు.
ఒక్కోసారి మనతో సహజీవనం చేస్తున్నవాళ్ళకంటే మనంనిర్మించుకున్న ఆలోచనల కొయ్యకాలులే బాగుంటయనిపిస్తుంది.

కొయ్య తుపాకులకుగా మారడనికి దోహదంచేస్తున్న, ఖర్చయిపోతున్న దేశ చిత్రపటాన్ని మనముందు పెడ్తాడు। బహుశ జీవన స్రవంతిలో నడిచే కాళ్ళు పోగొట్టుకున్నవాళ్ళు కనీసం
కొయ్య కాలైనాలేనివాళ్ళ కోసం కొయ్యను ఉత్పత్తి చెయ్యమని
నా కొయ్యకాలును ప్రార్థిస్తాను।

కొయ్య కొత్త చిగురులుతొడిగి చెట్టుగా మారి

మళ్ళీ పచ్చదనంల్తో కొత్త కొమ్మలకోసం ఆశను వెలిగిస్తున్నాడు.

.... రుణం తీర్చుకుంటుంది

రుణం తీర్చుకోవడమనేది ఒక పరమార్థ పరాకాష్ట. రుణపడి వుండటంలో అనేకమైన అనుబంధ బాదవ్యాలు కలిగివుంటయి. అనేక అంశాలను స్పృసిస్తున్న ఈ కొయ్యకాలును ఈ నాటి కాల పరిణామాలను ముందుగానే దర్శించి రాసాడా ఈ కవి అనిపిస్తుంది.
కానీ కొన్ని నిర్వచనాత్మకమైన వాక్యాల అవసరం వుందేమో అనిపించింది
ఈ సందర్బం లో కొయ్య గుర్రం జ్ఞాపకమొచ్చింది
... కొయ్యగుర్రం కావ్యమైనప్పుడు కొయ్యకాలును అనకూడదా అనే సందేహం
.... కొయ్యగుర్రం, కొయ్యకాలులో "కొయ్య" రెండిటిలోనూవున్న పదమేనా? ప్రతీక కూడానా ?
... కొయ్యగుర్రం రాజకీయాంశం

కొయ్యకాలు మానవీయాంశం

.... కొయ్య హృదయాన్ని కలిగిన పాలకులను తట్టిలేపే యత్నం కొయ్యగుర్రానిదైతే
కొయ్యగా మారుతున్న ప్రతి హృదయాలను చిగురించాలనే ఆశ కొయ్యకాలుది.
రెండిటిలోనూ వున్నది వేదనేగా !

1 comment:

Anonymous said...

Mercy Suresh Jajjara

మనిషి వ్యాపారంలో వస్తువుగా మార్చబడకమునుపే, అనుబండాలను, మానవీయ విలువలను పోగొట్టుకున్నాడు. చెట్టు జీవంపోగొట్టుకొని పచ్చదనం కోల్పోయినప్పుడే కొయ్యగా రూపాతరానికి దారితీస్తుంది. ఈ కొయ్యకాలులో ఏ దైనా జవజీవాలు మిగులుంటే తేమ తగిలినప్పుడు చిగురించడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి ప్రయత్నమేదైనా జరిగితే
నన్ను నేను
తలకిందులుగా
పాతుకుంటాను .... అంటాడు...