Wednesday, July 4, 2007

మరో వనాన్ని స్వప్నిస్తాను

రోజంతా శ్రమించి
కొంత స్థలాన్ని చదునుచేసి
విత్తనాలు చల్లాను
మొలకలకోసం నిరీక్షిస్తున్నా
పొటమరిస్తున్న ఉనికిని
స్వాగతించడానికి!
స్నేహితుల్లారా!
మిమ్మల్ని పిలవాలనివుంది
మొలకలు వస్తూ వస్తూ
సమయ సంకేతాన్నిచ్చి రావుకదా!
వేచివుండాలి!
ఏ అర్థరాత్రో అపరాత్రో
వెన్నెల లేనప్పుడు
వజ్రపుతునకల్లా బయటపడ్తే
నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ
నిదుర కళ్ళతో జోగితే
మొలుచుకొచ్చిన రంగేదీ కనపడదు కదా!
పైగా ఎర్రబారిన కళ్ళను చూస్తే దిగులేస్తుంది
ఎదిగిన నారుమడుల్లోకలుపుతీయడానికి పిలుస్తాను
ఒక్కణ్ణే ఎంతసేపని పనిచేయను?
ఆకును చూసో తొడిమను చూసో
పువ్వులొచ్చే జాడల్ని కనిపెట్టొచ్చు
కాయలొచ్చే తీరుల్ని చెప్పొచ్చు
నిండు పూలవనంలోమీరు తిరుగాడుతూ
నేత్రాల్ని టప టపలాడిస్తుంటే
రేకల పరిమళాల్ని పీలిస్తూ
వనమాలిని మెచ్చుకుంటుంటే
చాటుగావిన్న మాటలైనా ఉత్తేజాన్నిస్తాయి
బీడు భూముల్లోమరో వనాన్ని స్వప్నిస్తాను
వనాల్ని స్వప్నించడం
వడగాల్పుల ఎండల్లోనైనా
నడుమొంచడం కొత్త కాదుకదా!
వేపపువ్వుల్లోనో
విప్పపువ్వుల్లోనో దాగిన తేనెను
వెదకి తెచ్చేపని మీకప్పచెపుతున్నా
వేరే పువ్వులేవీ లేవా అని విసుక్కోవద్దు
వాటి మాధుర్యమేదో
పదేపదే లాగిపెడ్తుంది
తొలిపొద్దులో రాలే మంచుబిందువుల్నిముద్దాడేందుకు
లేత అకుల్ని సిద్దంచేయాలి!
చదును చేయాల్సిన స్థలాలింకా మిగిలివున్నాయి సుమా!

http://poddu.net/?p=229

మే, 2007 తొలి ప్రచురణ

4 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

జాన్ గారు చాలా బాగుంది..ఏదొక లైను ను ఉదహరిద్దామని ఎంత ఆలోచించినా వీలుపడలేదు..ఆ నిండు పూలవనంలో తిరుగాడుతూ నేత్రాల్ని టప టపలాడిస్తూ, రేకల పరిమళాల్ని పీలిస్తూ
వనమాలిని మెచ్చుకోవాలని ఆశగానే ఉంది..

Anonymous said...

‎"తొలిపొద్దులో రాలే మంచుబిందువుల్ని
ముద్దాడేందుకు లేత అకుల్ని సిద్దంచేయాలి!" చాలా హృద్యంగా వచ్చింది జాన్ గారు...
మరో వనాన్ని స్వప్నించడం కవిత బావుంది....కాని ఎందుకో మీ మిగతా రచనల్లా లేదన్పించింది..కొంచెం ప్రొజాయిక్ గా ఉందనిపించింది.....సారి ఇలా రాస్తున్నందుకు....కానీ మొదటిసారి నిరాశపడ్డాను....అయితే అన్నీ ఒకేలా రాయలేం..
..మీ వాసుదేవ్

Anonymous said...

Kalluri Sailabala
తొలిపొద్దులో రాలే మంచుబిందువుల్ని
ముద్దాడేందుకు లేత అకుల్ని సిద్దంచేయాలి
super ga undi.

జాన్‌హైడ్ కనుమూరి said...

Thanks to
Jyothirmayi,
Vasudev,
Kalluri Sailabala