జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే.
అవి నేను అప్పుడప్పుడే కలంపట్టిన రోజులు. తెలుగుయూనివర్సిటీ ఎన్.టి.ఆర్. అడిటోరియంలో కవిసమ్మేళనం జరుగుతుంది.
వేదిక అధ్యక్షులుగా శ్రీమతి నాయని కృష్ణకుమారి, శ్రీ ఉత్పల సత్యనారయణ, శ్రీ కె. శివారెడ్డి, ఎస్.వి. సత్యనారాయణ, శ్రీ జ్వాలాముఖి ఇంకొందరు వేదికమీదున్నారు. చాలామంది ప్రముఖ కవులు, కవయత్రులు కవితలు చదివారు. నాకు చివరలో అవకాశం దొరికింది. అప్పటికే కవిత్వం చదినవారు ఏవేవో సాకులతో వెళ్ళిపోవడంతో సభ పల్చబడింది, ముగింపుకొచ్చేసరికి నా కవిత్వానికి ఎవరు స్పందించలేదే అనే దిగులు నన్ను కమ్మింది. వరండాలోకి వచ్చాక అటుగా వస్తున్న ఆయన దగ్గరకు పిలిచి భుజంమీద చెయ్యివేసి పోయం బాగుంది. కొత్తగా రాస్తున్నట్టులేదు రాస్తూవుండు అని భుజం తట్టారు. ఆయనే శ్రీ జ్వాలాముఖి. అదే మొదటి పరిచయం. ఆ సంతోషాన్ని వివరించడానికి మాటలు లేవు నాదగ్గర.
నా కవిత్వంని ఆస్వాదించి నన్ను పరిచయం చేసుకున్నవారు బహు కొద్దిమంది అందులో ఈయన ప్రధముడు. తర్వాత చాలా సార్లు చాలా సభలలో కలిసాము. ఆయనలో నాకు ఒక అంశం నచ్చింది. అది ఏమిటంటే అనర్గళంగా మాట్లాడగలగడం. నేను చర్చిల్లో మాట్లాడే అవకాశలను ఇంత అనర్గళంగా మాట్లాడగలనా అని ఓ రోజు ప్రశ్నించుకున్నా. ఆ టెక్నిక్‌ను పట్టుకోవడానికి ఆయన సభలకు తప్పకుండా వెళ్ళే వాణ్ణి.
అయన కవిత్వంనుండి, వ్యాసాలనుండి, ఆయన జ్ఞాన సంపదనుండి ఏమీ పొదానో తెలియదు గాని, అర్గళంగా మాట్లాడం వెనుక వున్న కృషి, సాధన గమనించాను. చాలా కష్టమైన ప్రక్రియే అయినా సాధన చేసాను.
నేనెప్పుడన్నా ప్రసంగిచాల్సి వచ్చినప్పుడు జ్వాలముఖిని గొంతు ద్వారం దగ్గర వుంచుకుంటాను.
కవిత్వం ఏమిచ్చింది అనే ప్రశ్న తరచూ వినబడుతుంటుంది. నేను చెప్పగలను అనర్గళతవైపు నన్ను నేను మలచుకోవడానికి ఒక సాధనం(టూల్) దొరికిందని.
శ్రీ జ్వాలముఖిని తలచుకొనే ఈ రోజు చంద్రునికో నూలుపోగులా నా జ్ఞాపకం ఇలా మీ ముందు పరిచాను. ఆయన జీవన, జీవిత స్థితిగతులు ఎలా వున్నా ఒక సూచికగా నాకు నిలిచిన ఆయన మూర్తిమత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ఓదార్పు కలగాలని సదా ప్రార్థిస్తాను.
2 comments:
నేనెప్పుడన్నా ప్రసంగిచాల్సి వచ్చినప్పుడు జ్వాలముఖిని గొంతు ద్వారం దగ్గర వుంచుకుంటాను.Wonderful Dear John saab . Sreyobhilaashi ...Nutakki raghavendra Rao (Kanakambaram.)
Thank you
Nutakki gaaru
Post a Comment