ఈ ప్రశ్నే కదా నువ్వు నన్నడిగిందీ గుర్తుందిలే!
అదే కదా పదే పదే నే చెప్పిందీ గుర్తుందిలే!
సాయంత్రపు నీరెండలో జాజులను కోస్తూ
విసిరిన పాలనురగల నవ్వేదో గుర్తుందిలే!
ఎదురుపడాలని పెరటిలో తచ్చాడుతూ
మదిన వేసినవలపు మొవ్వేదో గుర్తుందిలే!
పరాకుగా నే నిదురించేవేళ అడుగులో అడుగేస్తూ
ఘల్లుమని సవ్వడి చేసిన కాలిమువ్వేదో గుర్తుందిలే
పులకరించిన పెనవేసి రెండూ దేహాలేకమౌతూ
మౌనంగా నలిగిన బిడియపుపువ్వేదో గుర్తుందిలే
నేనున్నానని సడిలేని అడుగులేస్తూ
బెదిరిబెదిరి అడుగుల సవ్వడేదో గుర్తుందిలే!
అనురాగం ప్రతిరూపమై లాలించి మురిపిస్తూ
కొసరికొసరి తినిపించిన పాలబువ్వేదో గుర్తుందిలే
నిర్దయగా చేజారిన క్షణములన్నీ లెక్కిస్తూ
హాయిగా ఎగిరిన ఆశల గువ్వేదో గుర్తుందిలే
(జీవిత తొలినాళ్ళ జ్ఞాపకాల నుంచి )
No comments:
Post a Comment