Monday, December 13, 2010

జ్వాలముఖి - నేను - కొన్ని జ్ఞాపకాలు


సమయం త్వరిత గతిన పరుగెడుతుందని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొంత స్పూర్తిని పొందిన నేను నిన్ననో, మొన్ననో ఆయనని కలిసాను అనిపిస్తుంది. ఆయన ప్రసంగించే తీరు, అనర్గళత  ఆయనకు సాహిత్యంపై వున్న పట్టును చెప్పకనే చెబుతుంది.   

2003 సంవత్సరం  కవిత్వాన్ని రాస్తూ, తారసపడ్డవారికి వినిపిస్తూ కవిత్వ లోతుపాతుల్ని తెలుకుంటున్న సమయం. హైదరాబాదు తెలుగు యూనివర్సిటీ, ఆడిటోరియంలో ఉగాది కవిసమ్మేళనం జరిగింది. అందులో పాల్గొనాలని, నా కవిత చదవాలనే ఉత్సాహంతో  అందరికంటే ముందుగా చేరాను. ఆ కార్యక్రమానికి నాయని కృష్ణ కుమారి గారు అధ్యక్షత వహించారు, ఉత్పల సత్యనరాయణ గారు ప్రత్యేక అథిదిగా వేదికనలంకరించారు.

వేదికనలంకరించిన వారిలో జ్వాలాముఖి ఒకరు.    అవకాశం కల్పించాలని సభ నిర్వహిస్తున్నవారిని ముందుగానే పలుమార్లు కోరినప్పటికి ప్రముఖు   సభ ఆలస్యంగా ప్రారంభమై, ఎవరికి వారు పనివుందంటూ తమకవిత్వాన్ని చదివి వెళ్ళిపోతున్నారు.  జ్వాలాముఖి ముందస్తు ఎన్నికలపై కవిత చదివారు. చివరిగా కృష్ణకుమారి గారి విశ్లేషణ  పూర్తయ్యింది. ఎంతకీ అవకాశం రాకపోయేసరికి కొంచెం అసహనాన్ని సభికులమద్య  ప్రదర్శించే సరికి, ఎవరో కొద్దిగా చొరవతీసుకొని ముగ్గురికి సమయాన్ని ఇచ్చే ఏర్పాటు చేసారు. మొదటిసారి ఇలాంటి అవకాశం రావటం. భయం భయంగా, బెరుకు బెరుకుగానే "వసంతమా ఎప్పుడొచ్చావు నీవు" అనే కవిత చదివాను. ఎవరు ఎలా స్పందించారో కూడా తెలియలేదు. బయటకి వస్తున్నప్పుడు దగ్గరకు పిలిచి కొత్తగా రాస్తున్నట్లే లేదు. రాస్తూవుందు. బాగుంది కవిత అని భుజంపై చెయ్యివేసి మరీ అభినందించారు జ్వాలాముఖి. ఆ అభినందన నాకు చాలా స్పూర్తి నిచ్చింది.

తరువాత 2004లో విజయవాడలో, ఎక్స్ రే వారి ఆద్వర్యంలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. అప్పుడు కొంతమంది సీనియర్ కవులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కలిగింది. అందులో జ్వాలాముఖి ఒకరు.  కార్యక్రమం చివరలో నాకు ఇచ్చిన జ్ఞాపిక అనుకోకుండా ఆయన చేతులమీదుగానే తీసుకోవడం జరిగింది. అప్పుడే నేను రాసిన "హసీనా" దీర్ఘ కవితకు పరిచయ వాక్యాలు రాయమని వారిని కోరను. కొన్ని నెలలు గడిచినా ఆయన ఎందుకో రాయలేదు. చివరికి ఆయన మాటలు లేకుండానే ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఆయనతో నాలుగు మాటలు రాయించుకోవడం కోసమైనా కొంత రాయాలనిపించేది. ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది.  

ఆ తర్వాత చాలా సభల్లో కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా పలకరించేవారు నన్ను. ఆయన ప్రసంగించే తీరు నన్ను ప్రతిసారీ అబ్బురపరచేది.    క్రైస్తవ సమావేశాలలో నాకు మాట్లాడే అవకాశం కలిగినప్పుడు   ఆయన శైలి అనుకరించే ప్రయత్నం చేసాను. ఆ శైలి నన్ను ఇప్పటికీ ఉత్తేజపరుస్తూనే వుంటుంది.

నెలనెలా వెన్నెల (హైదరబాదు)లో ఆయన మగ్దూం గురించి పంచుకున్న విషయాలు సాహిత్యంపై నన్ను మరింత ఆశక్తిని కలిగే టట్లు చేసింది.

ఒకరోజు హైదరాబాదు సెంట్రల్ లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణ జరుగుతుంది. నేను కూర్చున్న వెనుకనే ఆయన కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత సాహిత్యప్రస్థానం  చేతికిచ్చి చూసావా అని అడిగారు. ఎందుకు అలా అన్నారా అని అనుకుంటూనే పేజీలు తిరగేస్తుంటే అయనే .. కవిత బాగుంది అన్నారు. ఆ సంచికలో నా కవిత వుండటమే కాకుండా ఆయన వ్యాసం తర్వాత వుండటం విశేషం. ఇప్పటికీ నమ్మలేనిదే అనిపిస్తుంది.

(డిశెంబరు 14న ఆయన వర్థంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు   )

1 comment:

mosaic a garden of ideas said...

jwaala mukhi naku o theeyani jnapakam! maa naannagaru poyina thedine aayana povadam anukoni vichitram. anakapallelo vijaya residency lo bhojanam chestunnappudu aayanaku polamaari gonthu pattesi napuudu chudali naa bhayam! malli aayana mamuluga matadeka santha baddanu. urdu ghazals paatha hindi paatalu ennenni chepparo! adi oka madhura smrithi! we all miss him!thanks aayana gurchi jnapakalu panchukunnanduku!