అనుకోకుండా ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా మావూరుకు వెళ్ళడం జరిగింది. నిజానికి 16.5.2010 ఆదివారము ఒక వివాహ కార్యక్రమానికి అథిదిగా పిలవబడ్డాను. శనివారము రాత్రి బయలుదేరటం ఆలస్యము, నగర ట్రాఫిక్‌తో గాంధీ బస్సుస్టేషనునుంచి నేను అందుకోవాలనుకున్న బస్సు వెళ్ళిపోయింది.దీకి వెళితే సుమారు 6-7 గంటలమద్య అశ్వారావుపేట చేరుకుంటే అక్కడనుండి ఎవరైనా నన్ను పెళ్ళి జరిగే చోటికి తీసుకొని వెళతారని ప్రణాలిక. బస్సు దాటిపోవడంతో నా ప్రయా అంచలంచలుగా మారింది. ఖమ్మం వరకు ఒక బస్సు, ఖమ్మంనుంచి సత్తుపల్లి వరకు ఒక బస్సు, సత్తుపల్లినుంచి అశ్వారావుపేట వర్కు ఇంకో బస్సు మారి 8.30 గంటలకు చేరాను. అక్కడనుండి మోటరు బైక్‌పై ఓ గ్రామానికి ప్రయాణం. ఓ ఐదు కిలోమీటర్ల వర్కు రోడ్డు బాగానే వున్నా ఆలస్యమయ్యిందని అనుకున్నా.వివాహ కార్యక్రమము త్వరగా ముగించుకొని ఆ సాయత్రం జంగారెడ్డిగూడెంనుండి పోలవరం వెళ్ళాను.
ఉదయమే కెమేరా చేతపట్టుకొని కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ పాండురంగడి కొండకు వెళ్ళాను. కొద్ది దూరం ఎక్కేసరికి వయసు సహరించనని మారం చేసింది. అందుకే సగం నుంచే వచ్చేసాను.
నేను బాలయంలో చదివిన మూడు పాఠశాలలను కెమేరాలో బంధిద్దామని చిన్న అలోచన కలిగింది. నేను 3, 5వ తరగతులు చదివిన ఎలిమెంటరీ పాఠశాల పూర్తి రూపాన్ని మార్చుకుంది.
అప్పుడు పెంకులతో వుండేది ఇప్పుడు కొత్త భవనము, కొత్త పథకాల పేరు.
7వ తరగతి చదివిన అప్పర్‌ప్రైమరీ పాఠశాల తన స్థానాన్ని మార్చుకుంది. పాత భవనాల నామరూపలే లెవక్కడ. గోదావరి వరదల్లో కొట్టుకపోయిందో లేక మరేదైనా పరిస్థితులో అక్కడ ఇప్పుడు సగం అరటితోట వెలసింది.
పాఠశాలకు వెళ్ళే మలుపులో ఓ పెద్ద బావి వుండేది. బ్రాహ్మల బావి అనేవారు అక్కడ ఇప్పుడు బావి తాలూకు ఆనవాళ్ళే లేవు.(వూరులోని చాలా బావులు లేవు, బావులగురించి తర్వాత వీలుబట్టి మరో టపా రాస్తాను)
8వ తరగతి చదివిన జూనియర్ కాలేజీ ప్రాంగణానికి వెళ్ళాను. ఆ పాఠశాల 1912లో స్థాపించబడినట్లు గుర్తు.
పాత భవనాలు చాలావరకు లేవు. ప్రస్తుతం శెలవలు కావడంతో అన్నీ తాళాలు దర్శనమిచ్చాయి.
నేను 8వ తరగతి చదివిన భవనం అలానేవుంది. మా తరగతి ఎదురుగావుండే బావి మాత్రం లేదు. ఆబావి దగ్గర ఎన్నో జ్ఞాపకాలు. ఇంటర్వెల్ సమయంలో అమ్మాయిలకు చేదిపోసిన నీళ్ళు, చలోక్తులు జ్ఞాపకాల్లోకి జారిపోయినట్టే బావికూడా ఒక జ్ఞాపకంగా మిగిలింది.
సుమారు ఎనిమిదింటికి ఇంటికి చేరిన, మళ్ళీ ఊరిలోని, గోదావరి తీరంలోని జ్ఞాపకాలను కొన్ని పొటోలు తీద్దామనుకున్నా కాని ఎండవేడిమి ఎక్కువగా వుండటం వల్ల ఎక్కడకీ వెళ్ళలేకపోయాను.
సాయత్రం ఆరుగంటలకు హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. నేను ఎక్కిన తర్వాత స్టాపులో ఒక అతను ఎక్కాడు. కొద్ది సేపయ్యాక నన్ను పలకరించాడు. నాపేరు, నావివరాలు అన్నీ చెబుతుంటే కొంచెం ఆశ్చర్యమే అనిపించింది. మెల్లగా చెప్పాడు 8వ తరగతిలో నా క్లాస్ మేట్ అని. నిజానికి నాకు మొదట గ్ర్తురాలేదు. మా తరగతి(1972-73)లోని ఇతర క్లాస్ మేట్స్‌ను గుర్తుకుచేసుకున్నాము. నిజానికి నేను 9వ తరగతినుండి ఆ వూరు వదిలివేయడంతో చాలా మంది గుర్తులేరు. కానీ ఆ సమయంలో సుమారుగా 60 నుంది 80 వరకు మా క్లాస్ మేట్స్, సీనియర్స్‌ను, టిచర్స్ను గుర్తుకు చేసుకున్నాము. అదే సంవత్సరంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం, అది మాజీవితాలపై చేసిన ప్రభావం, ముక్యంగా ఆరోజుల్లో లెక్కల్లో - కాంపోజిట్ లెక్కలు ప్రత్యేకంగా వుండటంతో తొమ్మిదవతరగతిలో పడ్డ పాట్లు గుర్తుకొచ్చాయి.
ఆనాటి నా ఫోటో
నాకు ఈ విషయాలను బ్లాగులో పంచుకోవలని ఎందుకనిపించిందంటే - 36 సంవత్సరాలతర్వాత కలిసిన ఒక బాల్య స్నేహితుడు, ప్రయాణపు తొందరలో కూడా గుర్తుపట్టడం.
జ్ఞాపకాన్ని పదిల పరచిన బాల్యానికి - కోటి దండాలు
మిత్రుడి శేషావతారం కి శతకోటి దండాలు
6 comments:
పాత మిత్రుడు కలవడం...ఇన్నేళ్ళ తర్వాత...ఒక అద్భుతం. మన బడి, మన ఊరు ఎప్పుడూ మనకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతాయి.
మీ పోస్టు బాగుంది.
రాము
apmediakaburlu.blogspot.com
ఈ టపా చదివి ఎవరన్నా పాత మిత్రులు మళ్లా కలిస్తే ఎలా వుంటుంది?
రాము గారు
నిజమే పాతమిత్రుల కలయిక అద్భుతమే
మన బడి, మనవూరు వెన్నంటె వుంటాయి
మీ స్పందనకు నెనరులు
రావు గారు
ఈ టపా చదివి ఎవరైనా పాతమిత్రులు కలిస్తే నా సంతోషం పట్టజాలనిదే.
ఇప్పటికే ఈ టపాతో పాటు ఒక కవిత కూడా రాసాను, కాని మిత్రుదు విని పత్రికకు పంపమంటేనూ బ్లాగులో పెట్టలేదు ఇంకా.
ఇంకెవరైనా కలిస్తే ఓ నవల రాస్తానేమో!
మీ స్పందనకు నెనరులు
baagundi............
Post a Comment