Wednesday, January 13, 2010
రాధిక ఊరునుంచి మా ఊరికి ప్రయాణం
ఊరు ఒక కమ్మని జ్ఞాపకం. ఆజ్ఞాపకాన్ని నెమరువేస్తున్నప్పుడు కలిగే భావలపరంపర ఎవరి అనుభవాలకు అణుగుణంగా వుంటాయి. నా బాల్యంలో వూరును జ్ఞాపకానికి తెచ్చుకొన్నప్పుడు గోదావరి రేవులు, చింతతోపులు, సీమసింతకాయలు, కుంకుడుచెట్టుపై దెయ్యాలుంటాయనే పుకార్లు, అప్పుడప్పుడూ నేనున్నానని పలుకరించే కాలువ, వీదులలో వీరన్న వెలిగించిన కిరసనాయిలు దీపం, వెన్నెల్లో ఆడే అనేక రకాల ఆటలు, వరికోతలకు వలసవచ్చే కూలీలు, వారి వెంట వచ్చే జానపద ప్రదర్శనాకారులు, రాత్రంతా సాగిన పద్యాలు, పాటలు, నృత్యాలు. సుబ్రహ్మణ్య సశ్టి వుత్సవాలు, హనుమ జయంతి వుత్సవాలు, శరన్నవరాత్రి వుత్సవాలు.
సంవత్సారనికోసారి జరిగే కోడి పందాలకు మేపుతున్న కోడిపుంజులు.
ఉదయ సాయంత్రాలలొ దేవాలయాలనుంచి వినిపించే నాద స్వరం.
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ అంటూ రాత్రి వేళలలో, క్రీస్తునేడు లేచెను అంటూ ఉషోదయంలో కొవ్వొత్తులవెలుగులతో వీదులలో పాడిన పాటలు
ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వున్నాయి.
అందుకే ఈ కవిత చదిన తర్వాత నన్ను వెంటాడుతూనే వుంది. అందుకే ఈ నాలుగు మాటలు.
నా ఊరు
నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది
తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది
గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి
జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది
తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు
--0--
ఈ కవిత చదివాక నన్ను వెంటాడం మొదలు పెట్టింది. బహుశ నా బాల్యానికి ఊరుతో అనుబంధం వుండటం, నేను కవిత్వం రాయటం మొదలు పెట్టినప్పుడు "మా వూరు" అని కవిత రాయటం కారణం కావచ్చు.
ఊరు ఒక అనుబంధం, ఊరు ఒక జీవితం, ఊరు ఒక జీవనం, ఊరు ఒక సంస్కృతి.
సమయ సమయాలలో కవులు, రచయతలు, రచయిత్రులు "ఊరు"ను అక్షరాలలొ చిత్రించారు. ఊరితో తమకున్న అనుబంధాన్ని సాహిత్యానికి ముడివేసారు.
వారినందరిని గుర్తుచేయడం నా ఉద్దేశం కాదు కానీ, అలాంటి కోవలోకి చేర్చదగ్గ ఒక కవిత అని చెప్పడం అతిసయోక్తి కాదు.
ఊహ తెలిసినప్పటినుంచి జీవన పరిణామాల్లో మార్పుతో ఊరును వదిలి పట్టణానికో, ప్రవాసానికో వలస వెళ్ళినప్పటి వరకూ ఏర్పడిన అనుబంధం, కొంతకాలం గడిచితర్వాత తిరిగి ఊరిలో అడుగుపెట్టినప్పుడు మనసులో ముసిరిన ఆలోచనలు, రేకెత్తిన అనుబందపు దారాలు, ఒక్కుమ్మడిగా చుట్టు ముట్టినప్పుడు పడిన ఓ సంక్లిష్ట సమయానుభూతి ఈ కవిత.
కవితలో చిన్ని చిన్ని పదాలు, చిన్నిచిన్ని ప్రతీకలు. ఆ ప్రతీకలను తన జీవనశైలితొనో, సాంస్కృతిక నేపథ్యంతోనో కలిగివున్న జీవన వైచిత్రిని గుర్తుచేస్తుంటాయి. ఆ అనుబందాన్ని కలిగిన వారికి జ్ఞాపకాలు కళ్ళముందు కదలాడుతున్నట్టే వుంటాయి.
కవిత ఎత్తుగడలో
"నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది"
సహజంగా ఆకు తన దశలు మార్చుకొని పండిన తర్వాత రాలిపోతుంది. అయితే ఇక్కడ రావిచెట్టు తను వెళ్ళిందనే బాధతో ఆకురాల్చేసింది. పచ్చని ఆకు రాలటం జీవప్రమాణానికి వ్యతిరేకం. అది తన అనుబందాన్నో, స్నేహాన్నో పోగొట్టుకొన్న లేదా విడిపోయిన బాంధవ్యం తాలూకూ బాధ పచ్చదనాన్ని హరింపచేస్తుందనే ధ్వని గాఢతను కలుగజేస్తుంది.
"శిథిల సాక్షం" వెనుక తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాలు, తనకోసం ఎదురుచూపు, తనకు తెలియకుండానే కనుమరుగైన ఆత్మీయతలను గురించిన సమాచారం ఏమీ తన దగ్గర దాచుకొలేని, మిగిల్చుకోలేని తనాన్ని అనిచెప్పడం బాగుంది. బహుశ ఇది రాధిక కవిత్వ పరణతికి నిదర్శనం అనొచ్చు.
ముగిస్తూ ముగిస్తూ తిరిగి వెళ్ళలేకపోతేనే తన వూరు జ్ఞాపకాలలో పదిలంగా, సజీవంగా ఉండేదనటంలో తను పొందిన అంతఃర్మధనం కనపడుతుంది.
"ఇది నా సొంతవూరు" అని చెప్పుకొలేనివారు, సొంతవూరికి తిరిగి వెళ్ళలేనివారూ వలసలుపోతున్న జీవితాలు పడే బాధ అంతఃర్గతంగా కనిపిస్తుంది.
ఊరికి ఏది సొంతం, ఏది శాశ్వతం అనే ప్రశ్న వుదయిస్తుంది.
యాదృశ్చికంగాను, తన అనుభూతిపరంగానో రాసినవి ప్రతీకలుగా బలాన్ని సంతరించుకున్నాయి.
ఊరి మద్య రావి చెట్టు, రచ్చబండ, గుడిమెట్టు, చెరువుగట్టు, జామచెట్టుకు కట్టిన ఊయల, కాలం తీరి వెళ్లిపోయిన వారు, చరిత్ర ... ఇలా వాడిన పదాలు కేవలం తన మనసులోని అవేదనానుభూతి చెప్పడానికే అయినా వాటి తాలుకు జ్ఞాపకాలు, గుర్తులు, అనుబందాలు ఊరితో అనుబంధంవున్న ప్రతివొక్కరికి కలిగివుంటాయి. అవి పాఠకులను తమజ్ఞాపకాల అంతఃపొరలలోకి లాక్కుపోతాయి.
"చెట్టు జ్ఞానానికి ప్రతీక" అని ఓ ప్రసిద్ద కవి శ్రీ ఇస్మాయిల్ అంటాడు. రావిచెట్టు చాలాకాలం జీవించడం అనేది దాని జీవలక్షణం. జీవించివున్నప్పుడు ఆకులతో పచ్చగావుండాలి కదా! అప్పుడే నలుగురికి నీడని ఇవ్వగలుగుతుంది, పక్షులకు ఆవాసమౌతుంది. అలాంటి జీవ లక్షణాలు కోల్పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తుంది.
రచ్చబండ : నలుగురు ఒక్కచోటచేరి కష్టసుఖాలను, వివాదాలను కలబోసుకున్న ఓ చెట్టునీడ.
రచ్చబండ పెత్తందారీ తనానికి ప్రతీక. రచ్చబండ దగ్గర జరిగే చర్యలు, నిర్ణయాలు ఎక్కువగా అణిచివేతలే, అధికార దురంహంకారమే.
(రచ్చబండను గురించిన చర్చవైపు వెళ్ళడం నావుద్దేశం కాదు) ఈ కోణంలో చూసినప్పుడు ఆ వ్యవస్థీకృతమైన పెత్తందారీ పద్దతి కి బీటలు వారటం శుభసంకేతమే.
గుడి మెట్లపై కొద్దిసేపు కూర్చోవడంలో అవ్యక్తానుభూతమైన భక్తి ప్రవృత్తి కనిపిస్తుంది.
"పల్లె కన్నీరు పెడుతుందో"అవి గోరిటి వెంకన్న రాసిన పాట ఊరిలో తరిగిపోతున్న వాటి వైనాలిని గుర్తుచేస్తాయి.
ఇక బాల్యం దాని గుర్తులు ఎవరికి వరికే వూరుతో ముడివేసుకునే అనుబంధం.
వీటన్నిటిని కలగలిపి ఒక్కచోట చేర్చి స్మృతి పథంలో మెదలడానికి తన ప్రమేయం లేకుండనే జరిగిన ప్రక్రియ ఈ కవిత అక్షర రూపం.
ఈ సందర్భంలో నేను గతంలో రాసిన "మావూరు"ను ఇక్కడ వుంచుతున్నాను
మా వూరు
ఒకప్పటి మా వూరు
గలగల పారే సెలయేరు
కనుచూపుమేర పచ్చనైన పైరు
గోధూళి వేళ సందడిచేసే కుర్రకారు
కల్మషంలేని మనుషులతీరు
రామాలయంలో రాగాలజోరు
గుంపులుగా సాగే కొంగలబారు
గిత్తలమెడలో గంటలహోరు
లేదూడల గంతుల హుషారు
జాతి కోడిపుంజుల పోరు
వర్తకానికి వారం వారం బజారు
వాకిట్లో రంగవల్లిలల్లినతీరు
పెరట్లో ముద్దబంతి విరిసిన తీరు
నేడు...
తలచినంతనే మావూరు
మదిలో తెలియని బేజారు
ఎక్కడికక్కడ ఓ మాయా బజారు
...........
చివరిగా :
రాధిక కవిత్వం ఇప్పటివరకూ ఏదోరకమైన ప్రేమ భావనలు, అనుభూతి, ఆహ్లాదం కంపిస్తుండేవి
వాటినన్నిటిని ఊరు ఒక దిశనుంచి మరో దిశవైపు మార్చివేసాయి.
ఇలాంటివి మరిన్ని రాయాలని మనసారా కోరుకుంటున్నను.
అభినందనలతో
జాన్ హైడ్ కనుమూరి
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నా మీద నాకు నమ్మకం తగ్గిపోతున్న ప్రతీసారీ మీ అక్షరాలతో నమ్మకాన్నిస్తారు.కొత్త శక్తినిస్తారు.ఎన్నిసార్లు మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే.రచ్చబండ గురించి మీరు చెప్పిన విషయం నిజమే.కానీ పెత్తందారీ వ్యవస్థ పోయి చాలా దశాబ్ధాలయింది.ఊర్లలోని రచ్చబండలు పిల్లలాడుకునే స్థలాలుగా,ముసలివాళ్ళు కష్ట సుఖాలు చెప్పుకోడానికి,లోకాభిరామాయణం చెప్పుకునే చోట్లగా మారిపోయాయి.వలసలు పోవడం వల్ల అక్కడ ఆడుకోడానికి పిల్లలు లేరు,అలాగే కష్ట సుఖాలు కలబోసుకోడానికి మనిషికి మనిషి తోడు లేడు.సంఘ జీవనం లేదు.అందుకే ఇక అవసరం లేదని రచ్చబండ బీటలేసిందని రాసుకున్నాను..గుడి మెట్టు,చెరువుగట్టు దగ్గరకొచ్చేసరికి అవి నాకోసం ఎందుకు ఎదురుచూస్తున్నాయంటే ఊరినిండా జనం తో కళకళలాడుతుంటే వైభవం గా వుండేది గుడే.కానీ ఇప్పుడు ఆ గుళ్ళో దీపం పెట్టడానికైనా ఆ మెట్టు తొక్కేవారు లేరు.అలాగే పాడిపంటలు పుస్కలం గా వుంటే చెరువు గట్టు నిండుగా వుంటుంది.అవి ఊర్లలో ఇప్పుడు తగ్గిపోయాయి కాబట్టి అక్కడా ఎవరూ లేరు,నా అడుగు కోసమే[ఎవరో ఒకరు వస్తే చాలు అన్నట్టుగా] చూస్తుంది అన్నట్టుగా రాసాను
ఊరుకేవలం భౌతికం,భౌగొళికం కాదన్న వాస్తవం ఎవరికీ అర్ధంకావటంలేదు.
రాధిక గారికి
నిజానికి ఈ టపా ఆలస్యమైయ్యింద్ని బాద పడ్డాను కానీ
"నా మీద నాకు నమ్మకం తగ్గిపోతున్న ప్రతీసారీ మీ అక్షరాలతో నమ్మకాన్నిస్తారు. కొత్త శక్తినిస్తారు" ఈ మాటలు నాకు కొత్త ఉత్సాహాన్ని నింపి ఆలస్యం వెనకున్న కారణాలను మరుగున పడేసాయి.
అందరికంటే ముందు స్పందించినందుకు ధన్యవాదాలు
మురళి గారికి
అవును వూరంటే భౌగోళికం కాదు
స్పందనకు నెనరులు
Post a Comment