నిన్న 28.4.2009 ఓ గొప్ప సాయంకాలం
-----------------
ఉదయమే ఒక పోను వచ్చింది. హలో అన్నవెంటనే గుర్తు పట్టాలేదు. అంతలోనే నేను శివారెడ్డిని అని అవతలై స్వరం. సాయంకాలం మిత్రు కలుస్తున్నారు నీవుకూడా వస్తే బాగుంటుంది కలిసి చాలకాలం అయ్యింది, అలగే ఎవరైనా మిత్రులుకు తెలియపర్చు అన్నారు. బషీర్‌బాగ్, ప్రెస్ క్లబ్ సాయత్రం 6 గటలకు. కొద్ది సేపు నన్నునేను నమ్మలేకపోయాను.
నగరంలో రకరకాల పరుగుల మద్య, ట్రాఫిక్ జాములమద్య సమయానికి చేరటం కొంచెం కష్టమే అయ్యింది. తీరా వెల్లేసరికి అది మిత్రుల కలయిక కాదు. శివారెడ్డి కొత్త పుస్తకం సభా కార్యక్త్రమం. ఘుడిపాటి, పెన్నా కలిసి శివారెడ్డి కవిత్వంలోచి స్త్రీ దృక్పద కవితల్ని ఏరి ఒక్కచోట చేర్చిన పుస్తకం. నేనువెళ్ళేసరికి వేణు మాట్లాడుతున్నారు. తర్వాత శివారెద్ది కొన్ని కవితల్ని చదివారు. అన్నీ నేను ఏదో ఒక సందర్బంలో చదివినవే అయినా ఆయన చదువుతున్నప్పుడు కొత్తవేమొ అంపించాయి.
కవిత్వ వినటం ఒక అద్బుత జ్ఞాపకమైతే వచ్చిన మిత్రులు మరీ ఎక్కువ ఆనందాన్ని నింపారు. వెన్నెల కుండపోతగా కురిసినట్టు, అందరూ సాహిత్య కారులే, కవులు కథకులు పత్రికలు. మరచిపోలేని జ్ఞాపకం.
శివారెడ్డి కవిత్వంలో ఆమె
- పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి
( శివారెడ్డి కవితా సంకలనం ‘ఆమె ఎవరైతే మాత్రం’ పుస్తకానికి ముందుమాట)
ప్రతి కవీ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక స్త్రీ గురించి కవిత రాసే ఉంటారు. శివారెడ్డి రాసినంత విస్తృతంగా స్త్రీ ఇతివృత్త కవితలు రాసిన తెలుగు కవి మరెవరూ లేరనే చెప్పాలి. శిశువుగా, బాలికగా, మగవాడి వంచనకు గురైన అభిమానవతిగా, ‘ప్రపంచానికి ముగుతాడేసి తన వెంట నడిపించుకుపోతున్న’ ధీరగా, తన ప్రాణాన్ని పంచుతూ పురిటినొప్పులు సహించే మాతృమూర్తిగా, జీవకారుణ్యాన్ని వర్షించే తల్లిగా, పురుషుడి అన్ని దాష్టీకాలను భరించే నిశ్శబ్దపు పసుపు ముద్దలాంటి మధ్యతరగతి గృహిణిగా, స్కూటీ గుర్రం మీద దౌడు తీసే నేటి తరం విద్యార్థినిగా, యువతిగా, ఉద్యోగినిగా స్త్రీ జీవితంలోని వివిధ దశలను, వివిధ పార్శ్వాలను అత్యంత స్పష్టంగా, గాఢంగా, ఆత్మీయంగా శివారెడ్డి పరామర్శించారు.
ఆమె ఎవరైతే ఏం
ఆ కన్నీళ్ళు నావే
ఆమె ఎవరైతేం
ఆ ఆవేదనా నాదే...
ఆమె ఎవరైతేం
ఆమె నా ఆలోచన
ఆమె ఎవరైతేం
నా లోపలి అద్దం మీద చెరగని ముద్ర
ఆమె ఆనవాళ్ళు
నా అక్షరాల్నిండా ప్రత్యక్షం
ఈ వాక్యాలు ‘నేత్రధనుస్సు’ (1978)లోని ‘ఆ కన్నీళ్ళు నావే’ అనే కవిత లోనివి. స్త్రీ పురుషుల మధ్య ఆవేగాత్మకమైన బంధాన్ని తెలిపే ‘నుదుటి మీద రెండు పెదవులు’ 1975 (‘చర్య’ కవితా సం పుటి) నాటిది కాగా, దాంపత్య జీవితంలో క్రమంగా ఏర్పడిన సంక్లిష్టతను తెలిపే ‘ముళ్ళు’ అనే కవిత 1978లో (‘నేత్రధనుస్సు’) రాసినది.
వీటిని గమనిస్తే సుమారుగా గత నాలుగు దశాబ్దాల ఆయన కవిత్వంలో ‘ఆమె’ ఒక ప్రధాన అంతఃస్రోతస్విని అని తెలుస్తుంది. ‘ఆ కన్నీళ్ళు నావే’ అనే కవితలోని ‘ఆమె ఎవరైతే ఏం’ అనే తొలి వాక్యమే ఆ తర్వాత అప్రయత్నంగా ‘ఆమె ఎవరైతే మాత్రం’ (1989) అనే శీర్షికగా పరిణమించిందని గుర్తించడం కష్టంకాదు. తల్లి లేని బాల్యం, తల్లిప్రేమ నెరుగని బాల్యం అనంతర జీవితాన్ని ప్రతి కూలంగా ప్రభావితం చేయటం లోకంలో సాధారణంగా కనిపిస్తుంటుంది. అలాంటి బాల్యం దుందుడుకుతనాన్ని పెంపొందించడమో, మనుషుల పట్ల, లోకం పట్ల ఒక పగను, ప్రతీకారేచ్ఛను ప్రేరేపించడమూ, చివరకు ఆత్మ విధ్వంసానికి దారితీయడమూ జరుగుతూ ఉంటుంది.
‘అయిదేళ్ళ ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న ఒక పల్లెటూరి బాలుడికి ప్రపంచం ఒక వేయితల నాగుపాము. జీవితం ఒక భయం, ఒక దరిద్రం, ఒక అనాదరణ... ఆనాథ బాల్యాలు కానీ ఆర్ద్రత లోపించిన పిలుపులు గానీ, ఏకాకితనాలు కానీ, ఆర్థం కాని సంబంధాలు కానీ అన్నీ... అన్నీ భయం భయంగా నాలో మిగిలి నా అంతర్లోకాలన్నింటినీ ముట్టించి ఊదరబెట్టి ఊపిరాడక అరిస్తే, అమ్మా! అంటే పలికే గొంతు లేనప్పుడు- బహుశా ఇవన్నీ నా కవిత్వంలో అదృశ్యంగా నర్తిస్తూ ఉంటాయేమో! (చూడు: ‘మనిషి బతుక్కి అర్థం సమూహంలోనే!’ - ‘జైత్రయాత్ర’ కవితా సంపుటి) అని శివారెడ్డి చెప్పుకున్నారు.
బాల్యంలోని కష్టనష్టాలకు కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషిం చుకొని, మనుషుల మనస్తత్వాన్ని, లోకాన్ని సానుకూల దృక్పథం తో పరిశీలించడమూ, తనకు దొరికిన ఏ కొద్ది ప్రేమనైనా అపురూపంగా స్వీకరించడమూ, తాను పొదలేకపోయిన ప్రేమను ఇతరులకు పంచడం ద్వారా ఆనందాన్ని అనుభవించడమూ, సాధన పూర్వక ఆచరణగా, ఆచరణాత్మక అభ్యాసంగా మార్చుకోవడం విశేషం. ప్రతి దానిని అనుమానిస్తూనే, విశ్లేషించుకుంటూనే (ప్రతికూల దృష్టిని అలవరచుకోకుండా) సానుకూల పార్శ్వాలకే ప్రాధా న్య మివ్వడం, సంలీనమవ్వడం సులభసాధ్యమేమీ కాదు. తల్లి ప్రేమ తెలియని, ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసుకొంటు న్న కుర్రాడికి విశాఖపట్టణమూ, విశ్వవిద్యాలయపు వీధులూ, తొలి యౌవనంలో హైదరాబాదు సంక్లిష్ట రాజకీయ, సాహిత్య వాతావరణం మలి యౌవనంలో ఎన్నో పాఠాలు నేర్పి ఉంటాయి.
అన్ని పాఠాలను, గుణపాఠాలను సానుకూల దృక్పథంతో స్వీకరించడం ఆయన వ్యక్తిగత, సాహిత్య, జీవిత పరిణామక్రమానికి మూల కారణంగా గ్రహించవచ్చు. ఈ దృక్పథమే, ఈ రకమైన జీవన విధానమే స్త్రీ పట్ల అపారమైన ఆయన ప్రేమకు ప్రధాన ప్రేరణగా ఊహించవచ్చు.అన్ని బంధాలను, అన్ని రకాల మానవ సంబంధాలను గతితార్కిక దృష్టితో పరిశీలిస్తూనే, ఆత్మీయతలకు, అనుబంధాలకు మూలమైన అవసరాలను, అన్ని దృక్పథాల పరిమితులనూ పరిగణనలోకి తీసుకోవడం, వాస్తవిక జీవన అనుభూతులకు ప్రాధాన్య మివ్వడం- ఈ కవి ఇతర కవితలలో వలెనే స్ర్తీ ఇతివృత్త కవితలలోను కనిపిస్తుంది.
ప్రతి వస్తువుకు, ప్రతి స్థితికి, ప్రతి ఉద్వేగానికి, ప్రతి సిద్ధాంతానికి ఉండే రెండు చివరలను ఈ కవి అర్థం చేసుకున్నారు. ప్రతిదానికీ ఉండే పరస్పర వ్యతిరేక పార్శ్వాలను ఏకకాలంలో దర్శిస్తూనే దేనిని ఎక్కడ, ఎంతవరకు అన్వయించుకోవాలో గ్రహించగలగడమూ, అన్ని చలన సూత్రాలనూ గమనిస్తూనే తక్షణ సన్నివేశాల లో, అనుభవాలలో తనను తాను మిళితం చేసుకోవడమూ, హుద య పూర్వకంగా, సంకల్ప సహితంగా అనుభవించగలగడమూ ఒక అంతర్ముఖ సాధన. అభిప్రాయాల పరంగా,దృష్టికోణాల పరంగా, సిద్ధాంతాల పరంగా వైరుద్ధ్యాలు లేకుండా కవితాత్మకం గా వ్యక్తీ కరించగలగడం బహిర్ముఖ అక్షర తపస్సు.
అనుభూతి నుంచి ఆలోచనకు, ఆలోచన నుంచి అనుభూతి వరకు సాగే నిరంతర కవిత్వ హేల ఇది. భుజం మీద అడ్డంగా గడకర్ర పట్టుకుని తాడు మీద నడుస్తున్న గారడీ పిల్ల శివారెడ్డి కవిత్వం. అనుభూతికి ఆలోచనకు మధ్యనున్న దృశ్యాదృశ్య విభజన రేఖే ఆ తాడు.
ఒక సన్నివేశాన్ని, సంఘటనను లేదా అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం ఒక పద్ధతి. కవిగా, బౌద్ధిక విశ్లేషణాపూర్వకంగా ఒక సన్నివేశాన్ని వర్ణించడం రెండో పద్ధతి. ఒక సన్నివేశ వర్ణనతో ఆరంభించి, ఆ సన్నివేశ నేపథ్యాన్ని విశ్లేషిస్తూ, తిరిగి నిర్దిష్ట సన్నివేశ ప్రస్తావనతో ముగించడం మూడవ పద్ధతి. ఈ మూడు పద్ధతులూ ఈ కవి ఇతర కవితలలోలాగానే ఈ స్త్రీ ఇతివృత్తి కవితలలోనూ కనిపిస్తాయి.
సగటు మగాడిలా ఎక్కడా స్త్రీని తప్పు పట్టకుండా, న్యూనపరచకుండా, ఆమె ప్రతి కదలికకూ, ప్రతి ఆలోచనకూ, ఆచరణకూ కారణాలను వ్యవస్థలో వెతుక్కుంటూ ‘ఆమె’ను అపార సానుభూతితో, ప్రేమతో, కరుణతో ఆశ్లేషించుకోవడం ఈ కవితలలోని ప్రత్యేకత.
ఒకరు మరొకరి మీద ఆధారపడడం ‘వ్యవస్థ’ కల్పించిన కుట్ర అని భావిస్తూనే, పురుషుడి అస్తిత్వం నిరంతరం ‘ఆమె’ మీద ఆధారపడిందనే భావాన్ని ‘ఆమె కలదు, నువ్వు లేవు’ అనే వాక్యాలలో వ్యక్తం చేశారు. ‘ఆమె కలదు, నువ్వు లేవు’ అనే మాట ఉద్వేగాత్మకంగా అనిపించవచ్చు. కాని వ్యక్తిగత జీవిత లక్ష్యాలను ఏదో ఒక మేరకు సాధించిన (తన వ్యక్తిగత జీవననేపథ్యాన్ని నిష్పాక్షికంగా వి శ్లేషించుకోగలిగిన) ఏ పురుషుడైనా ఈమాటలతో ఏకీభవిస్తాడు.
నిత్య చైతన్యం, నిత్య ఉత్సాహం, నిత్య సహనం, గూఢత్వం- ఇవేవీ ఎవరికీ పుట్టుకతోనో, వారసత్వంగానో సంక్రమించేవి కావు. కాని ప్రతి సగటు స్త్రీ వీటిని అభ్యసిస్తూనే ఆచరిస్తూ, ఆచరిస్తూనే అభ్యసిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తుంటుంది. వ్యవస్థలోని లైంగిక వివక్ష వల్ల స్ర్తీలు తమకు తెలియకుండానే తమ అస్తిత్వం కోసం అలవరచుకొన్న లక్షణాలివి. స్త్రీల ‘స్వభావాని’కి కారణాలైన ఇలాంటి బాహిర ప్రభావాలను గమనించ లేక (గమనించినా అంగీకరించలేక) స్త్రీ హృదయాన్ని, స్త్రీ చిత్తాన్ని, బుద్ధిని గూర్చి అనేక అపోహలను పురుషాధిపత్యం సూత్రీకరించింది; సిద్ధాంతీ కరించింది. స్త్రీలు ‘రహస్య రసాధిదేవతలు’ అని ఈ కవి అనడం అపూర్వం. ఇది స్త్రీల సహజ చిత్తవృత్తిని తెలుపుతూ, దాని వెనుకనున్న స్త్రీల మానసిక, సామాజిక కారణాల అన్వేషణకు ప్రేరణ నిస్తుంది.
తన ప్రాపంచిక దృక్పథానికి వ్యతిరేకం కానంతవరకు ఏ వస్తువును స్వీకరించడానికైనా, ఏ విధంగా వర్ణించడానికైనా ఈ కవి వెనుకాడరు. (ఈ కవితలన్నీ ఒకే కాలంలో, ఒక క్రమంలో రాసినవి కావన్నది తెలిసిందే.) వివిధ కాలాలలో, వివిధ మానసిక స్థితులలో అనుభవమే ప్రమాణంగా, ఆయా దృశ్యాల, సన్నివేశాలలోని వాస్తవికతే ప్రమాణంగా రాసిన కవితలివి. ‘నిజాయితీ లేకుండా, గాఢంగా నమ్మకుండా ఒక్క అక్షరం కూడా రాయలేదు’ అని ఆయ నే చెప్పుకున్నారు. గాఢంగా అనుభవించకుండా ఆయన రాయరు. అనుభవించలేకపోతే, ఒకానొక వస్తువు మనసును పట్టి పీడించే వరకు ఆగుతారు. లేదా మనసుకు పట్టించుకోవడానికి కొన్ని వారాలపాటు, నెలల పాటు ప్రయత్నిస్తారు.
‘నాకు రెండు టేబుళ్ళ కవతల’, ‘వాళ్ళు మాట్లాడుకుంటున్నారు’ అనే కవితలను, ‘అప్పుడి వేమీ’, ‘నుదుటి మీద రెండు పెదవులు’, ‘ఒక ఆడ- ఒక మగ’, ‘ఒక ప్రక్రియ’, ‘ఒక దీపం’ మొదలైన కవితలను ఒక వరుసలో చదివినప్పుడు- వీటిలో భావవైరుద్ధ్యమున్నట్లు వెంటనే అనిపించవచ్చు.స్త్రీ , పురుషుల లేదా భార్యాభర్తల బంధాలలోని వివిధ దశలను, వాస్తవిక స్థితిగతులను, వైరుద్ధ్యాలను, సంక్లిష్టతలను ఈ కవితలు ప్రతిఫలిస్తాయి తప్ప, కవిలోని భావవైరుద్ధ్యాలను కావని గ్రహించాలి. ఇంతకుముందే అనుకున్నట్లు ఈ కవి తన ప్రాపంచిక దృక్పథాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో వస్తు, వ్యక్తీకరణల్లో అంత స్వేచ్ఛగా వ్యవహరిస్తారు.
‘స్త్రీవాద ధోరణి ఇంతకు ముందు మనం స్పృశించని కొన్ని అంశాలను ముందుకు తెచ్చింది. వాళ్ళ జీవితాలలో మనం చూడని, చూడలేని చీకటి కోణాలను అది వ్యక్తీకరిస్తున్నది. నేనైతే మనస్ఫూర్తిగా స్త్రీవాద ధోరణిని ఆహ్వానిస్తున్నాను’ అని ఒక ఇంటర్వ్యూలో శివారెడ్డి చెప్పారు. స్త్రీవాదం ఆరంభానికి చాలా కాలం ముందు నుంచే స్ర్తీల హక్కులు హరింపబడడాన్ని, పురుషాధిపత్యాన్ని నిరసిస్తూ ఈ కవి రాశారని ఈ సంపుటిలోని కొన్ని కవితల రచనల తేదీలను పరిశీలిస్తే తెలుస్తుంది. అందువల్ల స్త్రీవాదం వల్లనే శివారెడ్డి ఇలాంటి కవితలు రాయగలిగారనేది పూర్తిగా సత్యం కాదు. కాకపోతే స్త్రీవాదం ఆయన ‘చూపు’కు మరింత ‘పదును’ పెట్టిందని, స్త్రీ ఆంతరిక, భౌతిక జీవితాలలోని మరికొన్ని కొత్త కోణాలను చూసే అవకాశాన్ని కల్పించి ఉంటుందని ఊహించవచ్చు. స్త్రీ విముక్తిని గాఢంగా కాంక్షించే ఈ కవి, పోరాటపంథా ఏ విధంగా ఉండాలనేది ఎక్కడా సూటిగా చెప్పినట్లు లేదు. పై ఆంగ్ల వాక్యాల సారాంశాన్ని అంగీకరిస్తే,స్త్రీ విముక్తిని గురించిన శివారెడ్డి అభిప్రాయాలు సోషలిస్టు ఫెమినిజానికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు.
-0-
గాఢానుభూతిలో ‘ధిక్కారాన్ని’ మిళితం చేయడం ఈ కవి కవిత్వంలో కనిపించే ఒక ముఖ్య లక్షణం.
ఒక వస్తువులోని తనదైన ‘విలక్షణత్వాన్ని’ నిదర్శన పరంపరల తో మరింత ఎక్కువ చేసి చూపడంలో ‘కారికేచర్’ లక్షణం కనిపిస్తుంటుంది. అలాగే పట్టరాని ఆగ్రహంలోను భాష, భావాల పరం గా ఒక సంయమనాన్ని కూడ ఈ కవితలలో గమనించవచ్చు.శివారెడ్డి కవితల్లో ‘చిన్న’, ‘పెద్ద’ కవితలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. చిన్న కవితలలో ‘భావాంశాల’ మధ్య సమతుల్యానికి, ముగింపుకు ప్రాధాన్యముంటుంది. ‘శీర్షిక’ కూడా కవితలో భాగమై కవితను మరింత ధ్వన్యాత్మకం చేస్తుంటుంది. ‘పెద్ద’ కవితల్లో నిర్వహణకు, వర్ణనలకు, ఆద్యంతాల మధ్య వస్తు ఐక్యతకు ప్రా ముఖ్యముంటుంది. ‘ముళ్ళు’, ‘సారాంశం’, ‘వెన్నెల’, ‘ముఖే ముఖే విషాదంలో...’ మొదలైన ‘చిన్న’ కవితలను చదివితే ఈ శిల్ప రహస్యాలను అర్థం చేసుకోవచ్చు.
‘రూపం’లో సామ్యం (పోలిక) అవ్యక్తంగా ఉంటుంది. దానివల్ల కవిత్వానికి సాంద్రత వస్తుంది. రూపక నిర్మాణం కవి సత్తాకు ఒక నిదర్శనం. ‘పురాతన విలువ మేకు’, ‘ఆదర్శాల రాగిచెంబు’, ‘ముగుతాడేసి ప్రపంచాన్ని నడిపించుకుపోవడం’, ‘శూన్య నేత్రాల గృహం’, ‘కిరణాలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం’ మొదలైన రూ పకాలలో, ప్రయోగాలలో నైరూప్యాలను సారూప్యాలతో పో ల్చడం, ప్రాణి ధర్మారోపణలు, సినెక్డకీ (), మెటానమీ () లు అన్నీ కలగలిసిపోవడం చూస్తాం. ‘చీకటి మొక్క’, ‘యిసుక సముద్రా ల సామ్రాజ్యం’, ‘ముకు ర పుష్పం’ లాంటి ప్రయోగాలు ఎన్నెన్నో... కవిత్వ సాంద్రత కోసం ఈ కవి చేసే సమాస, పదబంధ కల్పనలకు ఇవి స్వల్ప ఉదాహరణలు.
‘ఆమె చేతుల్లో ఎండిపోయినా, పండిపోయినా, రాలిపోయినా గొప్ప భాగ్యమే’- ఇలాంటి అనేక సందర్భాలలో క్రియాపదాల ద్వారా ఉపమానోపమేయాలను ధ్వనించడం ఈ కవి అనుసరించే మరో పద్ధతి. పరాత్మకంగా (ఆబ్జెక్టివ్‌గా), సాక్షీమాత్రంగా ఒక సన్నివేశవర్ణనను ఆరంభించి మధ్య, మధ్య కవిగా లుగజేసుకుంటూ, వ్యాఖ్యానిస్తూ తిరిగి వర్ణనను కొనసాగించి స్వీయ వ్యాఖ్యతో ముగించడం శివారెడ్డి కవిత్వ నిర్వహణ పద్ధతులలో ప్రధానమైనది (శివారెడ్డి కవిత్వ నిర్వహణ పద్ధతులను గూర్చిన మరింత విస్తృత చర్చ కోసం ‘శివారెడ్డి కవిత్వం- పరిణామ వికాసాలు’ పుస్తకం చూడవచ్చు). ప్రసుత సంకలనంలోని ఏ కవితను, ఏ భాషలోకి అనువదించినా ఆయా కవితల వన్నె తగ్గదు. వస్తుపరమైన విశ్వజనీనత, అనుభవ గాఢత, అభివ్యక్తి నవ్యతలను ప్రతిఫలించే కవిత్వ నిర్మాణ శిల్పం దీనికి ప్రధాన కారణాలు.
ప్రతి కవీ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక స్త్రీ గురించి కవిత రాసే ఉంటారు. శివారెడ్డి రాసినంత విస్తృతంగా స్త్రీ ఇతివృత్త కవితలు రాసిన తెలుగు కవి మరెవరూ లేరనే చెప్పాలి. శిశువుగా, బాలికగా, మగవాడి వంచనకు గురైన అభిమానవతిగా, ‘ప్రపంచానికి ముగుతాడేసి తన వెంట నడిపించుకుపోతున్న’ ధీరగా, తన ప్రాణాన్ని పంచుతూ పురిటినొప్పులు సహించే మాతృమూర్తిగా, జీవకారుణ్యాన్ని వర్షించే తల్లిగా, పురుషుడి అన్ని దాష్టీకాలను భరించే నిశ్శబ్దపు పసుపు ముద్దలాంటి మధ్యతరగతి గృహిణిగా, స్కూటీ గుర్రం మీద దౌడు తీసే నేటి తరం విద్యార్థినిగా, యువతిగా, ఉద్యోగినిగా స్ర్తీ జీవితంలోని వివిధ దశలను, వివిధ పార్శ్వాలను అత్యంత స్పష్టంగా, గాఢంగా, ఆత్మీయంగా శివారెడ్డి పరామర్శించారు.
భౌతిక, సామాజిక జీవితాలలో స్ర్తీ ఎదుర్కొంటున్న పక్షపాతాలతోపాటు, స్ర్తీ పురుషుల సంబంధాలలోని అనేకానేక సమస్యలతోపాటు, ఉద్వేగపరమైన సంఘర్షణలను, స్ర్తీ, పురుషుల చిరకాల సాంగత్యానికి మూలమైన సర్దుబాట్లను కూడా అంత వాస్తవికంగా విశ్లేషించడం ఈ కవితలలోని ప్రధాన వైశిష్ట్యం. తన కవిత్వానికి, తన కవిత్వమే ‘ముందుమాట’గా, ‘చివరిమాట’గా శివారెడ్డి భావిస్తారు. ఈ కవితలను కాలక్రమంలోను, వస్తుపరమైన విభజన దృష్టితోను పలుమార్లు చదివినప్పుడు కలిగిన ఆశ్చర్యానందాలను నిగ్రహించుకోలేకనే ఈ నాలుగు మాటలు రాయాల్సి వచ్చింది. ఈ సంకలనం తీసుకురావడానికి అనుమతించిన శివారెడ్డికి హార్థిక కృతజ్ఞతాభి వందనాలు.
6 comments:
అద్బుతంగా ఉంది మీ పరిచయం
శివారెడ్డిగారు పద్యాలు చదివితే చాలా బావుంటుంది. మనకి మనం చదువుకున్నప్పుడు కనబడని అందాలు కనిపిస్తాయి.
నేనూ వచ్చా, నేను విన్నా,నేనూ కొన్నా, నేనూ కలిసా...ఇప్పుడు చదివి ఆనందిస్తున్నా!
మహేషా
ఇన్ని నేనులే :-)
బాబాగారికి
కొత్తపాళీ గారికి
మహేష్ కుమార్‌కు
స్పందనకు నెనరులు
నేనూ వచ్చా, నేను విన్నా,నేనూ కొన్నా, నేనూ కలిసా...ఇప్పుడు చదివి ఆనందిస్తున్నా!
Post a Comment