నిర్మానుష్యమైన చోటికి పారిపోవాలని మనసు పదే పదే కోరుకుంటుంది. నిజానికి అలాంటి ప్రదేశం ఏదైనా దొరుకుతుందా? నిద్రకన్నుల రెప్పల్ని బలవంతంగా అలారం మోతతోటి తెరిచి, రొదపెడ్తన్న చోటుల్లోకి ఒకటే పరుగులు, వురకలు. కాసింత తొలిజాము కూతల పక్షుల సవ్వడి మరచిపోయామా? లేక రొదగా భావించి పక్షులకే అలారంమోత నేర్పి కొత్త సమయాన్ని, కొత్తస్థలాన్ని వెతుక్కోమని తోలివేసామా??
వెంటాడుతున్న బాద్యతల్ని ఒకొక్కటిగా నెమరువేసుకుంటూ నేటి పనుల జాబితాల్ని తయారు చేసుకుంటుంటే వాటి మద్య ఎక్కడైన నిర్మానుష్యమైన ప్రదేశానికి చోటుదొరుకుతుందా సమయం దొరుకుతుందా. బహుశ అంతర్జాల బ్రౌజర్లో వెతకాలేమో. దానికోసం ఏ ఏ కోడును ఉపయోగించాలో. ఒకదాని వెంబడి ఒకటి వెంటాడి వెతుకుతున్న దాన్ని మరిపింపచేసే గందరగోళంలో పడవేస్తాయి కదా!
బ్రతుకు జీవనం తరుముతుంటే రహదారులవెండి పరుగులు తీస్తుండాలి. వరదలాంటి వాహనాల ప్రవాహంలోకి జొరబడి ఒడ్డుకుచేర్చే తెడ్లకోసం వెతుకుతుంటాము.
మంచుకురిసినట్టో, ఎర్రని గుల్మోర్ పువ్వులు రాల్తున్న రహదారుల్లో రూపాయలకోసంవెతుకులాట గుర్తుకోచ్చి ప్రశ్నించే బాసు మొఖం కళ్ళముందు కదలాడి నుదుటపట్టే చెమటను తుడుచుకోవడమే మరచిపోయి పరుగులు తీయాల్సిందే! గాలివీచే కిటికీలను మూసివేసిన గదుల్లో ఎవరికివారే బందీలుగా అప్పగించుకొని బయటపడే మార్గంకోసం మరోవైపునుంచి వెతుక్కోవల్సిందే! బయటపడాటంకోకోసంచేసే ప్రయత్నాలలో అలసిన దేహం విశ్రాంతిని కోరుకొంటుంది. సుఖాన్ని మరచి, గతాన్ని మరచి మరుపుపొరలనద్య, మగత నిద్రల మద్య మరో రాత్రి పలకరించిపోతుంది.
దేన్ని వెతుకుతున్నానో ఏది కోరుకుంటున్నానో
ఎక్కడనుంచో మ్రోగిన రింగుటోను ఎదో అలజడిని గుర్తు చేస్తుంది.
No comments:
Post a Comment