అది ఉగాది సాయత్రం(2003) పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణములోని ఎన్.టి.ఆర్. ఆడిటోరియంలో కవి సమ్మేళనం జరిగింది. అద్యక్షులుగా శ్రీమతి నాయని కృష్ణకుమారి, ప్రత్యేక అతిథిగా శ్రీ ఉత్పల సత్యనారాయణ ఆసీనులైన వేదికపై వేదిక శీమతి శరత్ జోత్సనా రాణి ఆహ్వాన పలుకులతో ప్రారంభమైన సభలో జ్వాలాముఖి, ఎస్వీ సత్యనారయణ, అందెశ్రీ, కె. ప్రభాకర్, ఒబ్బిని, శివారెడ్డి, శిఖామని, ఘంటసాల నిర్మల, ఇలా ప్రముఖులెందరో ఆ రోజు కవిత్వాన్ని చదివారు. ఇంకా కొందరి పేర్లు గుర్తుకు రావటంలేదు.
అప్పటికి నేను అప్పుడప్పుడే రాస్తున్నాను.
కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభమవటంవల్ల కార్యక్రమము ఎవరికి వారే ఆలస్యం అవుతుందంటూ త్వరపడసాగారు. చివరిగా ముగ్గిరికి అవకాశం ఇవ్వబడింది. అందులో నేను ఒకణ్ణి . ఇప్పుడిప్పుడే రాస్తున్నా నని నన్ను నేను పరిచయం చేసుకొని " వసంతమా ఎపుడొచ్చావు" అనే కవితను చదివాను.
వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??
అప్పటిదాకా భయపెట్టిన చలి
దుప్పటి దులిపి పారిపోతున్న వేళ
చికురాకుల వగరు తిన్న కోయిల
కుహు కుహు రాగాలాపన చేస్తున్న వేళ
చేదునింపుకున్న వేప తేనెలొలుకు పూలై విరబూస్తున్న వేళ
వచ్చిందంట వసంతం
దాని వర్ణన కవులకే సొంతం
అనుభూతి ఓ అనంతం
యంత్రాలవలె కదలికలతో వాహనాలరొదలలో
క్షణం కోసం అనుక్షణం పోరాడుతూ
కాలంవెనుక వడివడిగా పరిగెడుతున్న వేళలో
గ్లోబునంతా జేబులొ పెట్టాలని
సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ అంటూ
కొత్తవేళ్ళూనుతున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
వెండితెర తారల తళుకు బెళుకులతో
నెట్‌లోని బ్రౌసింగు రూములలో చాటింగులతో
పబ్‌లలో హంగుల పొంగులతో
హోరెత్తించే బీటులోని నోటులతో
నూతన విరామాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్న సమయయంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
సస్యశ్యమలమనిపించే సీమలో
కాలే కడుపుతో బక్కచిక్కిన రైతు
నీవు వస్తావని సిరులెన్నో తెస్తావని
ఎదురుచూస్తున్న సమయంలో
పుట్లునింపాలని పట్టెడాశతో
పుస్తెలనమ్మి ఎరువేస్తే
వరదొచ్చి పురుగొచ్చి కరువొచ్చి
వెన్నుపై వెన్ను విరిచిన వేళ
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
నిన్నెరిగిన వారు నీకై స్పందించినవారు
నిన్నాశ్వాదించిన వారు
నీతో నడవలేక నవతరంతో ఇమడలేక
మమతల కరువై వెతల బ్రతుకై
కాలం పొరలమాటున దాగిన జ్ఞాపకాలను
నెమరేసుకుంటున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
ఉన్నత విద్యా సాధనలో
సుదూరతీరాలకు నిచ్చనవేసే ఆరాటంలో
భాషా సౌదర్యాన్ని గాలికి వదిలేసి
సబ్జెక్టులతో సెట్తులకై కుస్తీ పడుతూ
నిరంతరం అవిశ్రాంతంగా పోటీపడే
తాపత్రయంలో నిమగ్నమైపోతుంటే
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
మానవత్వాలు మరచి
బంధాలు పొడి బారిపోతున్న వేళ
వలస బ్రతుకుల మధ్య మనిషి
వ్యాపార వస్తువైపోతూ
వర్గవర్గాలుగా విడివడిపోతున్న వేళలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
----
ఎవరికి వారే త్వరగా వెళ్లిపోవాలనే ఆత్రంలో ఎవరు విన్నారో అని నాకు కొచెం అనుమానంగానే వుంది మనసులో. సభ అయ్యి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరో నన్ను పిలిచారు ఆశ్చర్యానికి లోనై వెనుతిరిగి చూసాను. తెల్లటి చొక్కా కుడి బుజంనుంచి వేల్లాడుతున్న చంచితో కంపించే జ్వాలముఖి. కొద్ది ఆగితే ఆయన నాలుగు అడుగులు వేసి నన్ను కలిసి భుజంపై చెయ్యివేసి హాట్స్ ఆఫ్ టు యువర్ పోయం అని భుజం తట్టారు. కొచెం ఆశ్చర్యం, కొచెం ఆనందం వుక్కిరిబిక్కిరిచేస్తుండగా కొత్తగా రాస్తున్నట్టులేదు, మంచి వరవడివుంది రాస్తూవుండు అని భుజం తట్తారు జ్వాలాముఖి. ఆయనిచ్చిన ఆ స్పూర్తితో నేనూ రాయగలను అనే నమ్మకం కుదిరింది. రాస్తూ పోయాను.
విజయవాడలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది అందులో పాల్గ్నటానికి రాష్ట్రం నలుమూలనుంచి వాచ్చిన కవులను కలుసుకోవటానికి నేను వెళ్లాను. అక్కడ చాలామందిని కలిసాను అప్పుడే నాకు స్ఫూర్తినిచ్చిన జ్వాలాముఖితో చాలా సమయం గడపటం జరిగింది. అప్పటికి నేను రాసిన "హసీనా" దీర్ఘ కవిత ముద్రించాలనే ప్రయత్నంలో వుండి జ్వాలాముఖిని ముందుమాట రాయమని కోరాను. బాగున్నదని అన్నారుకాని ఎందుకో పరిచయవాక్యలు రాయలేదు. ఆయన అభిప్రాయం లేకుండానే హసినా పుస్తకరూపం దాల్చింది.
జ్వాలముఖి ప్రసింగించే తీరు, అనర్ఘలం ఎంతైనా అనుకరించాలని మనసులో కోరికకలుగుతూనే వుంది ఇప్పటికీ.
ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణకు వెళ్ళాను. అక్కడ వెనుకగా వచ్చి భుజంతట్టి అభినందనలు తెలియచేసారు. ఎందుకని అడిగాను ఓ పుస్తకచేతికిచ్చి చూడమన్నారు. అది సాహిత్య ప్రస్థానం. అందులో ఆయన రాసిన వ్యాసంవుంది తర్వాత చదివిచెపుతాను అని చెప్పాను. అయితే నేను చూడమన్నది అది కాదు అని పేజీలు తిప్పమన్నారు. అందులో నేను రాసిన ఒక కవిత ముద్రింపబడింది. చాలా ఆశ్చర్యం.
2 comments:
అద్భుతంగా ఉందండీ ఈ కవిత
ఇంతకుమునుపు బ్లాగులో పెట్తినదే, కాకపోతే నేపథ్యం వివరించే క్రమంలో పెట్టాను. స్పందనకు నెనరులు
Post a Comment