Friday, August 29, 2008
అక్క - తమ్ముడు - చెల్లి - - జ్ఞాపకాల అల
ఆమెవరోగాని తన తమ్ముణ్ణి తలచి
జ్ఞాపకాల పొరల్లోంచి
అలికి సుద్దముగ్గులెట్టిన అరుగుపైకి
బాల్యాన్ని లాకొచ్చి కూర్చోబెట్టింది
కన్రెప్ప అంచున జారనున్న అనుభూతుల మంచు బిందువులు
ఏటవాలు లేలేత కిరణాలుతాకి
కొత్త రంగులు చిప్పిల్లుతున్నాయి
ఇంకో ఆమె ఆశ ఒక్కసారిగా పెల్లుబికిన క్షణంలో
అడ్డున్న సముద్రమేలేకుంటే
కారు తిన్నగా
అరుగుల లోగిలివైపు మళ్ళేది కదా! అంటుంది
జిల్లేడుకాయ పగిలినట్టు ఆలోచనలు
దూదిపింజాన్ని అంటుకున్న జ్ఞాపకాలు
చేతులు పైకెత్తితే అందనంతగా
చేతులు చాపితే దొరకనంతగా
ఒకొక్కటిగా ఎగురుతూనే వున్నాయి
నీతో నాకేంపనంటూ
ఎగరలేనితనాన్ని భుజాన భారంగావేసుకొని
అక్కడే పడిపోతున్నాయి మరికొన్ని.
ముగ్గుల్లోని చుక్కల్లా
వెన్నెలరాత్రుల్లో లెక్కపెట్టిన చుక్కల్లా
కళ్ళముందు మెరుస్తున్నాయి
ఆవుపేడతో ఇల్లు అలకడంకోసం
పాలేర్లు తొలుకెళుతున్న ఆవులవెనుక
మనతో పాటే పోటీపడే పిల్లల్ని తోసుకుంటూ
పోగుచేసిన పేడ మోయడం చిత్రమే కదా!
నువ్వు మూడు నేను ఒకటి చదువుతూ
అందమైన కలగా ఆడిన ఆటలో
నువ్వు డాక్టరై నేను కాంపౌండరై
ఇచ్చిన పాతమందుల్ని మింగిన పిల్ల
నురగలుకక్కుతూ విలవిలలాడినప్పుడు
వీధి వీధంతా ఇంటిపైకొస్తే
మన వీపులపై బెత్తం నాట్యమాడిన గుర్తులు
ఆ పిల్లతో ఆడుకొనేవరకూ
సలుపెడుతూనే వుండేవి కదూ!
బడిలోపెట్టే ఉప్మాముందు
పాడిన ప్రార్థనాగీతం
పంతులమ్మగారి పిల్లలంటూ
చూపే ప్రత్యేక ఏ పదాలకు దొరుకుతుంది?
వీధిచివర్న నూతిప్రక్క
రామయ్య వెలిగించిన
దీపస్థంబంపై కిరోసిన్దీపం చుట్టూచేరి
వెన్నెల జలతారు పరదాలమాటున
ఆడిన ఆటలు గుర్తొస్తున్నా
వీరివీరి గుమ్మడిపండంటూ
ముక్కుగిల్లుడు
కుంటుకుంటూ పట్టుకోవడం
అవ్వా! పచ్చా అంటూ చేతులు కలిపి
వూరేగిన వూరేగించిన నేస్తాలు
మనతో ఆడినవారి
పోలికలో పేర్లో గుర్తురావటంలేదెందుకని?
దాళ్వాయో సార్వాయో
పనులకోసం వలసకూలీలు
వాళ్ళ వెనుకేవచ్చి
రాత్రివేళ నెగడువేసి
రోజుకో కథో కళారూపమో ప్రదర్శించిన వాళ్ళు
ఎప్పుడైనా నా కలలోకొచ్చి
పలుకరిస్తారని ఎన్నిసార్లు ఎదురుచూసానో!
కొంచెం పెరిగిన తరగతులమద్య
బడిపక్కనుండే టూరింగు టాకీసు
రాత్రిచించిన టికెట్టు ముక్కలు
ఏరుకుంటూ... ఏరుకుంటూ...
ఏ లెక్కల్ని నేర్చుకున్నామో!
అందులోచూసిన 'రక్తసంబంధం' ఏమినేర్పిందో! ఎలాచెప్పాలి?
కొండదారిలో పులి తిరుగుతుందని
బడికెళ్ళే దారిలో గట్టుపైనున్న కుంకుడుచెట్టుపై
దెయ్యముందనే పుకార్లు
ఆ పక్కే సుబ్రహ్మణ్య గుడిలో
నాగిని మహత్యాల కథలు
దేనికీ భయపడని మన స్నేహ అనురాగబధం
బరువెక్కిన గుండెతో
ఇప్పుడెందుకో పదే పదే పలవరిస్తోంది
గోదారి వారగా వెళ్తూ
ఏటవాలు కొండపై గుర్తులు దాటుతుంటూ
రామలక్ష్మణ వనవాస కథల్నెన్ని నేర్చుకున్నామో?
ఇప్పుడు అలా వెళ్ళి
గోదారొడ్డున పిచ్చుకగూళ్ళను కట్టి
పిల్లగాలి అలలతో ఎగిరే చేపపిల్లల్ల్ని
ఒడుపుగా విసిరితే చిల్లపెంకులేసే కప్పగంతుల్ని
ఇసుకతెన్నెల్లో ఏరిన ఆల్చిప్పల్ని
పెరడులో కోసిన గొబ్బిపూల లేలేత సౌరభాల్ని
ఈ వెన్నెల్లో ఆరబోసి ఏరుకుందాం!
నా అనుబందపు తొలిస్నేహ హస్తానివి నువ్వే!
-------
అక్క మేరీ సలోమికి అంకితం
రాయాలని స్పూర్తినిచ్చిన రాధిక కవిత
తమ్ముడు, అందులో నిషిగంద కామెంటు
నెనరులు
----
3936
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
మీకవితలు అందరూ చాలా బాగున్నాయంటే, నాకు చెప్పడానికేం వుండదని ఇంతకాలం ఇటు రాలేదు. :) ఇప్పుడే చూస్తున్నా మీ కవితలలో పదగుంభన, ఆర్తి, ఆవేదన, ఆనందం, ... చక్కని బావాలూ, చిక్కని శైలీ. కాలతపస్వినికి వివరణ బాగుంది. అమ్మ సంకలనం కూడా ముచ్చటగా వుంది. అందులో కొన్ని వారి వారి బ్లాగులలో చదివేను. (అన్నట్టు, రాధిక తమ్ముడు కూడా చదివేను. అక్కడ తనకి చెప్పలేదు కానీ). మీ సాహిత్యకృషి ఇతోధికంగా సాగాలని నాకోరిక.
మరో కోరిక - అమ్మ సంకలనం ఎలా చేసేరో, టెక్నికల్ విషయం - చెప్పగలరా. నేను ఒక సంకలనం చేద్దాం అనుకుంటున్నాను. పిడియఫ్,లో పెడితే, ఇలా పేజీలు కనిపించడం లేదు. లింకు వస్తోంది.
- అభినందనలతో, మాలతి
మాలతి గారు
మీ స్పందనకు
ధన్యవాదాలు
మీరు అడిగినవి మెయిలు చేస్తాను
సార్ నాదానినుండి స్పూర్తి పొందాను అన్నారు గానీ మీ కవిత హిమాలయాలంత ఎత్తులో వుంది. మీ కవితలో చెప్పిన ప్రతీ అక్షరంలో నా బాల్యం వుంది.కొన్ని నేను అనుభవించక పోయినా అవన్నీ నా బాల్యంలోని గురుతులే.భావాలను అద్భుతం గా ఆవిష్కరించారు.
రాధిక
నీ కవిత తమ్ముడు చదవగానే నా అక్కకు పోనుచేసాను.
1965 నుండి 1972ల మద్య మా బాల్యాన్ని గుర్తుచేసుకున్నాము. కలిసి బడికి వెళ్ళేవాళ్ళము. ఒకరి దుస్తులు ఒకరం వేసుకొనేవాళ్ళము. ఆడపిల్లలు చొక్కా వేసుకుంటే, మొగపిల్లాలు జాకీటు వేసుకుంటే ఎగతాళిచేసేవారు, అయినా ఎవర్నీ లెక్కచేయలేదు.
ఆ జ్ఞాపకాలతో కలిపి సర్వజనీయమైన కవిత్వం వైపు ప్రయత్నంచేసాను. అలా ప్రయత్నించినప్పుడు అన్నీ నా అనుభవాలే కానవసరంలేదు.
ఇక రెండు విషయాలు నన్ను కవిత రాయడానికి ప్రేరేపించాయి.
1. నిషిగంధ - సముద్రమే లేకుంటే కారు డ్రైవ్ చేసేదాన్ని కదా
2. కవిత చదవాగానే నేను నా అక్కకు పోను చేయటం
- ఈ రెండు విషయాల్లోను ఒక జ్ఞాపకంవైపు నడిపించే
శక్తి కనిపించింది. దాన్ని కవిత్వీకరించే ప్రయత్నంచేసాను.
అందుకే ఎక్కడా అక్క తముడు ... అనుబందాల్ని డైరెక్టుగా రాయలేదు.
'జిల్లేడుకాయ...మరికొన్ని' ఈ స్టాంజా నాకు చాలా చాలా నచ్చిందండీ..రాసిన మీకు మనఃపూర్వక అభినందనలు
'జిల్లేడుకాయ...మరికొన్ని' ఈ స్టాంజా నాకు చాలా చాలా నచ్చిందండీ..రాసిన మీకు మనఃపూర్వక అభినందనలు
జోతిర్మయి
సుమారు మూడు సంవత్సరాల క్రితం రాసిన కవితకు ఇప్పుడు స్పందన రావటం సంతోషమనిపిస్తుంది. .
ఇప్పుడు మళ్ళీ నా కవితను నేనే చదివితే నేనే ఇది రాసానా అని నాకే సందేహం కలిగింది. మళ్లీ బాల్యాన్ని గుర్తుచేసుకునే అవకాశాని కల్పించినందుకు, స్పందనకు ధన్యవాదాలు
ఆమెవరోగాని తన తమ్ముణ్ణి తలచి
జ్ఞాపకాల పొరల్లోంచి
అలికి సుద్దముగ్గులెట్టిన అరుగుపైకి
బాల్యాన్ని లాకొచ్చి కూర్చోబెట్టింది...
అంటూ మీ ఆవుల వెనకే మమ్మల్ని తోలుకెలుతూ మీ సుబ్రహ్మణ్యం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించిన మీకు అభినందనలుతో పాటు ధన్యవాదాలు సార్..
Post a Comment