Wednesday, August 13, 2008

కాల తపస్విని - చిన్న వివరణ


ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ రావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను

అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను

మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
----
రాగి లోహ లక్షణము మనసు వుందనిపించింది. అధిక వేడిమికి, విద్యుత్తు ప్రవాహానికి తట్టుకుంటుంది. బంగారంతో కలిసినప్పుడు బంగారానికే కొత్త గుణాన్ని ఆపాదిస్తుంది, బంగారంతో సమానమైన విలువను పొందుకుంటుంది. రకరకాల పాత్రలు పోషించే ఈ రాగిని అలానే వదిలేస్తే తన సహజత్వాన్ని మరచి కిలుము పడుతుంది. దాన్ని ఏదైనా సిట్రిక్ యాసిడ్ కలిగిన పదార్దములతో తోమినప్పుడు కొత్తమెరుపును తెచ్చుకుంటుంది.
---
వ్యక్తిగతంగా నేను కొన్ని అపజయాలు, వత్తిడులు, అవమానాలతొ కృంగిపోతున్నప్పుడు పై వాక్యాలు నన్ను ఆలోచింపచేసాయి. సరిగ్గా అప్పుడే వాయుపుత్రిని కథలు ఒకొక్కటిగా మనసులో మెదిలాయి. తనకు కలిగిన అపార శక్తియుక్తులను ఎన్నడూ తనలొ వున్నట్టుగా వుండడు. కానీ అవసరసమయాలలో ఇతరుల ప్రోస్తాహంతో వాటిని వెలికితీసి ఆశించిన దానికంటే ఎక్కువగానే చేసుకొస్తాడు. సరిగ్గా ఇక్కడే నా ఆలోచనలు మలుపు తిరిగాయి. అవి నాలోచి నాలోకి ప్రయాణించాయి. సస్యలనుండి, పరిస్థితులనుండి నాకు నేను బయటకు రావడానికి దారిచూపాయి.
అందులోచి కలిగిన కొన్ని భావాల చిత్రాల రూపమే ఈ కవిత.

ప్రతీ మనిషిలో ఒక వాయుపుత్రుడు అజ్ఞాతంగా దాగివుంటాఅడు. వాణ్ణి వెలికితీయగలిగినప్పుడు ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా దాటవచ్చు.
వాయుపుత్రిని ఎదురైన విభిన్న సమయాల పరిస్థితులను నేనైతే ఎలా ఎదుర్కొంటాను అనే ఆలోచనకు ప్రతిరూపం ఈ కవిత. ఆయన ఎదుర్కొన్న పర్థితులు, సమయాలు, నేను ఎదుర్కొనే సమయాలు పరిస్థితులు వేరైనప్పటికీ ఎదుర్కొనే మూలం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది.

నేను నా వ్యసనం అనే సమస్యనుండి బయటకు రావటానికి ఈ ఆలోచనలు బాగా సహకారి అయ్యాయి.
---
ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ మైరావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను
మైరావణ సభలో దూతగా స్థానమివ్వకపోయే సరికి తన తోకతోనే ఉన్నతమైన ఆసనాన్ని తయారుచేసుకొని కూర్చొన్నాడు. అప్పుడప్పుడు తగిన స్థానం ఇవ్వని పరిస్థితుల్లో మనకు మనమే సింహసనాన్ని ఆవిషరించుకోవాలి. దానికి తగిన ఆత్మ విస్వాసాన్ని కలిగివుండాలి ప్రోది చేసుకోవాలి.

---
అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను
లంకలోకి వెళ్ళి సీత జాడకనుక్కోవటం అసలు విషయమే అయినా ఎలా వెళ్ళటం, ఎవరు వెళ్ళాటం అనేది పెద్దమీమాంశ. ముందడుగు వేయకపోతే అదే సముద్రాన్ని చూస్తూ వుండిపోవలసిందే.

---
మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను
లంకలోకి వెళ్ళాలంటే సునాయాసమేమి కాదు కొందరితొ పోరాడాలి అవి మాటలే కావొచ్చు, మనుషులే కావొచ్చు ముష్టి ఘాతాలకు సిద్దంగా వుండాలి. ముష్టి ఘాతాలో, మాటల ఘాతాలతోనో సిద్దంగా లేకపోతే మనల్ని నివీర్యం చేయడానికి మనచుట్టూ ప్ర్యత్నాలు జరుతూనే వుంటాయి.
---

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

రాక్షసత్వం దాచిన రహస్యం సీత. చేధించడం సులువేమీ కాదు. అయినా చేదించి ఋజువును తేవటం కస్ఠమేమీ కాదు.

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

క్లిష్టసమయలో సంజీవిని వెతకలేక మొత్తం పర్వాతాన్నే ఎత్తుకు రాగలగటం ఒక ఉద్విగ్న ఘట్టం.

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

త్రేతాయుగాన్ని దాటి, ద్వాపరయుగంలో జరిగే సంగ్రామం కోసం, విజయుడు(అర్జునుడు) వచ్చేదారిలో ఎదురుచూడటం, నిరీక్షించడం చాలా కటినమైనదే. విజయుడు మనల్ని పోల్చుకున్నా పోల్చ్కోలేకపోయినా, విజయుడు ఇదే దారిలో రావటం మాత్రం నిశ్చయం.


శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

ఇక చివరిగా తనకోసం ఇచ్చిన మణిహారంలో రాముణ్ణి వెదకడం అత్యంత పరాకాష్ట.
అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
ఒక్క సారి గుండెల్ని చీచి చూడగలిగితే దైవ స్వరూపం మణిహారాలలో కాక హృదయ అంతః సీమల్లో దర్శనమిస్తాడు.
అలా వెదకలేక జీవితమంతా యాతన పడుతూనే వుంటాము.
----
3798

5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అద్భుతంగా వుంది.

చిలమకూరు విజయమోహన్ said...

మైరావణ సభ కాదు రావణ సభ

జాన్‌హైడ్ కనుమూరి said...

విజయ మోహన్ గారు
స్పందనకు నెనరులు

మీ సూచనను మరొక్కసారి సరిచూస్తాను.

Bolloju Baba said...

ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తూంటుంది.
కవితలోని ఒక లైను వెనుక సంపూర్ణఅర్ధాన్ని చెప్పాలంటే పేరాలకు పేరాలు వ్రాయవలసి ఉంటుంది.

అది కవి చేసినా విమర్శకుడు చేసినా ఆ కవిత యొక్క క్లుప్తతను, ఘాఢతను తెలియచేస్తుంది.

ఇకపోతే ఒక కవితకే తలొక భావం వచ్చే విధంగా అన్వయించటం ఒక చమత్కారం.

ఏది ఏమైనా మీ కవిత ఘాఢతను ఆవిష్కరించి మీ హృదయాన్ని పరచారు.

అభినందనలు
బొల్లోజు బాబా

జాన్‌హైడ్ కనుమూరి said...

బాబా గారికి
ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏముందండీ
నేను మద్యపానాన్ని మానటానికి నేను సాహిత్యానికి దగ్గరయ్యాను.
అందులో నాకు కవిత్వం గట్టిగా పట్టుకుంది.
అప్పటినుండి ఉదయ, మద్యాహ్న, సాయంకాల, రాత్రి మోతాదులుగా కవిత్వాన్ని గుళికలు(టాబ్లెట్) చేసి మింగుతుంటాను.

నేను ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదండి

మీ అబిప్రాయానికి ధన్యవాదాలు