రాధిక గారికి,
కవిత్వమనేది హృదయాంతరాళాలలో దాగివున్న జలనిధి. బయటకు రావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. ఆ ప్రయత్నం నిత్య జీవితంలో జరుగుతూనే వుంటుంది. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొందరి ప్రభావం తటస్థించడం ద్వారా అది బయట పడుతుంది. అలా వస్తూ అది ప్రవాహమౌతుంది. ఆ ప్రవాహానికి దిశ, లక్ష్యాలను నిర్ణయించడానికి ఒక క్రమశిక్షణాత్మకమైన పరిశ్రమ అవసరమౌతుంది. ఈ ప్రవాహంలో వెలువడే కవిత్వం ఒక అంత:సూత్రాన్ని పాటిస్తూ తెలియకుండానే ధ్వని సమన్వయం చేసుకుంటుంది. ఇలా జరగటానికి బాల్యము, జన్మస్థలాలు, పరిసరాలలోని పెద్దల స్ఫూర్తి, చదువు నేర్చుకున్న మూలాలు దోహదంచేస్తాయి. స్పందించే హృదయం కొనుక్కుంటేనో, సాధన చేస్తేనో వచ్చేది కాదు. సహజసిద్ధంగా గోరుముద్దలు, లాలిపాటలతో మొదలై శ్రమైక జీవనంనుంచి అంతరంగాలలో పాదుకుంటుంది.
ప్రస్తుత సాహిత్యం, విప్లవసాహిత్యమే సాహిత్యమన్న స్థితినుంచి, వివిధ ధోరణులు విభిన్న వర్గాలుగా విడిపోతున్న దశ, ఏ వాదాలు దేనికి మార్గదర్శకంగా నిలుస్తాయోననే సందిగ్ధత ఓ ప్రక్క, మరో ప్రక్క కెరీర్ ఓరియెంటేషన్ పెరిగి ఇంటర్ మీడియట్ స్థాయినుంచే తెలుగును వదిలేస్తున్న నేటి విద్యావిధానాలు, కార్పొరేట్ చదువులు వీటన్నిటి మధ్య యువత కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నదా అనే పరిస్థితి. వలసలు, వలసలవల్ల ఏర్పడే “డయస్పోరా” మరో ప్రక్క.
తెలుగునాట విరివిగా కవిత్వం వస్తున్నది, కవిత్వ పుస్తకాలు వస్తున్నాయి కాని అమ్మకాలు లేవు. అసలు ఇవి ఎంతవరకూ యువతకు చేరుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కవి, అందులోనూ యువకవుల పుట్టుక చాలా సందిగ్ధంగా వున్నదశలో రాబోయేకాలంలో కొత్తకవులు పుడ్తారా అనేదికూడా ప్రశ్నే.
ఇలాంటి భిన్నత్వం మధ్య మీరు కవిత్వం రాస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను కవిత్వాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకొని చదవటం అలవాటయ్యింది
చదవగానే వచ్చే తక్షణ స్పందన
అక్షరాలలో అంత:సూత్రం ఏమైనా కనిపిస్తుందా
అక్షరాలు ఏమైనా మోసుకొని వస్తున్నయా (ప్రతీకలు)
వీటిల్లోంచి నాకు(ఇప్పటికి) ఏమైనా పనికివస్తుందా
ఇలా కొన్ని విషయాల దృష్టితో చదువుతుంటాను. అందులో కొన్ని తాత్కాలిక ఆనందానిస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, కొన్ని వెంటాడుతుంటాయి . అలాంటివి మీ కవిత్వంలో నాకు కొన్ని కనిపించాయి.
ఎక్కువగా అన్నీ ఒకలాగే వుండటంవల్ల అన్ని కవితలూ కోట్ చెయ్యటం లేదు. ప్రత్యేకమని నాకు అనిపించినవే వుదహరిస్తున్నాను. కవిత్వంలో ఇలాగే వుండాలనే నిర్దిష్టాలు ఏవీలేవు. నేను చెప్పినవే ప్రమాణాలు కాదు. నాకు అనిపించినవి మాత్రమే చెప్పడానికి ఒక ప్రయత్నం, అది మీకు ముందుముందు వుపయోగ పడాలని ఆశ.
కవిత్వం రాయడమే కాకుండా బ్లాగుల్లో వుంచడం, దానికి సందర్భోచితంగా ఫోటోలు జోడించడం, బ్లాగు తెరవగానే పాట వినిపించడం, ఇలా మీరు కంప్యూటరు టెక్నాలజీని వినియోగించుకోవడం నాకు బాగా నచ్చిన ఆంశాలు. కవితకు బొమ్మ వేసి ముద్రించడం పత్రికల్లో పద్ధతి. ఫోటోను పొందుపరచడం బ్లాగుల్లో సౌలభ్యం. మీరు ప్రతీ కవితకు ఓ ఫోటోను జతచేస్తారు. ఫోటోను ఎన్నుకుని కవిత రాసినా, రాసినదానికి ఫోటో వెదుక్కుని పెడ్తున్నా ప్రకృతి సౌదర్య స్పృహ అంతర్గతంగా మీలోదాగి వుంది (ఈస్తటిక్ సెన్స్అంటారు).
ఈ కవిత్వాన్ని ఎన్నిసార్లు చదువుతున్నా చిత్రమైన అనుభూతి కలుగుతుంది. అది చాలాసార్లు నదిలోనో, సముద్రానికో స్నానం కోసం వెళ్ళినప్పుడు చిరుకెరటాల మధ్య మోపే మొదటి అడుగు పొందే నీటి స్పర్శలాంటిది. లోపలికెళ్ళేకొద్దీ ఆ స్పర్శ, అనుభూతి మారిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మొదటిపాదం పెట్టాల్సి వచ్చినప్పుడు అదే అనుభూతి, అదే స్పర్శ..
బహుశ: మొత్తం కవితల్లో వస్తువు ఇంచుమించు ఒకటే అవటం వల్ల ఇలా అనిపించవచ్చు.
మీరు, మీ స్నేహితులు పంచుకున్నదేదైనా అందులో దాగివున్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమే మీచేత ఇన్ని అక్షరాలను మాలలుగా తోరణాలను అల్లిస్తుంది.
మీ కవిత్వంలో కనిపించిన అనుభూతులు పాతబడిపోయిన కవిత్వమని తలుస్తారు కాని అందులోంచి ఒక కొత్త వ్యక్తీకరణ కనిపిస్తుంది. అనుభూతిని చెప్పటంలో తాజాతనం కనిపిస్తూ వుంటుంది. ఆ తాజాతనం ఎవ్వరినైనా ఆకర్షిస్తుంది. జ్ఞాపకాలనో, అనుభవాలనో, అనుభూతులనో తట్టిలేపుతుంది.
బేలతనం, అమాయకత్వ లక్షణాలను తొలగించుకోవల్సిన, బయటపడవల్సిన అవసరం వుంది.
కవిగాని, రచయితగాని దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలనుండి ప్రభావితమై, దాని ప్రభావం రచనల్లో అంతర్లీనంగానైనా కనిపిస్తుంది అని విమర్శకులు చెపుతారు. ఆ కోణంలో చూస్తే కన్నీళ్ళు, ఒకలాంటి నిస్పృహ, ఎడబాటు ఎక్కువగా కనిపిస్తాయి మీ కవితల్లో.
ఆలోచనలను ఎక్కువగా పోజిటివ్ వైపు మళ్ళించడం కనిపిస్తుంది. అది మిగతావాటిని అధిగమిస్తుంది కూడా.
ఐతే కొన్నిచోట్ల వాస్తవ విరుద్ధమైన పదాలు వున్నాయి.
ఉదా : చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం ఇది పరస్పర విరుద్ధభావన. గమనించండి.
ఇందులో చీకటి వాస్తవం. చీకటి భయానికి, తెరమాటుతనానికి, వికృత చేష్టలకు , చెడ్డతనానికి …. ప్రతీక.
అది తెచ్చే చుట్టం అలాగే వుంటుంది కానీ మంచిగా ఎలా వుంటుంది?
పూర్ణిమ వున్నప్పుడు చీకటికి తావులేదు, చీకటి ఆక్రమించినపుడు వెన్నెలకు చోటు లేదు
వెన్నెల సాహిత్యానికి, ఇరుమనసుల కలయిక పడే విరహానికి ప్రతీక. వెన్నెల ప్రేమికుల మధ్య కొత్తసంగీతాన్ని తెస్తుంది.
కన్నీరు కవితలో ఇలా అంటారు:
“ఈ బరితెగించిన బాధని చూడు
కనుల సరిహద్దును దాటి
చెంపలను తడుపుతుంది
కనికరంలేని కన్నీళ్ళు
ఎంత ఆపినా ఆగట్లేదు
సంతోషమా
నువ్వొచ్చి కట్టడి చెయ్యొచ్చుగా!”
సంతోషం ఎలావస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, దేనివల్ల వస్తుందో తెలియనప్పటికీ ఆహ్వానించడం ద్వారా ఒక దృశ్యంగా సాగిపోతున్న ఒరవడి నుండి కవితా రూపం, అనుభవాలు మారిపోతాయి.
కొన్ని కవితల్లో మిమ్మల్ని మీరు స్థిరీకరించుకుంటున్నారు:
“అలుపుతీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైతే
చిగురుటాకులా వణికిపోతున్నాను.
కానీ..
ఈ సుడిగాలి జడివాన కురిస్తే
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతాను గానీ
ఎండుటాకులా దూరంగా ఎగిరిపోను”
….’చిరుగాలి కోపానికి’ కవితలో
కొన్ని కవితల్లో మీరు అర్థం చేసుకుంటున్న కవిత్వ నిర్వచనాన్ని వ్యక్తీకరిస్తున్నారు.
“కవిత” అనే కవితలో
“మనసులోని భావాలు
మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత”
అంటారు. అనుభూతులకు, ఆలోచనలకు భిన్నంగా వాడిన పదాలు ‘అందం’ కవితలో “అదృష్టం”, ఆమె కవితలో “విధి”.
అనుభూతులు, ఆలోచనలను అందరూ ఏదో వొకప్పుడు అంగీకరిస్తారు కాని పై పదాలు అన్నివేళలా అందరికీ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి పదాల వెనుక మతం వస్తుంది. అది భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది.
నాకు బాగా నచ్చిన కవిత:రేపటి ఉదయం
ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడుతో యుద్ధం చేస్తుంది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే…
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను
అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను
ఓ నిరాశా…
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం…నాది….
కన్నీళ్ళు, మనసు యుద్ధం, సరికొత్త ప్రారంభం, కమాండ్ - శాసించడం
నాది అని సొంతం చేసుకొనే దృక్పథం సరికొత్త ఆవిష్కారాలకు దారి చూపిస్తుంది. నిదురలేని రాత్రిని యుద్ధంతో పోల్చడంలో నేటి జీవన పరిస్థితి “struggle for existence ” కనిపిస్తుంది. ప్రతీ వోటమిలోనుంచి గెలుపుకు మార్గాలను వెతుక్కోవచ్చు అని నిరూపించిన వాళ్ళు ఎందరో వున్నారు. జారిపోయిన, పారిపోయిన కాలం నుంచి పాఠాలను నేర్చుకున్నప్పుడే ప్రతి ప్రారంభం నిర్మాణానికి, నిర్మించుకోవడానికి దారి తీస్తుంది - అది జీవితమైనా, జీవనమైనా, సమాజమైనా.
నిరాశను శాసించడం ద్వారా ఆశను పట్టుకోవడం బాగుంది.
“ఇప్పటికైనా” కవితలో స్త్రీవాదం కనిపిస్తుంది.
అదిమిపెడుతున్న ఆశలు పైకి చెప్పాలనుకోవడం మార్పుకోసం ఎదురు చూడటమే. శిశువుగా శ్వాసించడం కేకతోనే ప్రారంభం.
కేక/శబ్దం నిశ్శబ్దాన్ని చీలుస్తుంది. తరంగ తరంగాలుగా భావం బయటపడుతుంది. ప్రపంచం మొత్తంమీద మాట్లాడగల్గిన (prominent personalities) వాళ్ళను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు.
“వర్షించడానికి సిద్ధంగా
ఎన్నేళ్ళ భావాలో?
ప్రవాహంలా
ఎన్నెన్ని కన్నీళ్ళో?”
ఇది చదువుతున్నప్పుడు మా అమ్మ గుర్తుకువచ్చింది. ఆరు కానుపులు, ఏడుగురు పిల్లలు, చాలీచాలని ఆర్థిక వెసులుబాటు, రెండు మూడు సంవత్సరాలకోసారి బదిలీలు. తన వ్యకిగత ఆశలకు, ఆలోచనలకు ఎప్పుడూ వూపిరి దొరకలేదు. తనకొచ్చిన వుద్యోగావకాశాలు సంసారం, బాలింత సూలింతల మద్య నలిగిపోయాయని అంటుండేది. బహుశ కన్నీళ్ళై ప్రవహిస్తే మనసుకు వూరట కలుగుతుందేమో? మరి సమస్య మాటేమిటి? ఆశల సంగతేమిటో…. పెద్దప్రశ్న. ఇది ఒక్కరిదీ ఇద్దరిదీ కాదు. బహుశ స్త్రీలందరిదీనేమో.
కన్నీళ్ళ ప్రవాహాలవటం కొత్తదారుల్ని తెరుస్తుంది
వర్షిస్తే కొట్టుకుపోయినవి ఎన్నో.
మాట్లాడాలి ఇకనైనా…అనే భావాన్నిస్తుంది
“అతడు” కవితలో
“చాలా చెప్పాలనుకున్నాను అతనికి
కాని ఏమిచెప్పాలో తెలియని పరిస్థితి”
యవ్వనంలో తప్పని భావాలైనా ప్రేమకూ ఆకర్షణకూ మధ్య తేడా తెలవకుంటే సమన్వయం కష్టమే. సత్యభామదీ ఇదే మనస్తత్వం. కాని ఆమె ప్రౌఢ. కృష్ణుడితో తగవులాడుతుంది. అలక బూనుతుంది. కోపిస్తుంది, కలహిస్తుంది. పరిపరి విధాల తలపోస్తుంది. అది కృష్ణునిపై ఇంకా ప్రేమను పెంచుతుంది.
“నిశీధిలో నేను” కవితలో పోజిటివ్ అలోచనలు అనిచెప్పానే అది ఈ కవితకు వర్తిస్తుంది. కవిత బాగున్నట్లు అనిపించినా ప్రతీకాత్మకంగా చూస్తున్నప్పుడు పరస్పర విరుద్ధంగా అనిపిస్తాయి.
చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను.
నిశీధిలో నియంత బ్రతుకు అయినా…
ఉషస్సు చూడలేక
తలను వంచిన ఈ క్షణం
ఇపుడు నాకు నచ్చుతుంది.
మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు.
ఇక ఎప్పటికీ కాదు
అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు………
ఇందులో పరస్పర విరుద్ధమైన భావాలు వున్నాయి. ఒకసారి తలను వంచితే సమర్థిస్తునట్టూ, అంగీకరించినట్టూ, మోసుకుపోతున్నట్టూ అవుతుంది. అది నచ్చితే దాన్నుంచి బయటకు ఎప్పుడూ రావాలనిపించదు. తలను ఎత్తినప్పుడే, లక్షణాలు నచ్చనప్పుడే ఛేదించే మార్గాలను అన్వేషణ చేస్తుంది మనసైనా, బ్రతుకైనా. ఉషోదయపు వెలుగుల్ని చూడటం ఒక శుభపరిణామం.
మబ్బులు ముసిరేది నా మనసును కాదు అని చెప్పడం పాజిటివ్ ఆలోచన. ఆ అలోచనలు నిర్మలంగా, స్వచ్ఛంగా, అప్పుడే పుట్టిన పసి పాపలా వుండటం మీ కల్పనా చాతుర్య ప్రతీక.
“జీవితం” కవితలో
కన్నీళ్ళ అనుభవాలు చెబ్తూ నిర్వచనం దిశగా మారిపోయారు.
ఏదో అసంతృప్తి కనిపిస్తుంది.
ఇలాంటిదే మరొకటి “మదికోరిన మరణం”
ఇంకా ఎదురు చూస్తూనే వున్నాను నువు వస్తావని
నాకు తెలుసు నీవు రావని ..రాలేవని
తిరిగి రాని సుదూర తీరాలకు తరలిపోయావని
అయినా నిరీక్షిస్తున్నాను ఎందుకో..నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపకం మది లో మెదులుతుండగా
మధురమైన భావాలను కలిగిస్తుంది
అసలు నువులేవన్న మాటనే మరిచిపోతున్నాను
మది కరిగించే నీ చిరునవ్వు కనులముందు కనిపిస్తూనే వుంది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే వుంది
ఒంటరినై వున్నపుడు నీ వెచ్చని స్పర్శ,
ఓదార్పుగా తీయని పలకరింపు తాలూకు భావన
ఇప్పటికీ నువ్వు వున్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే …నీవు నా వెంటే వున్నావన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా………….నీవు లేని నా కల సయితం ఊహించలేను
నీ నీడగా మారిన నా మనసుతో పాటూ నేనూ వస్తున్నాను
నిను చూడాలని..నీ దరి చేరాలని
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ…
నీ దరి చేరబోతున్న నేను
ఇందులో కన్నీళ్ళు, నల్లని అనుభవాలు పిండాలని ప్రయత్నించారు.
మనసుభాష: ఈ కవిత దగ్గరకు వచ్చేసరికి మీ కవితా ప్రయాణం రూపుదిద్దుకుంది. నిశ్శబ్ద సంగీతాన్ని ఇందులో ఇమడ్చగలిగారు. అద్భుతమైన చిత్రీకరణ కూడా.
ఏకాంత వనం లో
ఆమె - నేను
మౌనం గల గలా
మాట్లాడేస్తుంది.
మనసులు ఏమి అర్థం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయో
చిత్రంగా..
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి
“ఈ తరం” కవితలో..
“అలారం మోతలతో
ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలలులేని కలత నిదురలు”
నిజంగా ఈ తరానికి ప్రతీకే. జీవన శైలి ప్రతిబింబిస్తుంది.
“ఓ భావన” కవితలో
ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను…ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ
అమృతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనంతో వుంటుంది
అందరినీ తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ…
మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]…ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ
[] పెట్టకుండా రాసుంటే బాగుంటుందేమో
పసిపాపనై మురిపిస్తూ
అమ్మై మరిపిస్తూ నాన్నై లాలిస్తూ
ప్రేయసినై కవ్విస్తూ
అసూయై బాధిస్తూ
నేస్తమై ఓదారుస్తూ
- ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ
మిగిలింది చిరంజీవిగా
ఈ ప్రేమ.
ఆమె
తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను
తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను
గుండెల్లో నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను
గతమై నా వెనుక వుంటానంది
జతగా నా పక్క నడవమన్నాను
జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను
మొదట ఓదార్చింది–తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపంలో ఆమె
తన రాక కోసం
నచ్చిన నెచ్చెలి చెప్పే
తొలకరి చినుకుల్లాంటి ముద్దు మాటల్లో
ముద్దగా తడిసిపోవాలని
తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను.
ఒంటరిగా కాదులెండి
తోడుగా ఆమె తలపులు.
తను ఒకసారి వచ్చి వేల వసంతాలను
కానుకిచ్చి వెళుతుంది.
అనుభూతుల వానలో తడిపి
ఆరేలోపు వచ్చేస్తానంటుంది.
నాకు మాత్రం
మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్లతో
రేయి కలలా సాగిపోతుంది.
నెచ్చెలి తెచ్చే
నవ్వుల కోసం ఎదురుచూపుల్లో
మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది.
అద్భుతమైన కవితలు. మీది కాని స్వరూప స్వభావాన్ని వ్యక్తీకరిండం: ఇది వ్యక్తిగతానికి భిన్నం. సఫలమయ్యారు. ఈ కవిత్వాన్ని చదువుతూ తక్కువ రాసానేమో అని ఒకసారి, ఎక్కువ రాసానేమో అని ఒకసారి అనిపిస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక, భావాత్మక, ప్రగతిశీల, అభ్యుదయ, స్త్రీవాద కవిత్వాన్ని ముమ్మరంగా మీరు రాయాలని అభిలషిస్తున్నాను.
లేఖల గురించి ఓ మాట:
ఉత్తరాలు తరిగిపోని సంపద లాంటివి. దానికి కవిత్వం అద్దటం ఒక మహత్తర ప్రక్రియ. ఉత్తరాలు ఏకాంతం నుండి సమూహాల్లోకి, సమూహాల నుండి ఏకాతంలోకి వంతెనను నిర్మిస్తాయి. ఎవరి వంతెనకు వాళ్ళ నేపథ్యమే చిత్రాన్నిస్తుంది. నిర్మించడమే. మీరు మీ వంతెనను ప్రదర్శనకు పెట్టారు. సుమారు రెండు కిలోమీటర్లున్న రాజమండ్రి వంతెనలా. లండన్ లోని వంతెనపైనో, హౌరా వంతెనపైనో విహరిస్తున్నట్టు అక్షరాల వంతెన పైనుండి ఎవరికివారే మరో కొత్త వంతెన నిర్మించుకోవాలి.
బాల్యంలో తొక్కుడు బిళ్ళ ఆడినట్టు, యవ్వనంలో దాచి దాచి చదువుకున్నట్టు మనస్సులో కట్టుకున్న కొత్త ఫొటో ఫ్రేములా అనిపించాలి. అలా అనిపించాయి నాకు. ఈ అనుభూతులు మీ అక్షరాల మధ్య దాగివున్నాయి వెలికితీయండి.
పుస్తకంగా చేయతగ్గ కవిత్వం ఇందులోవుంది. విరివిగా రాయండి. బ్లాగులే కాకుండా ఇతర పత్రికల్లో కనిపిస్తారని ఆశిస్తూ..
అభినందనలతో…..
జాన్ హైడ్ కనుమూరి
---------------published in poddu.net
3182
8 comments:
చాలా చాలా అద్భుతమైన వ్యాసం. ఒక బ్లాగులోని కవితలపై కూలంకషంగా చర్చించటం, ప్రతీ వాక్యంలోని బలాబలాలను తూకం వేయటం, వాక్యాల మద్య అర్ధాలను వెలికితీయటం చాలా చాలా బాగుంది.
ఇలాంటి వ్యాసాలు వ్రాయటానికి విశ్లేషించటానికి, చాలా సాహసం, తెలివితేటలు, అపారమైన మేధ అవసరమవుతాయి. అవన్నీ పుష్కలంగా ఉన్న కనుమూరిగారికి అభినందనలు.
సుజాతగారికి అభినందనలు.
బొల్లోజు బాబా
@ జాన్ హైడ్ గారు
ఉదా : చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం ఇది పరస్పర విరుద్ధభావన.
నాకు దానిలో విరుద్ధ భావన కనపడలేదండి. చీకటి ని రాత్రి అనుకోవచ్చు కదా. నాకు చదివిన వెంటనే అదే అనిపించింది. ఇక మీ విశ్లేషణ ప్రకారమైతే చంద్రుడు 15 రోజులు ఉంటాడు. ఫున్నమి రోజు మాత్రమే చీకటి పూర్తిగా తొలిగిపోయినట్టు ఉంటుంది. అయినా కానీ నాకు ఆ 15 రోజులు వివిధ పరిమాణాల్లో ఉన్న చందమామ నాకు ఇష్టమైన చుట్టమే. కాబట్టి రాధిక గారు రాసిన రెండు వరసలు సహజ సూత్రాలని అనుసరించే అనిపిస్తుంది నాకు.
@ జాన్ హైడ్ గారు
పైన 15 రోజులు అని రాసింది వెన్నెల పంచే రోజులని. అలా కాకపోతే 29 రోజులు మనకి చంద్రుడు కనపడతాడు.
అయ్యా బొల్లబోజు బాబా గారు
ఈ వ్యాసం గతంలో పొద్దులో ప్రచురించారు.
ఇది రాయడానికి పొద్దు(త్రివిక్రం) ప్రొత్సాహం ఎంతైనావుంది.
వివిద కారణాల వల్ల బహుశ రెండునెలలు పట్టింది పూర్తి చేయడానికి.
రెండు మూడు సార్లు తిరిగిరాయటం( రీ రైట్) జరిగింది.
మి స్పంధనకు ధన్యవాదాలు.
అయ్యా ఏకాంతపు దిరీపు గారు
ఇంగ్లీషులో ఒక సామెతవుంది.
"నీ స్నేహితుడెవరో చెప్పు, నీవు ఏమిటొ చెబుతాను" అని.
అలాగే చీకటి దేనికి ప్రతికలో కూడా వివరించాను.
చీకటి తెచ్చే స్నేహితులు చీకటిలాగే వుంటారు తప్ప ఇందులో చంద్రుని లెక్కలతో పనేముముంది.
మీ చక్కని స్పందనకు ధన్యవాదములు.
జాన్ గారూ మీకు మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.చీకటి అన్నపదం అక్కడ ఎలా సరిపోలేదో అన్న మీ వివరణతో నేను ఏకీభవిస్తున్నాను.నిజమే అది ఆర్ధంలోనే ధ్వనిస్తుంది.కానీ అక్కడ అన్నీ చకారాలతో మొదలు పెట్టాలన్న కోరికతో అలావాడడం జరిగింది.అలాగే చంద్రుడుంటే అది చీకటి అవ్వదుకదా.అంతో ఇంతో వెలుగుంటుందికదా.ఈ రకం గా చూసినా నేను అక్కడ రాసింది తప్పే.తరువాతి నుండి ఇలాంటి తప్పులు రాకుండా చూసుకుంటాను.
నెనర్లు
రాధిక గారు
మిమ్మల్ని తప్పు పట్టాలని నా వుద్దేశం కాదు.
ప్రతీకలుగా తీసుకున్నప్పుడు ఎలాస్పురిస్తుందనే నేను వివరించాను.
చకార ప్రయోగ బాగుంది అని నాకు అనిపించినా భావం పంటి క్రిది రాయిలా అనిపించి చకార ప్రయోగం గురించి చెప్పలేదు.
జాన్ హైడ్ గారూ.
అమ్మ సంకలనం చాలా బాగా చేశారు. ప్రతీ పేజీకీ ఒక జరీ అంచు, అద్దిన రంగులు, అతికినట్టున్న బొమ్మలు .. సౌందర్యం కోసం మీరు పడే తపన కనిపించింది, ఫలించింది. కథనాలు కూడా చాలా బాగున్నాయి మనసుకి హత్తుకునేలా.
మీకూ, రచయితలందరికీ కూడా అభినందనలు.
Post a Comment