Saturday, April 19, 2008

వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??


అప్పటిదాకా భయపెట్టిన చలి
దుప్పటి దులిపి పారిపోతున్న వేళ
చికురాకుల వగరు తిన్న కోయిల
కుహు కుహు రాగాలాపన చేస్తున్న వేళ
చేదునింపుకున్న వేప తేనెలొలుకు పూలై విరబూస్తున్న వేళ
వచ్చిందంట వసంతం
దాని వర్ణన కవులకే సొంతం
అనుభూతి ఓ అనంతం

యంత్రాలవలె కదలికలతో వాహనాలరొదలలో
క్షణం కోసం అనుక్షణం పోరాడుతూ
కాలంవెనుక వడివడిగా పరిగెడుతున్న వేళలో
గ్లోబునంతా జేబులొ పెట్టాలని
సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ అంటూ
కొత్తవేళ్ళూనుతున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

వెండితెర తారల తళుకు బెళుకులతో
నెట్‌లోని బ్రౌసింగు రూములలో చాటింగులతో
పబ్‌లలో హంగుల పొంగులతో
హోరెత్తించే బీటులోని నోటులతో
నూతన విరామాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్న సమయయంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

సస్యశ్యమలమనిపించే సీమలో
కాలే కడుపుతో బక్కచిక్కిన రైతు
నీవు వస్తావని సిరులెన్నో తెస్తావని
ఎదురుచూస్తున్న సమయంలో
పుట్లునింపాలని పట్టెడాశతో
పుస్తెలనమ్మి ఎరువేస్తే
వరదొచ్చి పురుగొచ్చి కరువొచ్చి
వెన్నుపై వెన్ను విరిచిన వేళ
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

నిన్నెరిగిన వారు నీకై స్పందించినవారు
నిన్నాశ్వాదించిన వారు
నీతో నడవలేక నవతరంతో ఇమడలేక
మమతల కరువై వెతల బ్రతుకై
కాలం పొరలమాటున దాగిన జ్ఞాపకాలను
నెమరేసుకుంటున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

ఉన్నత విద్యా సాధనలో
సుదూరతీరాలకు నిచ్చనవేసే ఆరాటంలో
భాషా సౌదర్యాన్ని గాలికి వదిలేసి
సబ్జెక్టులతో సెట్తులకై కుస్తీ పడుతూ
నిరంతరం అవిశ్రాంతంగా పోటీపడే
తాపత్రయంలో నిమగ్నమైపోతుంటే
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

మానవత్వాలు మరచి
బంధాలు పొడి బారిపోతున్న వేళ
వలస బ్రతుకుల మధ్య మనిషి
వ్యాపార వస్తువైపోతూ
వర్గవర్గాలుగా విడివడిపోతున్న వేళలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

1 comment:

pruthviraj said...

చాలా పెద్దఆలొచనలు, లోతైన బావాలు. చాలా చాలా బావుంది.superb. చాలా సంతోషం.