Monday, January 21, 2008

అయ్యలారా! అమ్మలారా!

అయ్యలారా! అమ్మలారా!
గురువులారా! శిష్యులారా!అభిమానులారా! విమర్శకులారా!
చిన్న విన్నపము
నేను మృదులాంతరముతో పనిచేస్తున్నవాణ్ణి కాదు.
నేను పనిచేస్తున్న చోటులో అప్పుడప్పుడూ టపాలను చూసే బాద్యత వుండటం వలన మృదులాంతరము వాడవలసిన అవసరం ఏర్పడింది.
ఇక నా చదువు గురించో మాట.పదవతరగతిలో తెలుగు బోధకునికి భయపడి తరగతులు చాలా ఎగ్గొట్టిన సందర్భాలు వున్నాయి. ఆభయమే ఇంటర్మీడియెట్‌లో రెండవ భాషగా తెలుగుకు బదులు హిందీ తీసుకొనేటట్టు చేసింది. అదీ పూర్తిగా వంటబట్టిందని నమ్మకంలేదు. కాలేజీలో పూర్తిచెయ్యని డిగ్రీ సార్వత్రిక విద్యద్వారా పూర్తిచేసి, తర్వాత 'లా'లో దాఖలా అయ్యాను.
మద్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగపూర్ దగ్గర చింద్వాడ ఇలా అనేక చోటులలో వివిధ రకాల పనులుచేసాను. వీటన్నింటి మద్య తెలుగు సాహిత్యం మీద, అందులోనూ కవిత్వం మీద ఎందుకు మక్కువ ఏర్పడిందో నాకే అర్థం కావటంలేదు.కాకపోతే నా జీవిత, జీవన సమస్యల మద్య తగులుకున్న మద్యపాన వ్యసనాన్ని వదిలివేయడనికి కవిత్వం మంచి ఆసరానిచ్చింది.అప్పటినుండే రాయటం మొదలయ్యింది.
సాహిత్యంలొ వున్న పరిస్తితులను చూసి ఎందుకు రాస్తున్నాను నేను రాయటం అవసరమా అని మానేద్దాం అనుకునే సమయంలో ఏదో ఒక సంఘటన మళ్ళీ రాసేటట్టు చేస్తుంది।అలాంటి ఒకానొక సమయంలోనే ఈ బ్లాగులు పరిచయమయ్యాయి। గత కొన్ని మాసాలుగా ఏ పత్రికలకి నా రచనలు పంపలేదు।చిందరవందరగా పడివున్న నా అక్షరాల గీతలను నాకోసం మృదులాంతరం చేస్తున్నాను. ఎప్పుడైనా చదువుకోవచ్చని. మీకు నచ్చితే చిన్నగా భుజం తట్టండి. అంతే గాని ఇందులోకి ఎందుకు వచ్చాను అనుకునేలా చెయ్యకండి.

5 comments:

రవి said...

జాన్ హైడ్ గారు, బాధేసింది మీ ఉత్తరం చూసి. ఈ బ్లాగు లోకం మన తెలుగు వాళ్ళ అందరిదీను. మ్రుదులాంత్రం వ్యక్తుల గుత్త సొమ్ము కాదు. మనసు నొచ్చుకోకండి.

Rajendra Devarapalli said...

జాను గారూ,కవిని కాకపోయినా ఆమనోస్పందన నేను ఎరుగుదును.మొన్నో రోజు ఒక అనామకుడు రాసిన కామెంటు నేనూ చదివా.కానీ వాగుడంతా వ్యాఖ్యానాలు కావని మీకు తెలుసు.బ్లాగరుగా మీ నిబద్ధత అందరికీ తెలుసు,తెలిసీ కూసే కూతలకు మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు.ఈమధ్య మీరే అన్నారు లోగోం కా కామ్ కెహనా అని ...

రాధిక said...

ఎవరేమన్నా మీరు మాట్లాడకుండా మెత్తగా వుంటున్నారు.అందుకే లోకువకట్టి మరీ ఎక్కువగా రాస్తున్నారు.మన జ్యోతి గారిలా ఒక్క దులుపు దులపండి.వాళ్ళే మానేస్తారు.

Anonymous said...

మీ భావప్రకటన మీది. అవతలవారి అభిప్రాయాలు మనసులో పెట్టుకుంటే ఎలా? అలా అయితే చలం, విశ్వనాధలు ఒక్క రచనైనా చేసేవారా? చక్కటి భావాలను పదినైన పదాలతో చెప్పగల మీరే ఇలా అనడం భావ్యం కాదు. మీరే అన్నట్టు వేయిమందికి పైగా ఉన్నాం. ఝంఝామారుతమై వీయబోతున్నాం. పత్రికల్లో అక్షరం ప్రామాణికమేమీ కానక్కర్లేదని చాటబోతున్నాం. ఒహో, నాకైతే బ్లాగు సాహితీ భవితను ఊహిస్తున్న కొద్దీ చవులూరిపోతున్నాయి.

అగంతకుడు said...

సార్,
ఇలా దిగులు పడితే కష్టం. మన మది దాటి అక్షరరూపం దాల్చిన ఆలోచన మనదైనప్పటికీ అది మనల్ని దాటి వెళ్ళింది కాబట్టి దానికి రావల్సిన స్పందన వస్తుంది. అది మంచైనా చెడైనా ఒకేలా భావించాలని మనవి. గిచ్చితే నొచ్చుకోకండి. మెచ్చితే ఇచ్చుకోకండి.ఒక వ్యసనం వదలడానికి వచ్చి మరో వ్యసనంలో ఇరుక్కోకండి. ఇక్కడ మంచి రాసే వాళ్ళుంటారు. చెడు రాసే వాళ్ళుంటారు. మంచీ-చెడూ రాసే వాళ్ళుంటారు. రాస్తూనే వుండండి.