Tuesday, November 27, 2007

బ్లాగ్విషయం - స్నేహం5

నేను - నా కలం స్నేహితులు

ఉత్తరాలు రాయటం చాలా ఇష్టమైన ప్రక్రియ నాకు. అందులోంచి కలంస్నేహం చేయడం అలవాటయ్యింది. ఒక అద్భుత అజ్ఞాత స్నేహాన్ని మీముందుంచుతానికి చిన్న ప్రయత్నం. బహుశ ఇది 1979-1982 ల మద్య.
ఉద్యోగాలవేటలో హైదరాబాదు వస్తున్న కాలం. అలా వచ్చిన కొందరికి సంజీవరెడ్డి నగర్ లోని ఎ.రావుగారి ఇల్లు చిరునామా కేంద్రం. అక్కడికి మావూరు చుట్టుప్రక్కల లేదా కలిసిచదువుకున్న వారు అక్కడికి చేరేవాళ్ళం. శనివారం సాయంకాలం, ఆదివారం మద్యాహ్నం తరువాత అక్కడికి చేరటం అలవాటయ్యింది. అక్కడే కమల, లలిత, వాణి, రాణి పరిచయమయ్యారు.

నేను అప్పుడు ప్రసన్నకుమారి పేరుతో కలంస్నేహపు ఉత్తరాలు రాసేవాణ్ణి. ఆ విషయమే వారితో చెప్పాను. వాళ్ళుకూడా ఉత్సాహంగా వివరాలు తెలుసుకొనేవారు. అలా పరిచయాల్లో మద్రాసులో ఇంజనీరింగు చదువుతున్న హనీఫ్ అనే కుర్రాడితో ఉత్తరాలు దాదాపు రెండు సంవత్సరాలు నడిచాయి. నన్ను అమ్మాయి అనుకోవడం వల్ల ఉత్తరాల విషయంలో కమల, లలిత, వాణి, రాణి కొంచెం ఉత్సాహం చూపేవారు. వాళ్ళ సలహాలతో రాయటంవల్ల నేను అమ్మాయిని కాదే విషయం తెలియకుండానే రాయటం కుదిరింది.

రెండేళ్ళ తర్వాత అతని ఇంజనీరింగ్ పూర్తి అవుతుందని మద్రాసు విడిచి మళ్ళీ ఉద్యోగ వేటలో హైదరాబాదు వస్తున్ననని రాసాడు. అప్పటి వరకూ సలహాలిచ్చిన వాళ్ళు ఒకొక్కరుగా వారి జీవితాల్లో, ఉద్యోగాల్లొకి వెళ్ళిపోవటంవల్ల నేను అప్పటివరకూ దాచిన నిజాన్ని చెప్పేసాను. ఉత్తరాలద్వారా చాలానేర్చుకున్నానని, అయితే అమ్మాయి అని దాచటం ఇప్పుడు చెప్పడం బాధ కలిగించిందని రాసాడు. ఎప్పుడూ కనీసం రాసేది ఆడపిల్ల, మగపిల్లాడా అని అనుమానమే రాకుండా రాయటం ఆశ్చర్యానికి గురిచేసిందని రాసాడు. ఉత్తరాలంద్యలో కొన్ని ఫోటోలు కూడా పంపాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత నేను జబల్ పూర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు విజవాడకు చెందిన ఒకాతను నా రూములో కొన్నిరోజులు వున్నాడు. ఏదో సందర్బంలో నా అల్బం చూసి హనీఫ్ విజయవాడలో వున్నాడని చెప్పాడు. కాని మళ్ళీ ఉత్తరాలను రాయలేదు.

లలిత, రాణి, వాణి ఎక్కడున్నారొ కూడా తెలియదు. కమల దగ్గరలో ఉంటున్నా కలిసిన సందర్బాలే లేవు.
చిత్రమైన జ్ఞాపకం, అనుభవాలు, ఉత్తరాలు చాలాకాలం దాచాను కాని అద్దె ఇళ్ళతో కష్టమై ఎక్కడో జారిపొయాయి.

3 comments:

జ్యోతి said...

జాన్‍గారు, నిజంగా మీ మనసు పుటల్లోంచి ఎంతో మంది స్నేహితులు ఒక్కరొక్కరుగా బయటికొస్తున్నారు. గ్రేట్...

బ్లాగ్విషయంలో ఇంత శ్రద్ధగా రాస్తున్నందుకు అభినందనలు..

రాధిక said...

రెండేళ్ళ స్నేహం లో అతనికి ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు?ఏమన్నా ప్రత్యేక కారణమా?లేక సరదాగా చేసారా?నాకు ఒకే ఒక కలం స్నేహితురాలుండేది.ఆమె కూడా నా ప్రాణ స్నేహితురాలికి డిగ్రీ కాలేజీ హాస్టల్ లో రూమ్మేటు.ఉత్తరాలతో మాట్లాడుకున్నంతగా నిజం గా కలిసినప్పుడు మాట్లాడుకోలేకపోయాము.ఎందుకో మరి?

Anonymous said...

ఈ మధ్య బ్లాగుల్లో అభిప్రాయాలు పంచుకుంటున్నప్పుడు పరిచయమైన వారు ఒక రకంగా "కలం" స్నేహితుల వంటి వారేనేమో?
నా మటుకు నాకు ఇలా పరిచయమైన వారు నిజంగా ఎదురైతే ఎలా స్పందిస్తానో తెలియదు.
బహుశా సులభంగా "converse" కూడా చెయ్యలేనేమో.